వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైన్యం దురాక్రమణలను దీటుగా తిప్పికొట్టేందుకు భారత సైన్యానికి ప్రభుత్వ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణె, నావికాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, వాయుసేనాధిపతి చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్ భదౌరియా హాజరయ్యారు. చైనా సైన్యం దుస్సాహసాలకు గట్టిగా బదులివ్వడానికి సిద్ధంగా ఉండాలని భారత సైన్యానికి రాజ్‌నాథ్ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇకపై సరిహద్దుల వద్ద భారత్ భిన్నమైన వ్యూహాత్మక విధానాల్ని అవలంబించనున్నట్లు తెలుస్తోంది. భూ సరిహద్దు, గగనతలం సహా వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో చైనా కార్యకలాపాలపై ఇకపై అత్యంత జాగరూకతతో ఉండాలని భారత సైన్యాన్ని రాజ్‌నాథ్ ఆదేశించినట్లు సమాచారం. డ్రాగన్ ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడినా వెంటనే తిప్పికొట్టేందుకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్మీ, వాయుసేనలు సరిహద్దుల వద్ద తమ సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకుంటున్నట్లు సమాచారం.
త్రివిధదళాలకు పూర్తి స్వేచ్ఛ
Related tags :