DailyDose

20లక్షల మంది తొలగింపు-వాణిజ్యం

20లక్షల మంది తొలగింపు-వాణిజ్యం

* లాక్‌డౌన్‌ ప్రభావంతో ప్రైవేటు బస్సు, టూరిస్టు ట్యాక్సీ ఆపరేటర్లు బాగా దెబ్బతిన్నారని బస్‌ అండ్‌ కార్‌ ఆపరేటర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఓసీఐ) వెల్లడించింది. సుమారు 20 లక్షల మంది తమ ఉపాధి కోల్పోయారని, మరో 30-40 మందికీ ఇదే పరిస్థితి ఎదురవ్వచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. 15 లక్షల బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, 11 లక్షల టూరిస్టు ట్యాక్సీలను నిర్వహిస్తున్న 20,000 మంది ఆపరేటర్లకు బీఓసీఐ ప్రాతినిధ్యం వహిస్తోంది. సుమారు కోటి మంది నేరుగా ఉపాధి పొందుతున్న ఈ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కు కున్నందున, ప్రభుత్వం సాయం చేయాలని బీఓసీఐ కోరుతోంది. చాలా మంది తమ సేవల్ని మూసివేసేందుకు సిద్ధమవుతున్నందున, వారికి పన్నుల మాఫీ, రుణాలపై వడ్డీ మాఫీ ద్వారా సాయం చేయాలని బీఓసీఐ అభ్యర్థిస్తోంది. ‘లాక్‌డౌన్‌ సమయంలో 95 శాతం వాహనాలు రోడ్లపైకి రాలేదు. కంపెనీలతో ఒప్పందాల్లో ఉన్న కొన్ని బస్సులు మాత్రమే నడిచాయి. కొన్ని బస్సులు వలస కార్మికుల్ని తరలించడానికి వినియోగించామ’ని బీఓసీఐ అధ్యక్షుడు ప్రసన్న పట్వర్ధన్‌ వెల్లడించారు. వ్యాపారం లేకపోయినా, తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సి రావడంతో,బీఓసీఐ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు వరకు ఈఎమ్‌ఐలపై ఆర్‌బీఐ మారటోరియం విధించడం కొంత ఊరట కలిగిస్తోందని, సెప్టెంబరు నుంచి ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. మోటారు వాహన పన్నుల మాఫీ, డీజిల్‌పై రాయితీలు, ఇంటర్‌సిటీ రవాణాలో టోల్‌ పన్నుల రద్దు వంటి సాయం చేయాలని కోరారు. లాక్‌డౌన్‌ సమయంలో 3 నెలలు వాహనాలు రోడ్లపైకి రాలేదు కాబట్టి, అంతమేర బీమా పాలసీని పొడిగించాలన్నారు. బస్సులకు ఏడాదికి రూ.50,000-2,00,000 బీమా చెల్లించాలంటే చాలా ఖరీదైన వ్యవహారంగా మారిందని తెలిపారు. బ్యాంకులు మారటోరియం కాలానికి వాహన రుణాలపై వడ్డీ మాఫీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తాము కోరుతున్న ‘వన్‌ నేషన్‌, వన్‌ ట్యాక్స్‌, వన్‌ పర్మిట్‌’ ప్రతిపాదనను ఆమోదించాలన్నారు.

* కొత్త స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కొనాలనుకుంటున్నారా? ఈ కరోనా సమయంలో దాదాపు మూడు నెలల తర్వాత ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఆకర్షణీయ ఆఫర్లతో ముందుకొస్తోంది. ‘బిగ్‌ సేవింగ్‌ డేస్ సేల్‌ ’ పేరుతో భారీ తగ్గింపుతో స్మార్ట్‌ ఫోన్ల విక్రయానికి సిద్ధమైంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక సేల్‌ జూన్‌ 27 వరకు ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లనూ తగ్గింపు ధరలకే అందించనుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యులకు మాత్రం ఈ ప్రత్యేక సేల్‌ ఈ రాత్రి 8గంటల నుంచే అందుబాటులోకి రానుంది.

* 150 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన మొదటి భారతీయ సంస్థగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డు సృష్టించింది. సోమవారం మార్కెట్‌ ట్రేడింగ్‌ ఆరంభం కాగానే కంపెనీ విలువ రూ.28,248 కోట్ల నుంచి 11,43,667 కోట్లకు చేరింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో రిలయన్స్‌ షేరు ధర ఏకంగా 2.53శాతం పెరిగి 1,804 వద్ద ట్రేడ్‌ అయింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో ఆల్‌టైమ్‌ గరిష్ఠం రూ.1,804.20కు చేరింది. అయితే, మార్కెట్‌ ముగిసే సమయానికి 0.70శాతం తగ్గి రూ.1,747కు చేరింది.

* లాక్‌డౌన్‌ కారణంగా ఇంటర్నెట్‌ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో అన్ని టెలికాం ఆపరేటర్లు అందుకు తగిన విధంగా డేటా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రత్యేక రీఛార్జ్‌లకు డబుల్‌ డేటా ఇస్తున్నాయి. తాజాగా వొడాఫోన్‌ కూడా తన వినియోగదారులకు ఈ డబుల్‌ డేటా ఇస్తోంది. ఇప్పుడు అదనంగా 2జీబీ, 5జీబీ డేటాను ఉచితంగా పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకు ఎలాంటి అదనపు రుసుము చెల్లించనవసరం లేదు. వొడాఫోన్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్రస్తుత ప్రీపెయిడ్‌ ప్లాన్‌ వినియోగిస్తున్న వారు దీన్ని పొందవచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా.. వొడాఫోన్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా మీ మొబైల్‌ను రీఛార్జ్‌ చేసుకోవడమే. రూ.149, రూ.249, రూ.399, రూ.599 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ వినియోగిస్తున్న వారికి ఇది వర్తిస్తుంది. రూ.149తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి ఇప్పటికే అందుతున్న 1జీబీ డేటాకు అదనంగా మరో 1జీబీ డేటాను పొందవచ్చు. దీని కాలపరిమితి 28రోజులు. ఇక రూ.219 ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో 2జీబీ అదనపు డేటాను, రూ.249, రూ.399, రూ.599 రీఛార్జ్‌లకు ప్రతి రోజూ 1.5జీబీ డేటాకు అదనంగా రూ.5జీబీ డేటాను పొందవచ్చు. కేవలం వొడాఫోన్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకునేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.

* దేశంలోనే అతి పెద్ద రెండో బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నిధుల సమీకరణ చేయాలని యోచిస్తోంది. వృద్ధి-నియంత్రణ అవసరాలను తీర్చుకోవడానికి ఈ నిధులు వినియోగించాలన్నది ప్రణాళికగా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) ఎస్‌ఎస్‌ మల్లికార్జునరావు తెలిపారు. 2020 మార్చి ఆఖరుకు బ్యాంకు వద్ద సరిపడా మూలధనం ఉండటంతో పాటు మూలధన కనీస నిష్పత్తి 14.14 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెలలో జరిగే బోర్డు సమావేశంలో ‘ఏప్రిల్‌ 1 నుంచి విలీనం చేసుకున్న బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లను పరిశీలించి, ఎంత మేరకు మూలధనం అవసరమవుతుందనేది అంచనా వేస్తా’మని మల్లికార్జునరావు వివరించారు. 2020-21 మూడో త్రైమాసికం చివర్లో గానీ, నాలుగో త్రైమాసికం ప్రారంభంలో గానీ నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. పీఎన్‌బీ గత ఏప్రిల్‌ 1 నుంచి ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)లను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మెగా విలీనంతో పీఎన్‌బీ శాఖలు సుమారు 11,000కు చేరుకున్నాయి. 13,000కు పైగా ఏటీఎమ్‌లు, లక్ష మంది ఉద్యోగులు, రూ.18 లక్షల కోట్ల వ్యాపారం పీఎన్‌బీ ఆధీనంలో ఉన్నట్లయ్యింది. 2020 మార్చి ఆఖరుకు చూస్తే పీఎన్‌బీ దేశీయ మొత్తం వ్యాపారం రూ.11.81 లక్షల కోట్లుగా నమోదైంది. ఓబీసీ, యూబీఐలు రెండూ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నష్టాలు నమోదు చేశాయని మల్లికార్జునరావు తెలిపారు. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు చేయాల్సి రావడంతోనే నష్టాలు వచ్చాయని పేర్కొన్నారు.

* కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు సంస్థల్లో అమలవుతున్న ఉద్యోగ కోతలు, వేతనాల తగ్గింపు ప్రభావం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై (ఎస్‌బీఐ) తక్కువగానే పడుతుందని వాటాదార్లకు ఆ బ్యాంక్‌ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ, పాక్షిక ప్రభుత్వ రంగాల నుంచి వ్యాపారం తమ బ్యాంకుకు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని వివరించారు. బ్యాంకు వాటాదార్లకు రాసిన లేఖలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. ‘ఆర్థిక ఒత్తిళ్లు ఎన్నున్నా, గత ఆర్థిక సంవత్సరం (2019-20) బలమైన పని తీరును ప్రదర్శించాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అదే ఒరవడి కొనసాగిస్తాం. కొవిడ్‌-19 మహమ్మారి సవాళ్లను అధిగమిస్తామన్న విశ్వాసం ఉంది. ప్రస్తుతానికి 21.8 శాతం మంది ఖాతాదారులు మాత్రమే మారటోరియం ప్రయోజనాల్ని పొందుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో 98 శాతం శాఖలు, 91 శాతం ప్రత్యామ్నాయ ఛానెళ్ల కార్యకలాపాలు కొనసాగాయి. భారత ప్రభుత్వానికి సంప్రదాయ ఎంపికగా ఎస్‌బీఐ ఉంటోంది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకూ ఎస్‌బీఐనే గుర్తింపు పొందిన బ్యాంక్‌. ప్రభుత్వం తీసుకొచ్చిన ఇ-గవర్నెన్స్‌ కార్యక్రమానికి ఎస్‌బీఐ తన వంతు సాయం అందిస్తోంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇ-సొల్యూషన్స్‌ అభివృద్ధి చేయడానికి కూడా సహకరిస్తోంది. ఆన్‌లైన్‌ విధానంలోకి మారడం ద్వారా ఎక్కువ సమర్థత, పారదర్శకత అందిస్తోంది. దీని ఫలితంగా సులభతర వ్యాపార నిర్వహణతో పౌరుల జీవన విధానం మారుతోంద’ని రజనీశ్‌ వెల్లడించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ మొత్తం ప్రభుత్వ వ్యాపార టర్నోవర్‌ రూ.52,62,643 కోట్లుగా నమోదైంది. ఎన్నడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ రూ.14,488 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం నికర లాభం రూ.862 కోట్లు మాత్రమే.