* ఏలూరులో మంత్రి తానేటి వనిత గన్‌మేన్ చంద్రరావు వీరంగం సృష్టించాడు. కూతురు, అల్లుడిపై నడిరోడ్డు మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. ఐదు నెలల క్రితమే చంద్రరావు కుమార్తె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూతురు, అల్లుడిపై గన్‌మేన్ చంద్రరావు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రహదారిపై గన్‌మేన్ వీరంగం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రరావు, ఇతరులపై ఏలూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
* రాష్ట్రాల విషయంలో శాసనసభ నిర్ణయాలే అంతిమమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. మండలి నిర్ణయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్న తమ్మినేని… పెద్దల సభలో ద్రవ్య వినిమయ బిల్లును సైతం అడ్డుకున్నారని విమర్శించారు. విశాఖపట్నం కచ్చితంగా రాజధాని అవుతుందని చెప్పారు. మూడు రాజధానులతో వచ్చే ఇబ్బంది ఏంటని తమ్మినేని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ప్రతిపక్షానికి ఇష్టం లేదా అని సభాపతి ప్రశ్నించారు.
* తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ విజృంభిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 499 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,526కు చేరింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు పీఈసెట్ దరఖాస్తుల గడువు ఈనెల 30 వరకూ పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది.
* వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో రిమాండ్‌లో ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని తనయుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దీని కోసం కడప కేంద్ర కారాగారానికి అనంతపురం నుంచి ఎనిమిది మంది పోలీసులు వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిని అనంతపురం తీసుకెళ్లారు. అక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇద్దరినీ విచారించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇద్దరినీ పోలీసులు విచారించనున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇటీవల అనంతపురం కోర్టు అనుమతిచ్చింది.
* దేశ సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు దురుద్దేశాన్ని ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. 20 మంది సైనికుల వీర మరణం తర్వాత నెలకొన్న పరిస్థితులను ఉద్దేశించి ప్రధాని ఆ వ్యాఖ్యలు చేశారని వివరణ ఇచ్చింది. మన సైనికుల బలిదానాలు చైనా కుయుక్తులను తిప్పికొట్టాయని వెల్లడించింది. గల్వాన్ లోయలో జూన్ 15న జరిగిన అతిక్రమణ విషయంలో చైనా ఎట్టకేలకు వెనక్కి తగ్గిందని తెలిపింది. ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాలన్న అంశంలోనూ తోకముడిచిందని పేర్కొంది. ఈ మేరకు శనివారం ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
* సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. సుశాంత్ సైకియార్టిస్ట్ కేసరి చవ్డాను విచారించారు. ఈ నేపథ్యంలో వైద్యుడు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నటి అంకితతో బ్రేకప్‌ను సుశాంత్ తట్టుకోలేకపోయాడని, ఆ విషయంలో చాలా రోజులు బాధపడ్డారని తెలిపారు. ‘అంకితతో ప్రేమ విఫలమైన తర్వాత సుశాంత్ కుంగిపోయాడు. ఆమె తనను ప్రేమించిన విధంగా ఇంకెవ్వరూ ప్రేమించరని, ప్రేమించలేరని పశ్చాత్తాపం చెందారు. రాత్రిళ్లు నిద్రపోయేవాడు కాదు. మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఆపై నటి కృతిసనన్‌తో స్నేహం బలపడింది. కానీ ఆ బంధం ముందుకు సాగలేదు. సుశాంత్ తన ప్రేయసి రియా చక్రవర్తి ప్రవర్తన వల్ల సంతోషంగా ఉండేవారు కాదు’ అని చెప్పారు.
* కరోనాతో పోరాడుతున్న దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్‌కు వైద్యులు ప్లాస్మాథెరపీ నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి నిన్న విషమంగా మారడంతో ఆయన్ను మ్యాక్స్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ.. ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోందని అధికారులు తెలిపారు. ఇటీవల తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో దిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సత్యేందర్ చేరిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి చేసిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా తేలగా.. ఆ తర్వాత మళ్లీ బుధవారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
* బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ సారథి సౌరభ్ గంగూలీ కుటుంబంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. శనివారం అతని సోదరుడు, మాజీ రంజీ క్రికెటర్ స్నేహశీష్ సతీమణికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. గంగూలీ వదినతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా వైరస్ బారినపడ్డారు. మరోవైపు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా కొనసాగుతున్న స్నేహశీశ్‌కు మాత్రం నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఇక స్నేహశీష్ ఇంట్లోని పని మనిషికి కూడా వైరస్ సోకిందని తెలిసింది. దీంతో ఆ నలుగురినీ ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.
* భారత్ – చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో చిల్లర రాజకీయాలను విడనాడి దేశం తరఫున నిలబడాలని సూచించారు. గల్వాన్ ఘటనలో గాయపడిన ఓ సైనికుడి తండ్రి వ్యాఖ్యలతో ఉన్న వీడియోను అమిత్ షా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘‘మన సైన్యం చాలా బలమైనది. చైనాను ఓడించగలదు. రాహుల్ గాంధీ ఈ విషయంలో రాజకీయాలు చేయకండి. నా కుమారుడు సైన్యంలో ఉండి పోరాడాడు. తన పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తాడు’’ అని ఆ జవాన్ తండ్రి వ్యాఖ్యలు చేశారు.
* గాల్వన్ ఘటన.. మరోసారి భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలకు తెర లేపింది. భారత భూభాగాన్ని కైవసం చేసుకోవాలని ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతున్న చైనా.. ఇటీవల భారత్‌లోని గాల్వన్ లోయలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాన్ని మన జవాన్లు ప్రాణాలు అర్పించి నిలువరించారు. డ్రాగన్ చైనాకు కేవలం మన దేశంతోనే కాదు.. తన సరిహద్దు దేశాలు, సరిహద్దులో లేని దేశాలతోనూ గొడవలకు దిగుతోంది. తనది కాని భూభాగాన్ని దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది.
* భారత్ -చైనా సరిహద్దులోని గల్వాన్ లోయలో 20మంది భారత జవాన్లను బలితీసుకున్న డ్రాగన్‌కు తగినరీతిలో బుద్ధి చెప్పాల్సిందేనని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. చైనా వస్తువులను బహిష్కరించి ఆర్థికంగానే దెబ్బకొట్టాలని రాష్ట్ర ప్రజలకు ఆయన ట్విటర్‌లో పిలుపునిచ్చారు. ఇప్పటికే కేంద్రమంత్రులు రాందాస్ అఠవాలే, రాం విలాస్‌పాసవాన్ వంటి వారు చైనా ఉత్పత్తులు, చైనా ఆహారం విక్రయించే రెస్టారంట్లపై నిషేధం విధించాలని వ్యాఖ్యానించగా.. తాజాగా ఈ జాబితాలో భాజపా సీనియర్ నేత శివరాజ్‌సింగ్ చేరారు. సరిహద్దుల్లో కబ్జాదారుగా వ్యవహరిస్తూ భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న చైనాకు సైన్యం తగిన రీతిలో సమాధానం చెబుతుందనీ.. అదే సమయంలో ఆ దేశాన్ని ఆర్థికంగానూ దెబ్బకొట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.