చిటానీ చికెన్ కర్రీ… తింటారు మళ్లీ మళ్లీ…
చికెన్‌తో కొన్ని వందల రకాల కర్రీలు వండుకోవచ్చు. వాటిలో ప్రత్యేకమైనది చిటానీ. అది ఎలా తయారుచెయ్యాలో తెలుసుకుందాం.
సండే రాగానే చికెన్ కర్రీ వండుకోవడం కామన్. ఐతే… ఎప్పుడూ ఒకేలా వండుకుంటే వరైటీ ఏముంటుంది. కాస్త కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందిగా అనుకుంటున్నారా… ఐతే… చిటానీ చికెన్ కర్రీ మీ కోసం సిద్ధంగా ఉంది. ఇది చికెన్‌ను రోస్ట్ చెయ్యడం ద్వారా తయారు చేస్తాం. చాలా మంది దీన్ని పులావులో కలుపుకొని తింటారు. ఈ విధానంలో చికెన్‌తో పాటూ చేపల్ని కూడా ఇలాగే వండుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చిటానీ చికెన్ కర్రీ వంటకం ఫేమస్ అవుతోంది. ఎందుకంటే… ఈ విధానంలో రోస్ట్ అయిన తర్వాత చికెన్ టేస్ట్ చాలా బాగుంటోందని చాలా మంది చెబుతున్నారు. మరి ఇంకెందుకాలస్యం… మనమూ తయారుచేసేద్దాం…
చిటానీ చికెన్ కర్రీకి కావాల్సినవి :
చికెన్ ముక్కలు (పెద్దవైతే 6 చిన్నవైతే 10) (తొడ, పొట్ట, రెక్కలకు చెందినవి)
టమాటాలు 4 (ముక్కలు చేసి ఉంచుకోవాలి)
ఉల్లిపాయలు 3 లేదా 4 (సన్నగా తరుగుకోవాలి)
ఎండుమిర్చి 2-3 (కట్ చేసి పెట్టుకోవాలి)
చింతపండు రసం (3 టీస్పూన్లు)
నూనె (2 టేబుల్ స్పూన్లు)
అల్లం – 1 టేబుల్ స్పూన్ (పేస్ట్ చేసుకోవాలి)
వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్ (పేస్ట్ చేసుకోవాలి)
కొత్తిమీర పౌడర్ – 2 టీస్పూన్లు
జీలకర్ర పౌడర్ – 2 టీస్పూన్లు
ఉప్పు – 2 టీస్పూన్లు
షుగర్ – 2 టీస్పూన్లు
నీరు – కావాల్సినంత
నిమ్మరసం – కావాల్సినంత
తయారీ విధానం :
– బాణలి (ప్యాన్)లో నూనే వేసి… సిమ్‌లో వేడి చెయ్యాలి. తరిగిన ఉల్లి ముక్కల్ని అందులో వెయ్యాలి. అవి కాస్త గోధుమ రంగులోకి మారాక… అల్లం, వెల్లుల్లి పేస్ట్ వెయ్యాలి. వెంటనే మిర్చి ముక్కల్ని వెయ్యాలి.
– ఇప్పుడు జీర, కొత్తిమీర పౌడర్ వెయ్యాలి. సువాసన వస్తున్నప్పుడు… కలర్ బ్రౌన్‌లోకి మారకముందే… టమాటాల ముక్కలు, చింతపండు రసం, ఉప్పు, చక్కెర (షుగర్) వెయ్యాలి.
– ఇప్పుడు ఈ మిశ్రమం కాస్త గట్టిపడి… పేస్ట్ లాగా మారుతున్న టైంలో… ఓ కప్పులో మూడొంతుల వాటర్ తీసుకొని బాణలిలోని కర్రీలో పొయ్యాలి.
– ఇప్పుడు బాణలిలో గ్రేవీ… ఉడుకుతూ… బుడగలు వస్తూ ఉన్నప్పుడు… చికెన్ ముక్కలు వేసేయాలి. సిమ్‌లోనే ఉంచి… మూత పెట్టాలి. ఓ 10 – 15 నిమిషాలు అలా ఉంచాలి. కావాలంటే మధ్యలో ఓసారి ముక్కల్ని అటూ ఇటూ కదపొచ్చు.
– పావుగంట తర్వాత… మూత తీసి అలా వదిలేయాలి. తద్వారా… గ్రేవీ కాస్త గట్టిపడి… ముక్కలకు బాగా టచ్‌లో ఉంటుంది.
– ఇప్పుడు ఆ కర్రీపై నిమ్మరసం వేసి… సెర్వ్ చేసి… వేడివేడిగా తింటే ఉంటుందీ… నా సామిరంగ… లొట్టలేసుకొని తింటారు. అందుకే ఈ కర్రీ వరల్డ్ ఫేమస్ అవుతోంది.