కొవిడ్-19 సంక్షోభం ముగిసిన తర్వాత.. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంపై ఆర్థికవేత్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ మందగమనం మొదలైందని, ఇటువంటి సమయంలో ఈ మహమ్మారి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ వ్యయాలు పెరిగినప్పటికీ.. వినియోగం, పెట్టుబడులు క్షీణతకు సరిపోలడం లేదని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డైరెక్టర్ రతిన్ రాయ్ పేర్కొన్నారు. కేవలం రిజర్వు బ్యాంక్ లేదా ప్రభుత్వం మాత్రమే మన ఆర్థిక వ్యవస్థను కాపాడలేవని, ప్రైవేటు రంగం ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన వెబినార్‌లో రాయ్ తెలిపారు. ఇటీవల ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులు అధిక రుణాలు ఇవ్వాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ద్రవ్య విధానాన్ని కాకుండా రుణాలు, ద్రవ్యలభ్యత మార్గాన్ని ఎంచుకుందని వెల్లడించారు. ఆర్థికాభివృద్ధిపై వలస కూలీల ప్రభావం ఉంటుందని, కొవిడ్-19 సంక్షోభం తర్వాత నాణ్యత కలిగిన కార్మికుల లభ్యత సవాల్‌గా మారుతుందని చెప్పారు. కరోనా కారణంగా ఒక పూర్తి త్రైమాసికానికి జీడీపీని కోల్పోయామని, దీని విలువ రూ.40-50 లక్షల కోట్లు ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఆర్‌బీఐ మంచి చర్యలు చేపట్టిందని అభిప్రాయపడ్డారు. తక్కువ నైపుణ్యాలు, స్వయం ఉపాధి కార్మికుల వల్ల నిరుద్యోగం పెరుగుతోందని ఐసీఆర్‌ఐఈఆర్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజత్ కథురియా ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారుతుంది
Related tags :