‘అమ్మాయే సన్నగా..’ అనేది కాదు ఇప్పుడు ‘అమ్మాయే ఆరోగ్యంగా..’ ఉండాలి అనేది ప్రధానం. సన్నగా ఉండాలని పొట్ట మాడ్చేసి, లేనిపోని అనారోగ్య సమస్యల్ని కొనితెచ్చుకుంటున్నారు చాలామంది. చదువుకునే వారు, నిపుణుల మొదలు సామాన్యుల వరకు వీలున్నంత మేర సన్నగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. అందుకోసం చేసే ప్రయత్నంలో అనారోగ్యకర పద్ధతులను, తేలికగా, కొద్దిరోజుల్లోనే ఫలితాలు కనిపించాలనే తాపత్రయం పెరిగింది. ఫలితంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలనూ కొని తెచ్చుకుంటున్నారు. అలా అని ఊబకాయంతో ఉండడమే మేలని కాదు. అదీ అనారోగ్యమే. అందుకే చక్కగా తింటూ ఆరోగ్యంగా ఉండడం మీదే దృష్టి పెట్టాలి. మన శరీర పరిస్థితి, స్వభావం, బరువు తదితర అంశాల ప్రాతిపదికన కనీస స్థాయిలో వ్యాయామాలు చేస్తూ ఉండాలి. చాలా మంది పొరబాటు పడుతున్నట్లు ఆహారం తీసుకున్నామని విపరీతంగా వ్యాయామం చేయాల్సిన పని లేదు. ఒకేసారి సన్నబడాలని ఏమీ తినకుండా పొట్టను ఖాళీగా ఉంచితే గ్యాస్ట్రిక్ సమ్యలు ఏర్పడతాయి. ప్రతి మూడు, నాలుగు గంటలకు కొంచెం కొంచెం ఆహారం ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, గింజలు, పప్పు ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. వాటిని తినేందుకు ఒక చక్కని ప్రణాళికను రూపొందించుకోవాలి. ఎక్కువసేపు శక్తిని నిలిపే ప్రోటీన్స్, పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. చక్కెర తక్కువ ఉన్న పదార్థాలు, చక్కెరకు బదులుగా బెల్లం, తేనె, ఖర్జూరాలు, పటిక బెల్లం వంటి ప్రత్యామ్నాయ తీపినిచ్చేవి తీసుకోవాలి. రోజుకి 10-12 గ్లాసుల నీరు తాగాలి. 60 నుంచి 70 శాతం ఆహారం, మిగిలిన 30 నుంచి 40 శాతం నీటిని తీసుకోవాలి. పిజ్జా, బర్గర్స్ స్థానంలో గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. మూడు నాలుగు వారాలకొకసారి మాత్రమే డైట్ ప్లాన్‌ను మార్చాలి. తరచూ మార్చడం వలన జీవప్రక్రియ దెబ్బతినే ప్రమాదం ఉంది.ఉదయం కనీసం గంటసేపు చేసే వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం వీలుకాకపోతే సాయంత్రం అయినా వెళ్లాలి. దీనివల్ల శరీరమంతా బాగా కదలి, అన్ని అవయవాలూ చురుగ్గా పనిచేస్తాయి. ప్రతరోజూ వీలుకాకపోతే వారానికి ఐదురోజులైన చేయాలి. ఎప్పుడూ ఒకేరకమైన వ్యాయామాలు కాకుండా శరీర అవసరాలకు తగిన వ్యాయామాలు చేయాలి. ఒకరోజు వ్యాయామం చేసి, రెండు రోజులు మానుకోవటం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా లేనిపోని ఇబ్బందులు వస్తాయి.
ఎంత తింటే అంత ఆరోగ్యం
Related tags :