DailyDose

PNB నష్టాలు తగ్గాయి-వాణిజ్యం

TNILIVE Telugu Business News Roundup Today || PNB Losses Decreased

* భారత్‌ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న చైనాకు, దాని తొత్తులకు బుద్ధి చెప్పేందుకు ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. భారత్‌తో సరిహద్దును పంచుకొంటున్న దేశాల నుంచి పెన్షన్‌ ఫండ్స్‌లోకి వచ్చే పెట్టుబడులపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ‘చైనా సహా భారత్‌తో సరిహద్దును కలిగివున్న దేశాల సంస్థలు లేదా వ్యక్తుల నుంచి వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానానికి సంబంధించిన కొత్త నిబంధనలు ఇలాంటి పెట్టుబడులన్నింటికీ వర్తిస్తాయి’ అని శుక్రవారం జారీచేసిన ముసాయిదా నోటిఫికేషన్‌లో ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే పెట్టుబడులకు మాత్రమే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. తాజాగా ఆర్థిక శాఖ చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఇకపై చైనా, నేపాల్‌తోపాటు మయన్మార్‌, భూటాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ కూడా ఈ జాబితాలోకి వస్తాయి.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవంతో అన్ని దేశాలు లాక్‌డౌన్‌లు విధించాయి. కరోనా ఎక్కువగా చిన్నారులు, వృద్ధులకు వేగంగా వ్యాపిస్తుందని నిపుణుల సూచిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత తరుణంలో చిన్నారులకు ట్యాబ్లెట్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల ద్వారా విద్యకు సంబంధించిన అంశాలను నేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రూ.10,000 నుంచి 15,000 ఖరీదు చేసే ట్యాబ్లెట్‌ ఫోన్లకు అధిక గిరాకీ ఉందని స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ దిగ్గజం లెనివో ఇండియా డైరెక్టర్‌ పంకజ్‌ హర్‌జై తెలిపారు. కాగా ట్యాబ్లెట్‌ ఫోన్లకు అధిక డిమాండ్‌ నెలకొనడంతో చిన్నారులకు అలరించే సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటామని హర్‌జై స్పష్టం చేశారు.

* ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా ఐటీ ప్రాజెక్టులు అధికంగా లభించే అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాలలో వైరస్‌ విజృంభణ పతాక స్థాయికి చేరడంతో కొత్త ప్రాజెక్టులు లేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్‌, డైటా సైన్స్‌ లాంటి కోర్సులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా సైన్స్‌ తదితర కోర్సులను జాబ్‌ కన్సెల్టెన్సీలు ఆఫర్‌ చేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీలకు శిక్షణ ఇచ్చే జిగ్సా అకాడమీ సీఈఓ వోహ్రా స్పందిస్తూ.. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కూడా వైవిధ్యమైన కోర్సుల్లో నైపుణ్యం పొందిన వారికి ఉద్యోగాలలో డోకా ఉండదని తెలిపారు.

* మొండి బకాయిలకు తక్కువ కేటాయింపులు చేయడంతో ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) నికర నష్టం తగ్గింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు నికర నష్టం రూ.697.20 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే మూడు నెలల్లో నష్టం రూ.4,750 కోట్లుగా ఉండడం గమనార్హం. బ్యాంకు మొత్తం ఆదాయం సైతం రూ.14,725.13 కోట్ల నుంచి రూ.16,388.32 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్ల నగదు రికవరీని సాధించినట్లు.. తాజా మొండి బకాయిలు రూ.20,000 కోట్లుగా నమోదైనట్లు బ్యాంకు ఎండీ ఎస్‌.ఎస్‌. మల్లిఖార్జున రావు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.6,000-8,000 కోట్ల మేర రికవరీ అవుతుందని అంచనా వేశారు. ఆస్తుల నాణ్యత మెరుగుపడడంతో మార్చి త్రైమాసికంలో మొండి బకాయిలకు కేటాయింపులు సగమయ్యాయి. రూ.9,153.55 కోట్ల నుంచి రూ.4,618.27 కోట్లకు తగ్గాయి. పూర్తి ఆర్థిక సంవత్సరం(2019-20)లో బ్యాంకు రూ.64,306.13 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.363.34 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది రూ.59,514.53 కోట్ల ఆదాయంపై రూ.10,026.41 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అప్పుల్లేని సంస్థగా మారడంతో ముకేశ్‌ అంబాని అంతర్జాతీయ కుబేరుల్లో టాప్‌-10లోకి చేరారు. రిలయన్స్‌ మార్కెట్‌ విలువ రూ.11 లక్షల కోట్లకు చేరడంతో ముకేశ్‌ తొమ్మిదో స్థానంలోకి చేరారు.