Movies

తెలుగు సినిమాను దశదిశలా వ్యాపింపజేసిన ఎల్వీ.ప్రసాద్

తెలుగు సినిమాను దశదిశలా వ్యాపింపజేసిన ఎల్వీ.ప్రసాద్

తెలుగు చిత్రసీమ వెలుగును దశదిశలా ప్రసరింపచేసిన అరుదైన వ్యక్తుల్లో దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ స్థానం ప్రత్యేకమైనది. జూన్ 22న ఎల్.వి.ప్రసాద్ వర్ధంతి

తెలుగు సినిమా పుట్టుక నుంచీ అనుబంధం ఉన్న నటదర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్… ఆరంభంలో చిన్నాచితకా పాత్రలు పోషించి, ఆ పై నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా మారి మరపురాని చిత్రాలను మనకు అందించారు ఎల్వీ ప్రసాద్… మహానటులు యన్టీఆర్‌ను ‘మనదేశం’తోనూ, శివాజీగణేశన్‌ను ‘పరదేశి’తోనూ తెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.

హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసాడు. అంతేకాదు ఎల్.వి.ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాసు మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటారు.

మాతృభాష తెలుగులోనూ, తమిళ, హిందీ భాషల్లోనూ ఎల్వీ ప్రసాద్ చిత్రాలను రూపొందించినా, అన్నీ కలిపి గుప్సెడు లేవు. అయినా ఆ చిత్రాల్లోనే తనదైన బాణీ పలికించి తెలుగువారి మదిలో చెరగని ముద్రవేశారాయన. ఎల్వీ ప్రసాద్ చిత్రాలు ఈతరం వారినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆయన స్థాపించిన సినిమా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పరచుకుని ఉన్నాయి. ఆయన నెలకొల్పిన ‘ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్’ దేశంలోనే అత్యున్నత నేత్ర చికిత్సాలయంగా పేరొందింది. ఆయన వారసులు దేశంలోనే అతి పెద్ద ఐమాక్స్ థియేటర్‌ను భాగ్యనగరంలో నిలిపారు… అలా ప్రసాద్ పేరు తరతరాలు గుర్తుంచుకొనేలా ఆయన ఏర్పాటు చేసిన సామ్రాజ్యం విస్తరిస్తూనే ఉంది.