నవ్వడం యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం రోగం అనే సరికొత్త నిర్వచనాన్ని జనాలకి తెలియచేశాడు జంద్యాల గారు. తెలుగు వాకిళ్ళ ముందు హాస్య తోరణాలు కట్టి అందరిని కడుపుబ్బా నవ్వించిన తెరవెనుక నాయకుడు అతను. ఈ హాస్య బ్రహ్మ వర్ధంతి నేడు. 1951 జనవరి 14న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జంధ్యాల పుట్టారు.
చిన్నతనం నుంచే నాటకాలపై ఆసక్తి ఉన్న అయన స్వయంగా నాటికలు రాసేవారు. హాస్యమంటే ఆయనకు చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లోనే నటుడిగా, నాటక రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్నారు జంద్యాల. కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరిసిరిమువ్వ సినిమాతో మాటల రచయితగా పరిచయం అయ్యారు. శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం జంధ్యాల రచనా నైపుణ్యానికి నిదర్శనాలు.
మాటల రచయితగానే కాకుండా దర్శకుడిగా అడుగులు వేశారు. ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా తన విజయయాత్ర మొదలుపెట్టారు. తన ప్రతిభకు రెండు వైపులా పదును ఉందని నిరూపించుకున్నారు. నాలుగు స్థంబాలాట, రెండు జడల సీత వంటి చిత్రాలను అందించారు. జంధ్యాల రూపొందించిన ఒక్కో చిత్రం ఒక్కో విధంగా గిలిగింతలు పెడుతుంది. హాస్య రసంలో ఎన్ని కోణాలు ఉన్నాయో అన్నింటిని ఆయన ఆవిష్కరించారు.
తన మాటల్లో కేవలం హాస్యాన్నే కాదు.. కన్నీళ్లను కూడా పెట్టించగలడు జంధ్యాల. బ్రహ్మానందం, నరేష్, సుత్తివేలు, పూర్ణిమ వంటి ఎందరో నటుల్ని వెండితెరకు పరిచయం చేసింది జంధ్యాలే. రావుగోపాల్ రావు, నూతన్ ప్రసాద్, కోటశ్రీనివాసరావులతోనూ నవ్వుల జల్లులు కురిపించిన ఘనత జంధ్యాలది. మాటలతోటే కాదు.. కేవలం హావాభావాలతోని ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించడంలో జంధ్యాలది ప్రత్యేక శైలి.