ఇంటర్నెట్‌లో ఉచితంగా మనోరంజకమైన కంటెంట్ లభిస్తుంది కదా! మరి అలాంటప్పుడు ఓటీటీ వేదికలకు డబ్బులెందుకు చెల్లించాలి? డేటా వినియోగం పెరిగిన తర్వాత ప్రజల్లో ఇలాంటి ధోరణి ఎక్కువైంది.
లాక్‌డౌన్ సమయంలో ఇదే అదునుగా సైబర్ నేరస్థులు దాడులకు దిగారని సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ తెలిపింది. భారత్‌లో ఏయే సినిమాలు, టీవీ కార్యక్రమాల పేర్లను ఆధారంగా చేసుకొని దాడులకు దిగారో వెల్లడించింది. మర్దాని 2, చపాక్, లవ్ ఆజ్ కల్, బాహుబలి, గల్లీ బాయ్ పేర్లు టాప్-10 జాబితాలో నిలవడం గమనార్హం.
‘లాక్‌డౌన్ వల్ల ఆన్‌లైన్ ఎంటర్‌టైన్ ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. దీంతో దాడులు చేసేందుకు సైబర్ నేరగాళ్లు ఇదే అనువైన సమయంగా భావించారు. ఉచితంగా కంటెంట్‌ను వీక్షించాలనే వారినే లక్ష్యంగా ఎంచుకున్నారు. వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డులు దొంగిలించేందుకు మాల్వేర్లు డౌన్‌లోడ్ చేసుకొనేలా సినిమా, టీవీ కార్యక్రమాల పేర్లతో గాలం వేశారు’ అని మెకాఫీ ఇండియా ఉపాధ్యక్షుడు వెంకట కృష్ణాపుర్ తెలిపారు.
స్థానిక భాషల విషయానికి వస్తే హిందీపై సగం దాడులు జరిగాయని వెంకట కృష్ణాపుర్ అన్నారు. టీవీల్లో ఎక్కువగా వీక్షించే దిల్లీ క్రైమ్, పంచాయత్, అకూరి, గౌల్ టాప్-10లో నిలిచాయన్నారు. లాక్‌డౌన్ సమయంలో డబ్బులు చెల్లించి చూసే ప్రీమియం కంటెంట్ సరళి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఉచిత కంటెంట్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే వారినే సైబర్ నేరగాళ్లు దాడుల కోసం ఎంచుకుంటున్నారని వెల్లడించారు. వినియోగదారులు తమ ఆన్‌లైన్ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. పైరసీ కంటెంట్ ఉండే వేదికల్లో మాలీసియస్ సాఫ్ట్‌వేర్ల ప్రమాదం పొంచివుంటుందని హెచ్చరించారు.