బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ సారథి సౌరభ్ గంగూలీ కుటుంబంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. శనివారం అతని సోదరుడు, మాజీ రంజీ క్రికెటర్ స్నేహశీష్ సతీమణికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. గంగూలీ వదినతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా వైరస్ బారినపడ్డారు. మరోవైపు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా కొనసాగుతున్న స్నేహశీశ్‌కు మాత్రం నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఇక స్నేహశీష్ ఇంట్లోని పని మనిషికి కూడా వైరస్ సోకిందని తెలిసింది. దీంతో ఆ నలుగురినీ ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.
‘వైరస్ సోకిన ఆ నలుగురికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. కరోనా లక్షణాలు కనిపించడంతో వారికి పరీక్షలు నిర్వహించాం. గంగూలీ కుటుంబం నివసించే ఇంట్లో కాకుండా వారు వేరే చోట ఉండగా మహమ్మారి బారిన పడ్డారు. అయితే, ఈ నలుగురికీ మళ్లీ ఒకసారి పరీక్షలు చేసి, వారిని డిశ్చార్జి చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తాం’ అని సంబంధిత అధికారి పేర్కొన్నారు.