ఊబకాయంతో బాధపడేవాళ్లకి వృద్ధాప్యంలో ఆలోచనాశక్తి తగ్గే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే రోజుకో అవకాడో తినేవాళ్లలో ఈ సమస్య ఉండదని ఇలినాయ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. అవకాడోల్లో ల్యూటెన్ అనే వర్ణద్రవ్యం అధికంగా ఉంటుంది. ఇది మెదడు కణాల పనితీరుని ప్రభావితం చేస్తుందని గత పరిశోధనల్లో తేలింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అధిక బరువుతో బాధపడుతోన్న 84 మంది వృద్ధులను ఎంపికచేసి వాళ్లలో సగం మందికి రోజూ ఓ అవకాడోని ఇచ్చారట. మిగిలినవాళ్లకి వాళ్లు రోజూ తీసుకునే ఆహారాన్నే ఇచ్చారట. ఇలా పన్నెండు వారాలు చేశాక వాళ్లందరినీ పరిశీలించగా- అవకాడో తిన్న వాళ్ల రక్తంలోనూ రెటీనాలోనూ ల్యూటెన్ శాతం పెరిగినట్లు గుర్తించారు. అదే సమయంలో వాళ్లు గతంలో కన్నా కాస్త చురుకుగా తమ పనులు చేసుకోవడాన్నీ గమనించారట. దీన్నిబట్టి అవకాడో వృద్ధాప్యంలో ఆలోచనాశక్తి తగ్గకుండా చేస్తుందని తేలింది. అయితే అవకాడో లభ్యం కానివాళ్లు ల్యూటెన్ పుష్కలంగా లభించే ఆకుకూరలూ గుడ్లూ తిన్నా మంచిదే అంటున్నారు సదరు పరిశోధకులు.
నిత్యం తెలివితేటలు ఉప్పొంగాలంటే అవకాడో తినండి
Related tags :