Sports

పాంటింగ్ నోరు మూయించిన గంభీర్

పాంటింగ్ నోరు మూయించిన గంభీర్

టీమిండియా మాజీ ఓపెనర్‌‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఎంతటి ముక్కుసూటి ఆటగాడో అందరికీ తెలిసిందే. మైదానంలో ఎవరు కవ్వించినా ఢీ అంటే ఢీ అనే వ్యక్తిత్వం అతడిది. ఈ క్రమంలోనే మైదానంలో పలుమార్లు ప్రత్యర్థుల కవ్వింపులకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఐపీఎల్‌లోనూ ఒకసారి టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. అలాంటి క్రికెటర్‌ ఒకసారి ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ను స్లెడ్జింగ్‌ చేయడాన్ని ఆస్వాదించినట్లు చెప్పాడు. గంభీర్‌ తాజాగా క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆ ఛానెల్‌ వ్యాఖ్యాత ఓ ప్రశ్న అడిగాడు. ‘ఆటలో ఎవరిని స్లెడ్జింగ్‌ చేసి బాగా ఆస్వాదించావు?’ అని ప్రశ్నించాడు. దానికి స్పందిస్తూ.. పాంటింగ్‌ పేరు చెప్పాడు. ‘అది 2008లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌. అనిల్‌ కుంబ్లే కెప్టెన్‌గా ఉన్నాడు. బెంగుళూరులో తొలి టెస్టు సందర్భంగా నేను డబుల్‌ సెంచరీ చేశాను. అప్పుడు రికీ పాంటింగ్‌ సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. అదే సమయంలో నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. ‘‘నువ్వు ప్రపంచంపైన ఏమాత్రం ప్రభావం చూపలేదు’’ అని పేర్కొన్నాడు. దాంతో నేను కూడా అంతే దీటుగా స్పందించాను. ‘‘నువ్వు కూడా భారత్‌ గడ్డపై చేసిందేం లేదు. నిజం చెప్పాలంటే నువ్విక్కడ విఫలమయ్యావు‌’’ అని బదులిచ్చా. అతడి రికార్డులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తాయి. భారత్‌లో పాంటింగ్‌ చేతకానివాడు’ అని మాజీ ఓపెనర్‌ వివరించాడు. కాగా, ఆసీస్‌ మాజీ సారథి గణంకాలు నిజంగానే భారత్‌లో గొప్పగా ఏమీ లేవు. ఇక్కడ 14 టెస్టులు ఆడిన పాంటింగ్‌ 26.48 సగటుతో 662 పరుగులు చేశాడు.