సెక్స్ తర్వాత నొప్పి, మంటగా ఉంటోందా..
నేటి కాలంలో చాలా మంది శుభ్రతకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ పార్ట్స్‌ని కూడా క్లీనర్స్‌తో శుభ్రం చేసుకుంటున్నారు. దీని వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా తెలుసుకోండి..
సెక్స్ తర్వాత నొప్పి, మంటగా ఉంటోందా..
మెనోపాజ్ ముందూ, తరవాతా యోని పొడిబారటమన్నది సాధారణమైన విషయమే. కానీ, వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య ఎప్పుడైనా కనిపించొచ్చు. ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గినప్పుడు యోని పొడిగా అవుతుంది. ఈ హార్మోన్ యోని లోపలి పొరని మందంగా, తడిగా, సాగే గుణంతో ఉంచుతుంది.
యోని పొడిబారటం పెద్ద సమస్య కాదని అనుకుంటున్నారా.. కానీ, అది స్త్రీ సెక్స్ లైఫ్ మీద బాగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల మహిళలు రతి సమయంలో నొప్పినీ, అసౌకర్యాన్నీ ఎదుర్కొంటారు. అయితే, ఈ సమస్యని తగ్గించడానికి చాలా చికిత్సావిధానాలు అందుబాటులో ఉన్నాయి.
కారణాలు ఇవే..
సాధారణంగా ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గిపోయినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. మెనోపాజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గుతూ ఉంటుంది. ఓవరీలు ఈస్ట్రోజెన్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ వల్లే స్త్రీ శరీరపు ఆకృతీ, రొమ్ముల పెరుగుదల ఉంటాయి. రుతుచక్రం లోనూ, గర్భధారణలోనూ కూడా ఈస్ట్రోజెన్ హార్మోన్ కీ రోల్ పోషిస్తుంది.
యోని లోపలి పొరని ఈస్ట్రోజెన్ మందంగా, తడిగా, ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ఈ హార్మోన్ స్థాయి తగ్గుతుంటే మహిళలు యోని లోపలి పొర పల్చగా అవ్వడం, పొడిగా అవ్వడం, సాగే గుణం తగ్గడం, గులాబీ రంగు నుంచి నీలం రంగులోకి మారడం లాంటి మార్పులు గమనిస్తారు. ఈ మార్పులని వజైనల్ యాట్రొఫీ అంటారు.
ఇవి కూడా కారణాలే..
– ప్రసవం, బిడ్డకు పాలివ్వడం
– కాన్సర్ చికిత్స, రేడియేషన్, కీమోథెరపీలతో సహా
– సర్జికల్ మెనోపాజ్ – ఏ కారణం వల్లనైనా ఓవరీలని సర్జరీ ద్వారా తొలగించడం
– రొమ్ము కాన్సర్, ఎండోమెట్రియాసిస్ కి వాడే లుప్రాన్, జోలాడెక్స్ లాంటి యాంటీ-ఈస్ట్రోజెన్ మందులు
ఇతర కారణాలు:
– షోగ్రిన్స్ సిండ్రోం – ఈ సమస్య ఉన్నవారికి నోరూ, కళ్ళూ పొడిగా అయిపోతూ ఉంటాయి. దీని వలన యోని పొడిగా అవ్వడం కూడా జరుగుతుంది.
– యాంటీ-హిస్టమైన్స్ – ఈ మందులు జలుబుకీ, ఎలర్జీ కీ వాడతారు. వీటి వలన యోని పొడిబారడం, మూత్రవిసర్జన లో సమస్యలు తలెత్తడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
– యాంటీ-డిప్రెసెంట్స్ – యాంటీ-డిప్రెసెంట్స్ వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లో యోని పొడిగా అవ్వడం, కోరిక తగ్గడం, భావప్రాప్తి చేరుకోలేకపోవడం లాంటి సమస్యలుంటాయి.
వజైనల్ యాట్రొఫీ, వజైనల్ డ్రైనెస్ వల్ల సెక్స్ సమయంలో నొప్పి, అసౌకర్యం ఉండడమే కాకుండా వజైనల్ ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గడం వలన యూరినరీ ట్రాక్ట్ లోపలి పొర కూడా పలచగా అవుతుంది. అందువల్ల ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు వెళ్ళాల్సి రావడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్ లాంటి సమస్యలు ఎదురౌతాయి. వీటిని జెనిటోయూరినరీ సిండ్రోం ఆఫ్ మెనోపాజ్ అని అంటారు. దీని వల్ల సెక్స్ తరువాత రక్తస్రావం, యోనిలో మంట, దురద లాంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల వల్ల మహిళలు సెక్స్ ని ఎంజాయ్ చేయలేరు.
మెనోపాజ్ వల్ల వచ్చే లక్షణాలు మహిళకీ మహిళకీ మారుతూ ఉంటాయి. ఇద్దరికి ఒకేలాంటి లక్షణాలు ఎప్పుడూ ఉండవు.