Sports

అసహనం పెరిగిపోతోంది

Pullela Gopichand Speaks Of COVID19 Online Training

పరిస్థితి ఇలాగే కొనసాగితే క్రీడాకారులకు కష్టమేనని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయపడ్డాడు. క్రీడాకారులు పూర్తి ఫామ్‌లోకి రావడానికి 4 నుంచి 6 వారాల సమయం పడుతుందని తెలిపాడు. క్రీడా సముదాయాలు, స్టేడియాలు తెరుచుకోవచ్చంటూ నాలుగో దశ లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. అయితే కరోనా మహమ్మారి ప్రభావం దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం క్రీడలకు అనుమతివ్వలేదు. ‘‘ఇప్పటి వరకు పెద్దగా ఇబ్బందేమీ లేదు. అయితే ఈ పరిస్థితి మరో నెల లేదా నెలన్నర రోజులు కొనసాగితే క్రీడాకారుల్లో అసహనం మొదలవుతుంది. లాక్‌డౌన్‌ సమయంలో వారు మొదటి నెల పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. చాలామంది ఇంతకు ముందు చేయని పనుల్ని పూర్తిచేశారు. తర్వాతి రెండు నెలలు కసరత్తులు చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఫిట్‌నెస్‌ సెషన్‌లు నిర్వహిస్తూ కొంత లోటును భర్తీ చేస్తున్నాం. నిజానికి ఇన్ని రోజులు బ్యాడ్మింటన్‌కు నేనెప్పుడూ దూరంగా లేను. నా వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. శారీరకంగా, మానసికంగా అసలు సవాలు క్రీడాకారులకే ఎదురవుతోంది. లాక్‌డౌన్‌లోనూ క్రీడాకారులు కసరత్తులు చేస్తున్నారు కాబట్టి.. 4 నుంచి 6 వారాల్లో వారంతా పూర్తిస్థాయి ఫామ్‌లోకి వస్తారని అనుకుంటున్నా. మానసికంగా దృఢంగా తయారవడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు’’ అని గోపీచంద్‌ వివరించాడు.