DailyDose

రథయాత్రకు సుప్రీం అనుమతి-తాజావార్తలు

TNILIVE Breaking News Roundup Today || Supreme Allows Puri Rathayatra

* చైనాతో భారతదేశం రెండు యుద్ధాలు చేస్తోందని.. ఒకటి సరిహద్దులో కాగా, రెండోది ఆ దేశం నుంచి వ్యాపించిన కరోనా వైరస్‌ అని దిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ అన్నారు. దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ కేసులు ఉద్ధృతమవుతున్న వేళ ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా బారిన పడిన వారిలో శ్వాస సంబంధమైన ఇబ్బందులతో పాటు రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గడం సర్వసాధారణమైన లక్షణమన్నారు. అందువల్ల ఎవరికీ ఇబ్బందుల్లేకుండా రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను తెలిపే పల్స్‌ ఆక్సీమీటర్లను కరోనా రోగులకు రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని తెలిపారు. శ్వాససంబంధమైన ఇబ్బందులకు గురికాకముందే హోం ఐసోలేషన్‌లో ఉండే కరోనా రోగులు వీటిని ఫోన్‌ చేసి తెప్పించుకోవాలని సూచించారు.

* సంక్షోభ సమయంలో ఏకతాటిపై నిలబడి సవాళ్లను ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. ఇటీవల సరిహద్దుల్లో భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంపై సమాచారం బయటపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. దాచి ఉంచడం దౌత్యనీతికి, సమర్థ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాదని హితవు పలికారు. దేశ భద్రతపై ప్రధాని మోదీ గతంలో చెప్పిన మాటల్ని గుర్తుంచుకోవాలన్నారు.

* చైనా సైనికుల చెర నుంచి విడుదలైన పది మంది భారత జవాన్లకు నిర్వహించిన మానసిక, వైద్యారోగ్య పరీక్షల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గల్వాన్‌ ఘటన తర్వాత శత్రుదేశ సైనికులు చాలా భయపడ్డారని తెలిసింది. ఇద్దరు మేజర్‌ స్థాయి అధికారులు, ఇద్దరు కెప్టెన్లతో సహా పది మంది భారత సైన్యం గల్వాన్‌ ఘటన తర్వాత ప్రత్యర్థులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విడుదలైన వారికి తాజాగా మానసిక, వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించారు. రెండు రోజులపైనే ప్రత్యర్థి చేతిలో బందీ అయినా, వారంతా చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిసింది. ఈనెల 15న రాత్రి గల్వాన్‌ ఘటనలో కర్నల్‌ సంతోష్‌బాబు వీర మరణం పొందారని తెలిశాక భారత సైన్యం తిరగబడింది. చైనా సైనికులపై ప్రతిదాడి చేసింది. ఈ క్రమంలోనే పొరుగు దేశ సైనికులు భయపడి తమ భూభాగంలోకి పరిగెత్తారట. వారిని వెంబడిస్తూ వెళ్లిన మన సైనికులు బందీలుగా చిక్కారు. ఈ ఘటన భారత సైనికుల ధైర్య సాహసాలను తెలియజేస్తుందని ఓ ఉన్నతాధికారి అన్నారు.

* ‘మ‌ర్డ‌ర్’ సినిమాతో ఇత‌రుల్ని చెడుగా చూపించ‌డం త‌న ఉద్దేశం కాద‌ని ప్ర‌ముఖ ద‌ర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ స్ప‌ష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌ణ‌య్ ప‌రువు హ‌త్య ఆధారంగా ‘మ‌ర్డ‌ర్‌’ సినిమా తీయ‌బోతున్న‌ట్లు ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా వ‌ర్మ ప్రకటించారు. ఫ‌స్ట్‌లుక్‌ను కూడా విడుద‌ల చేశారు. దీనిపై ప్ర‌ణ‌య్ స‌తీమ‌ణి అమృత స్పందించారంటూ ఒక ప్ర‌క‌ట‌న సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ నేప‌థ్యంలో వర్మ వ‌రుస ట్వీట్లు చేశారు.

* తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన వివరాలను దోస్త్ కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు.

> జులై 1 నుంచి 14 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు

> జులై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

> జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

> జులై 23 నుంచి 27 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం

> జులై 23 నుంచి 29 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు

> జులై 23 నుంచి 30 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

> ఆగస్టు 7న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

> ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు

> ఆగస్టు 8 నుంచి 14 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

> ఆగస్టు 13న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

> సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం

* వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబసభ్యులకు ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటామని మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. సంతోష్‌ బాబు కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్‌ పరామర్శించిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘సంతోష్ బాబు కోరిక మేరకు హైదరాబాద్‌లో ఇంటి స్థలం ఇచ్చాం. సూర్యాపేటలో సంతోష్‌ బాబు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం. విగ్రహం ఏర్పాటు చేశాక ఆ ప్రాంతానికి సంతోష్‌ బాబు కూడలిగా నామకరణం చేస్తాం’’ అని జగదీశ్‌ రెడ్డి చెప్పారు.

* ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి కరోనా వైరస్‌ సోకడంతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఈ ఘటన సోమవారం ముంబయి సమీపంలోని థానేలో చోటుచేసుకుంది. కళ్యాణ్‌ మోహన్ ప్రాంతంలో నివసించే అతడు మే 30న తనతో సహజీవనం చేస్తున్న ఒకామెని హత్య చేశాడు. ఖడక్‌పాడా పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా సోకి బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో అతడిని జూన్‌ 16న ఓ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించి, ముగ్గురు పోలీసులు కాపలా కాస్తున్నారు. అయినా, వారి కళ్లుగప్పి సోమవారం తప్పించుకున్నాడని ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. అతడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

* చైనా కంపెనీలకు మహారాష్ట్ర సర్కారు షాకిచ్చింది. సుమారు రూ. 5 వేల కోట్ల విలువ జేసే ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మ్యాగ్నటిక్ మహారాష్ట్ర 2.0 పెట్టుబడుల సదస్సులో భాగంగా మహారాష్ట్ర సర్కారు చైనా సంస్థలతో మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వాటిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి సుభాష్‌ దేశాయ్‌ తెలిపారు.

* ప్రజల ప్రాణాలను నిలబెట్టే 108 అంబులెన్స్‌ల నిర్వహణ కాంట్రాక్టులో స్కామ్ జరగడం సిగ్గుచేటని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఒప్పందం ప్రకారం బీవీజీ సంస్థకు 2020 డిసెంబరు 12 వరకు కాలపరిమితి ఉన్నప్పటికీ… 15 నెలల ముందే 2019 సెప్టెంబరు 20న కొత్త ఏజెన్సీ కోసం 111 జీవో ఎందుకు తెచ్చారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదనంగా పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. తెదేపా హయాంలో రూ. రెండు చొప్పున వ్యాట్‌ తగ్గించామని గుర్తు చేశారు. డీజిల్‌పై పెంచిన వ్యాట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెంటనే రద్దు చేయాలని చంద్రబాబు కోరారు.

* పూరీ జగన్నాథుని రథయాత్రకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. భక్తులు పాల్గొనకుండా రథయాత్ర జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వివిధ నిబంధనలతో రథయాత్రకు సుప్రీం అనుమతిచ్చింది. రథయాత్ర నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వానికే వదిలివేస్తున్నామని స్పష్టం చేసింది.