Sports

కేరళ రంజీలోకి శ్రీశాంత్

కేరళ రంజీలోకి శ్రీశాంత్

స్పాట్‌ఫిక్సింగ్‌ కేసులో ఇరుక్కున్న టీమ్‌ఇండియా పేసర్‌ శ్రీశాంత్‌కు కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌(కేసీఏ) నుంచి అవకాశం లభించింది. ఈ సెప్టెంబర్‌లో అతడిపై విధించిన ఏడేళ్ల నిషేధం పూర్తికానున్న నేపథ్యంలో కేరళ రంజీ జట్టులో తీసుకోడానికి సిద్ధపడింది. అయితే, అప్పట్లోపు శ్రీశాంత్‌ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరు రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లని దిల్లీ పోలీసులు 2013 మేలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ అతడిపై జీవితకాల నిషేధం విధించింది. సుదీర్ఘ విచారణల అనంతరం దిల్లీ స్పెషల్‌ కోర్టు 2015లో ఈ కేరళ పేసర్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అయినా, బీసీసీఐ అతడిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తేయలేదు. ఈ క్రమంలోనే 2018లో కేరళ హైకోర్టు బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. చివరగా 2019లో సుప్రీంకోర్టు అతడి నిషేధాన్ని సమర్థిస్తూనే శిక్షాకాలం తగ్గించాలని బీసీసీఐని కోరింది. దీంతో అతడిపై విధించిన జీవిత కాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించింది. అది ఈ సెప్టెంబర్‌లో ముగియనుంది. ఈ సందర్భంగా శ్రీశాంత్‌ మాట్లాడుతూ తనకు మళ్లీ అవకాశం ఇచ్చిన కేరళ క్రికెట్‌ సంఘానికి కృతజ్ఞతలు చెప్పాడు. కేసీఏకు తాను రుణపడి ఉంటానన్నాడు. తన ఫిట్‌నెస్‌ నిరూపించుకొని మళ్లీ ఆటలో చెలరేగుతానని విశ్వాసం వ్యక్తం చేశాడు. కేసీఏ సెక్రటరీ మాట్లాడుతూ.. అతడి పునరాగమనంతో తమ జట్టు బలపడుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశాడు. కాగా, శ్రీశాంత్‌ టీమ్‌ఇండియా తరఫున 27 టెస్టుల్లో 87 వికెట్లు తీయగా 53 వన్డేల్లో 75 వికెట్లు తీశాడు. ఇక 10 టీ20ల్లో 7 వికెట్లు సాధించాడు. అతడు 2007, 2011 ప్రపంచకప్‌ జట్లలోనూ సభ్యుడిగా కొనసాగిన సంగతి తెలిసిందే.