Business

సొమ్ము చేసుకునే పనిలో ఫార్మా కంపెనీలు…తస్మాత్ జాగ్రత్త!

COVID19 Patients Must Be Aware Of Fake Medicines

రోగుల భయాన్ని, రోగి బంధువుల నిస్సహాయత, ప్రజల బలహీనతలు.. వెరసి తెలియని ‘మాయరోగానికి మందు’ అంటూ ‘మాయ కంపెనీలు’ వేల కోట్ల ఖరీదైన దందాకు దర్జాగా తెర ‘లేపు’తున్నారు. రీసెర్చ్ లేదు.. బొందా లేదు. భోషాణం లేదు. అస్సల్లేం లేదు. ఇప్పటికే మార్కెట్‌ లో ఉన్న ‘యాంటీ వైరల్’ మందులనే ‘కరోనా యాంటీ డోస్’ పేరిట భారీగా సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి. పనిలో పనిగా రామ్ దేవ్ బాబా ఎంటర్. ‘నా దగ్గరా మందుంది’ అంటూ మూలికాలతో బయలుదేరాడు. ఇంత హఠాత్తుగా ఈ మందులోళ్ళ గోల ఏల.? అసలు ఈ కంపెనీలకు అనుమతులు ఇవ్వాల్సింది ఎవరు.? ఎవరు ఇస్తున్నారు.? ఈ మందుల కంపెనీలలో కేంద్రం ఎవరిని గుర్తింస్తుంది.? ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

జరుగుతుంది ఇదే.:
వైద్యరంగం అదొక పెద్ద మాత్రలేని మాఫియా.! దాని గురించి లోతుల్లోకి వెళ్లడం లేదు. (తప్పకుండా తర్వాత కథనాలలో వెళదాం.!) కానీ కరోనా వాక్సిన్, డ్రగ్‌ పై పరిశోధనలు ఉధృతంగా సాగుతున్నయ్.! ఏ కంపెనీ అయితే వాక్సిన్ గానీ, విరుగుడు మందు గానీ కనిపెడుతుందో ఇక దానికి అంతులేని ఖజానా దొరికినట్టే.! నా సామి రంగా… ఎవడైతే అసలు మందు కనిపెడతాడో… వాడు చిటికేస్తే… లక్షల కోట్లు వచ్చి ఒళ్ళో వాలుతాయి. అనేక దేశాల్లోని అనేక ఫార్మా కంపెనీలు సీరియస్ గా, సిన్సియర్ రీసెర్చ్‌ లో మునిగిపోయినయ్.! అయితే మరి మన కంపెనీలు ఏం చేస్తున్నయ్…?

‘అర్జంటు నీడ్’ లో..:
గ్లెన్‌ మార్క్ కంపెనీ ‘ఫావిపిరవిర్’ మాత్రల్ని మార్కెట్‌ లోకి భారీ లాభాల కోసం వదిలింది. 14 రోజుల కోర్స్‌ కు 14 వేల ఖర్చు. ఒక్కో మాత్రకు రూ.103లు. ఖనిజ పర్వతాన్ని ఆత్రంగా తవ్వుకోవడం అంటే ఇదే.! అసలు దేశంలో అది 150మందిపై ప్రయోగాలు చేసింది. ఆ ప్రయోగఫలితాలనే సరిగ్గా రికార్డ్ చేయలేదు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ హడావుడిగా ‘అర్జెంటు నీడ్’ పేరిట అనుమతులు ఇచ్చేసింది. అది కేవలం స్వల్ప, మధ్యస్థ లక్షణాలకు మాత్రమే పనిచేస్తుంది. అంతే మిగతా కంపెనీలు ఉలిక్కిపడ్డయ్..! దేశంమీద పడ్డాయి.

ధర్మ సందేహం:
మరి దేశంలో రోజూ కొన్ని వేల మంది కరోనా నుంచి బయటపడుతున్నారు కదా…! ఏం మందులు వాడుతున్నారు వాళ్లకు…! సింపుల్, జ్వరానికి పారసెటమాల్, జలుబుకు సిట్రజిన్, లేకపోతే హైడ్రాక్సీక్లోరోక్విన్. అంతేకాదు, కొందరు యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ కలిపి వాడుతున్నారు. కొందరు డాక్టర్లు హెచ్ఐవీకి వాడే యాంటీ వైరల్ డ్రగ్స్. కేరళలో డాక్టర్లు నిపా వైరస్ వ్యాప్తి సమయంలో వాడిన యాంటీ వైరల్ డ్రగ్స్ కూడా రోగులకు ఇస్తున్నారు. వ్యాధి తీవ్రత, లక్షణాలను బట్టి డాక్టర్లు తమ విచక్షణతో రకరకాల యాంటీ వైరల్ డ్రగ్స్ వాడుతున్నారు. అంటే అస్సలు మందు ఉత్తుత్తిదేనా..! కంపెనీల కహానీ లేనా..!

కొత్త మందుల కథేంటి..?:
ఇవేమీ వీళ్లు కనిపెట్టినవి కావు. ప్రయోగాలు చేసి ధ్రువీకరించుకున్నవీ అంతకన్నా కావు. జెనెరిక్ డ్రగ్స్… అంటే ఆల్‌ రెడీ మార్కెట్‌ ను సొమ్ము చేసుకున్నవే…! ఇప్పుడు ఎవరైనా తయారీ చేసుకోవచ్చు. ఫావిపిరవిర్ మాత్రల్ని ఎప్పుడో జపాన్ తయారుచేసింది. ఇన్‌ ఫ్లుయెంజా డ్రగ్ అది. దాన్ని ఫాబిఫ్లూ పేరిట ‘గ్లెన్‌మార్క్’ మార్కెట్‌ లోకి వదలబోతోంది. ఇది లాజికల్ ప్లే.

పాత ‘మందు’కు కొత్త ‘ప్యాక్’:
ఇప్పుడు తాజాగా హెటిరో, సిప్లా వాళ్లు హడావుడిగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన రెండెసివర్ కూడా పాతదే.! మనవాళ్లు కనిపెట్టిందేమీ లేదు. ఆల్‌ రెడీ మార్కెట్లో ఉన్నదే. గిలియాడ్ కంపెనీ రీసెర్చడ్.. అమెరికా కనిపెట్టిన డ్రగ్ ఇది. మన వాళ్ళు మాత్రం ‘మేడిన్ —— కంపెనీ’ అంటూ ‘లేని బాల్ కు సిక్సర్’ కొట్టినట్లు. బంగారు కంపెనీలు భలే ముద్దొస్తున్నాయ్.

ఎలా అనుమతి ఇచ్చార్రా భయ్:
‘రెండెసివర్’ డ్రగ్ కరోనాపై కూడా వాడవచ్చునా..? లేదా.? అనే ప్రయోగాలు సాగుతున్నయ్…! ఈలోపే మనవాళ్లు వాణిజ్య వాడకానికి అనుమతులు ఇచ్చేశారు. నిజానికి ఇది అత్యవసర స్థితిలో, అనగా విషమ స్థితిలో మాత్రమే వాడదగిన మందు. బెడిసికొట్టే ప్రమాదాలూ ఉన్నాయంటారు.

ఇదేం దందా..రా!:
ఇదే గిలియాడ్ ఇంకా బిడిఆర్ ఫార్మాస్యూటికల్స్, జూబ్లయింట్ లైఫ్ సైన్సెస్, మైలాన్ లేబొరెటరీస్, రెడ్డీ లేబొరెటరీస్ కు కూడా అనుమతి ఇచ్చేసింది.! వాళ్లకూ పర్మిషన్లు రావల్సి ఉంది మన డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచి కదా. అసలు పెద్ద పెద్ద ఫార్మా దందాలకు డ్రగ్ కంట్రోల్ అథారిటీయే అడ్డా. మరి ఇందంతా ఏమిటి..? ఈ దందా ఏమిటి..? దీని వెనుక ఉన్న బడా బామ్మర్దులు ఎవరు.? లెక్కలేసి మరీ చెపుతాం. తొందర పడకు ‘సుందర, వందనా.’

హైప్ క్రియేట్.!:
కరోనాకు ‘విరుగుడు మందులొచ్చేశాయ్’ అనే ఓ కృత్రిమ హైప్ క్రియేట్ చేస్తున్నది ఫార్మా మాఫియా.! ప్రస్తుత కరోనా భయాల నుంచి, అధిక ధరలతో వీలైనంత పిండుకోవడమే లక్ష్యం. ‘హెటిరో కోవిఫర్’ పేరిట అమ్మబోయే ఒక ఇంజక్షన్ ధర 5 నుంచి 6 వేల ఉండబోతున్నదట…! అది ఎన్నిరోజులు వాడాలో కూడా ఇంకా తెలియదు. మన డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూడా ‘అత్యవసరం’ పేరిట ఇక ఎడాపెడా అనుమతులిచ్చేస్తోంది.

నిర్థారణ లేకుండానే..:
అసలు కరోనా రోగులపై ఈ మందుల ఫలితాల్ని మన ప్రభుత్వం శాస్త్రీయంగా, ఖచ్చితంగా నిర్ధారించుకున్నదా..? ఈ సంక్లిష్టమైన పెద్ద ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానాలు కష్టం.!

రామ్ దేవ్..కరోనిల్:
పతంజలి కూడా కార్పొరేటు సంస్థే కదా… కాకపోతే భారతీయ వైద్యం గట్రా మాటల్ని క్యాష్ చేసుకుంటుంది. అంతే తేడా… కరోనిల్ పేరిట మందును మార్కెట్‌లోకి ప్రవేశపెడుతోంది. ఇమ్యూనిటీని పెంచే బూస్టర్ కిట్స్ అమ్మిన సంస్థ ఇప్పుడు కరోనాను తగ్గించే మందు అంటున్నది. ‘4 నుంచి 10 రోజుల్లో వ్యాధి మాయం’ అని ధీమాగా చెబుతోంది… జస్ట్, 3 రోజుల్లో 69 శాతం రోగులకు వ్యాధి తగ్గించిందట తమ ప్రయోగాల్లో…!!

ఇవిగో.. ఇవే..:
అశ్వగంధ, గిలోయ్ (తిప్పతీగ), తులసి, శ్వసారి రాస్, మాలిక్యూల్ ఆయిల్ నిర్ణీత నిష్పత్తిలో వాడిన మందు అని పతంజలి వివరణ… 300 మంది ఈ పరిశోధనల్లో పాల్గొన్నారని, మంచి ఫలితాలు కనిపించాయనీ, ఆ మాత్రలతోపాటు ‘శసరీపతి’ టాబ్లెట్లు కూడా అందుబాటులో ఉంటాయని చెబుతోంది. పతంజలి వారి ఈ ఆయుర్వేద మందుకు ఎవరి పర్మిషన్..? క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా ఆమోదించినట్టు సంస్థ చెబుతోంది.

ఆ ఒకటీ అడక్కు:
సరే, ఏదో ఒకటి… ఓ ఆశాకిరణం. ఈ ధరల పోటీలో, ఈ మందుల పోటీలో ఏ సంస్థ హడావుడిగా ఏం మందును మార్కెట్‌ లోకి తీసుకొస్తున్నదీ, వాటి ఫలితాలు ఏమిటనేది వదిలేస్తే… అసలు కేంద్ర ప్రభుత్వం దేన్ని సిఫారసు చేస్తుంది..? అదొక్కటీ ఎవరూ అడగకూడని ప్రశ్న…? కేంద్రానికి ఏమాత్రం ఇష్టం లేని ప్రశ్న…! ఎందుకూ అంటే… అదీ అడగకూడని ప్రశ్నే…!! ఎవరి నొక్కుడు వారిదే.! ఎవరి కుమ్ముడు వాడిదే. మందు లేని రోగానికి వారు ఇచ్చిందే మందు. అదే మనం మింగాలి. ‘లాక్ డౌన్’ అంటే ఇంట్లో ఉండలే..! ఇదీ అంతే..!