Sports

సచిన్ బ్యాట్ ఇచ్చాడు. కీపర్ వెళ్లిపోయాడు.

Indian Cricketer Prithvi Shah On His Experiences With Sachin

14 ఏళ్ల వయసులో ఇంటర్‌ స్కూల్‌ టోర్నమెంట్‌లో ఆడుతున్నప్పుడు తన బ్యాటింగ్‌ చూసి ప్రత్యర్థి జట్టు వికెట్‌కీపర్‌ తర్వాతి రోజు ఆటకు రానన్నాడని టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా చెప్పాడు. తాజాగా అతను క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ తన చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు. 2014లో ముంబయిలోని ఆజాద్‌ మైదానంలో హారిస్‌ షీల్డ్‌ ఇంటర్‌ స్కూల్‌ టోర్నమెంట్‌ ఆడుతుండగా ప్రత్యర్థి కీపర్‌ అలా అన్నాడని పేర్కొన్నాడు. ‘ఆ రోజు నేను 500ల్లో కూడా లేను. 300 పరుగుల వద్ద ఆడుతున్నా. దాంతో తొలిరోజు నా వెనుకున్న వికెట్‌కీపర్‌కు బంతులు వెళ్లలేదు. నేను షాట్లు ఆడకుండా ఎప్పుడు వదిలేస్తానా అని ఎదురుచూశాడు. చివరికి ‘‘నేను రేపు రావట్లేదు’’ అని చెప్పి వెళ్లిపోయాడు’ అని షా వివరించాడు. ఆ మ్యాచ్‌లో రికార్డు స్థాయి బ్యాటింగ్‌ చేసిన పృథ్వీ రెండు రోజులు పాటు క్రీజులో ఉండి 546 పరుగులు చేశాడు. అందులో 85 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. మైనర్ల క్రికెట్‌లో అది అప్పటికి దేశంలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కావడం విశేషం. అనంతరం క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను తొలిసారి కలిసిన సందర్భాన్ని పేర్కొన్నాడు. ‘నేను 8 ఏళ్ల వయసులో మైఐజీ మైదానంలో ఆడుతుండగా అక్కడికి లిటిల్‌ మాస్టర్‌ వచ్చాడు. ఎక్కడో కూర్చొని నన్ను చూశాడట. అతను చెప్పేదాకా నాకా విషయం తెలియదు. అప్పుడే తొలిసారి తన చేతుల మీదుగా బ్యాట్‌ అందుకున్నా. దాంతో భావోద్వేగానికి లోనయ్యా. నాకు అభినందనలు చెప్పి ఆ బ్యాట్‌తో శతకాల కొద్దీ పరుగులు చేయాలని ఆకాంక్షించాడు’ అని యువ బ్యాట్స్‌మన్‌ వెల్లడించాడు. కాగా, 2018 అక్టోబర్‌లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన పృథ్వీషా తొలి మ్యాచ్‌లోనే శతకం బాదాడు. దాంతో టీమ్‌ఇండియాలో సచిన్‌ తర్వాత పిన్నవయసులో శతకం బాదిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.