అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం తగ్గించాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. శనివారం ఓక్లహామాలోని టల్సాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నిర్ధారణ పరీక్షలు అనేది కత్తికి రెండు వైపులా పదును లాంటిది. ఎక్కువ పరీక్షలు చేస్తేనే ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తాయి. అందుకే పరీక్షలు తగ్గించమని అధికారులకు చెప్పా’ అని ట్రంప్ నిర్మొహమాటంగా వెల్లడించారు. అయితే, సభలో ఆయన మద్దతుదారులు కేరింతలు కొడుతుంటే సరదాగా వ్యాఖ్యానించారా లేక నిజంగానే అధికారులకు అలాంటి ఆదేశాలు జారీ చేశారా అనేది తెలియాల్సి ఉంది. అమెరికాలో ఆదివారం మధ్నాహ్నం సమయానికి కరోనా కేసుల సంఖ్య 22,95,615కు చేరింది. వీరిలో 1,21,441 మంది మరణించారు. వైరస్ ఉద్ధృతి ఎక్కవగా ఉండడంతో నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని తొలినాళ్లలో వైద్యనిపుణులు ట్రంప్‌నకు సూచించారు. దాంతో కొన్ని రోజుల పాటు పరీక్షలు భారీ స్థాయిలో జరిగాయి. తాజాగా పరీక్షల్ని తగ్గించమన్నట్లు ట్రంప్ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ ఉద్ధృతిని తక్కువ చేసి చూపేందుకు యత్నిస్తున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా పరీక్షలు తగ్గించమని సలహా ఇచ్చిన ట్రంప్
Related tags :