DailyDose

నాకు కేంద్ర బలగాల రక్షణ కావాలి-తాజావార్తలు

Raghuramakrishnam Raju Writes To LokSabha Speaker Asking CRPF Protection

* తనకు ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు లేఖ రాశారు. కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు రక్షణ కల్పించాలని ఎంపీ లేఖలో కోరారు. ఆయన ఇంకా ఆ లేఖలో ఏం రాశారంటే… శ్రీవారి భూముల అమ్మకం అంశంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలవడానికి ప్రయత్నించాను. అప్పట్నుంచి నా నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తున్నారు. కోట్లాది భక్తుల మనోభావాలను కాపాడే ప్రయత్నం చేశాను. స్వామి వారి భక్తుడిగా తన లాంటివారు కోరుకున్న విషయాలను మీడియా ద్వారా చెప్పానంతే. ఇలా బహిరంగంగా చెప్పినందుకు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు’ అని లేఖలో పేర్కొన్నారు.

* ఆచార్య జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్మరించుకున్నారు. తెలంగాణ సాధనలో జయశంకర్‌ క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం అన్నారు. జయశంకర్‌ సేవలు భవిష్యత్తు తరాలకు గుర్తుండిపోయేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ట్వీట్‌ చేసింది.

* వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేశారు. సంతోష్‌ బాబు తండ్రి ఉపేందర్‌ను చంద్రబాబు పరామర్శించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధన్యజీవి సంతోష్‌బాబు అని చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు. ఇటీవల భారత్‌ – చైనా సరిహద్దులో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌బాబు అమరుడైన విషయం తెలిసిందే. సూర్యాపేట సమీపంలోని కేసారంలో ఉన్న సంతోష్‌బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఇటీవల అంతిమ సంస్కారాలు జరిగాయి.

* కరోనా విషయంలో రాజకీయాలు చేయాలని చూడటం దారుణమని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శనివారం జరిగిన జన సంవాద్‌ వర్చువల్‌ ర్యాలీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను హరీశ్‌రావు ఖండించారు. జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు దేశ భద్రత విషయంలో చులకనగా మాట్లాడటంతో సమానమన్నారు హరీశ్‌రావు. దేశ వైద్య శాఖ మంత్రిగా పని చేసిన నడ్డా… వైద్యుల కృషిని తక్కువ చేస్తున్నారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా జేపీ నడ్డా మాట్లాడారని విమర్శించారు. సైనికుల ఆత్మస్థైర్యం గురించి మాట్లాడేవారు వైద్యుల గురించి ఆలోచించరా? అని మంత్రి ప్రశ్నించారు.

* జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తున్నాయి. ఉదయం శ్రీనగర్‌లో ఒక ముష్కరుణ్ని హతం చేసిన దళాలు.. తాజాగా మరో ముగ్గురిని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని జూమినార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో సైనిక బలగాలతో కలిసి కశ్మీర్‌ పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ భవనంలో నక్కిన ముష్కరులు దళాలపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొన్ని గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి. ముష్కరుల తల్లిదండ్రుల్ని సంఘటనా స్థలానికి తీసుకొచ్చి వారిని లొంగిపొమ్మని చెప్పించినప్పటికీ వారు దానికి నిరాకరించినట్లు సమాచారం.

* తెలంగాణ ప్రభుత్వంపై భాజపా నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. జన సంవాద్‌ సభ(వర్చువల్‌ ర్యాలీ)లో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆదివారం ఈటల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఇది పరస్పర ఆరోపణలు చేసుకునే సమయం కాదు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపణలు సరికావు. జాతీయస్థాయి నాయకుడు అయిన ఆయన ఒక గల్లీ లీడర్‌ మాట్లాడినట్లు మాట్లాడారు.

* వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైన్యం దురాక్రమణలను దీటుగా తిప్పికొట్టేందుకు భారత సైన్యానికి ప్రభుత్వ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె, నావికాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌, వాయుసేనాధిపతి చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌ భదౌరియా హాజరయ్యారు. చైనా సైన్యం దుస్సాహసాలకు గట్టిగా బదులివ్వడానికి సిద్ధంగా ఉండాలని భారత సైన్యానికి రాజ్‌నాథ్‌ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

* మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబయి వణుకుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3874 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,54,000 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,28,205మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా మరో 160మంది మృతి చెందడంతో కొవిడ్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 5984కి చేరింది. కరోనాతో నెలకొన్న పరిస్థితులతో ముంబయి మహానగరం విలవిలలాడుతోంది.

* కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో యోగా సాధన ఎంతో మేలు చేస్తుందని కేంద్ర ఆయుష్‌ శాఖమంత్రి శ్రీపాద్‌ యశో నాయక్‌ అన్నారు. యోగా సాధన చేసేవాళ్లకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గోవాలో ఆయన మట్లాడుతూ.. దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో యోగాపై చేసిన ప్రచారం కరోనాపై పోరులో బాగా ఉపయోగపడిందని చెప్పారు. యోగా సాధన చేసేవాళ్లకు కరోనా ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం తక్కువగా ఉంటుంది అని పేర్కొన్నారు.