పజిల్ లో అల్లి బిల్లి మెలిక ప్రశ్నలను వేసి మన అమ్మకో, అక్కకో, తమ్ముడికో, స్నేహితునికో సవాల్ విసిరే ఉంటాం కదండీ. ఆ ప్రశ్నకు వాళ్లు సమాధానం చెప్పలేకపోతే.. ఒకటో, రెండో క్లూలూ ఇచ్చేఉంటాం. అప్పటికీ చెప్పలేకపోతే.. వారిని కాసేపు సరదాగా ఆటపట్టించి లోలోన ఆనందాన్ని పొంది మరీ చెప్పేస్తున్నా..! చెప్పేయమంటావా..!! అంటూ ఊరించి మరీ చెప్పేవాళ్లలో మీరూ ఉండే ఉంటారు కదూ..! అక్షరాల జిమ్మిక్కులతో, అంకెల గారడీతో, ఊహకందని చిక్కు ప్రశ్నలతో… మెదడుకుమేత ఆటల విశేషాల గురించి సరదాగా ముచ్చటించుకుందామా..!ఆలోచనకు సరికొత్త మార్గంలో తీసుకువెళ్తూ.. అక్కడ ఏమీ లేకపోయినా.. వేసే ప్రశ్నను బట్టి ఏదో ఉండే ఉంటుందనీ మందుగానే బ్రెయిన్న్ని ఎలర్ట్చేసే పజిల్స్.. తికమక పెడుతూ.. కొన్ని సెకన్లలోనే ఆలోచనా శక్తి పరిధిని పెంచే రకరకాల పజిల్ను రోజులో ఒక్కసారైనా చేయాలంటున్నారు నిపుణులు. మొట్టమొదట బీజగణితం, రేఖాగణితం కోసం బ్రెయిన్ టీజర్ను గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు ఆర్కిమెడిస్ వెలుగులోకి తీసుకొచ్చాడు. లెక్కల్ని పరిష్కరించేందుకు లాజికల్గా ఆలోచిస్తూ.. వాటిని సాధించడంలో ఆయన పేరుపొందాడు.
**చిలిపిగానూ..
అన్ని పోటీ పరీక్షల్లోనూ 40 మార్కుల లాజికల్ థింకింగ్ ప్రశ్నలుంటున్నాయంటే.. వీటి ప్రాధాన్యతని అర్థంచేసుకోవచ్చు. ఇవి ఒకప్పుడు చిక్కు ప్రశ్నలుగా, పొడుపు కథలు, పిల్లమర్రిపేరుతో చెప్పుకునేవాళ్లం. అందులో ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ… ఏడు చేపల కథ సాగేది. భేతాళ కథల్లో సమాధానం తెలిసి చెప్పకపోతే..బుర్ర వెయ్యి వక్కలవుతుందనీ, చెబితే తిరిగి బేతాళుడు చెట్టుమీదకెళ్లిపోతాడు. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలి. ఇప్పుడా కథలు పోయి సాధారణ నుంచీ కష్టతరమైన అంశాల్ని సాల్వ్ చేసే ఎన్నో పజిల్స్ వచ్చి చేరాయి. అంకెలతో, అక్షరారాలతో, ఆకారాలతో, దారి కనిపెడుతూ, ఫొటోల్లోని తప్పుని కనిపెడుతూ.. ప్రమాదం నుంచి బయటపడటం ఎలా? అనే థీమ్స్తో సామాజిక మాధ్యమంలో అందుబాటులోకి వచ్చాయి. రాధిక రవిను అడిగింది… ‘కాఫీ కప్కు హ్యాండిల్ ఎక్కడ ఉంటుంద’ని. రవి ‘ఎడమ చేతివాటం ఉంటే ఎడమ వైపు, లేక కుడిచేతి వాటం ఉంటే కుడివైపు..!’ అని సమాధానమిచ్చాడు. ‘కాదురా.. కప్కు బయట ఉంటుంది!’ అని చిలిపిగా సమాధానంగా చెప్పింది. నిజమే కదా అనిపించినా ఒక్కోసారి బురిడీ కొడుతుంటాం.
*ప్రశ్నలతో సవాల్ …
అపార్ట్మెంట్ పిల్లలు ఒక దగ్గరకు చేరి రెండు గ్రూపులై రకరకాల చిక్కు ప్రశ్నలు వేసుకుంటూ పోటా పోటీగా ఆడుకుంటున్నారు. కావ్య లేచి ‘నదిపై వెళ్తోన్న పడవలో నువ్వునావ్ అనుకో.. ఆ నీటిలో మొసళ్లు ఉన్నాయి. పడవ మునిగిపోయేలా ఉంది. ఆ సమయంలో పడవలోనే ఉంటావా, లేక నీటిలో దూకి మొసళ్లు నుంచి తప్పించుకుంటావా..!?’ అని ఎదుటి టీమ్వాళ్లను అడిగింది. అందరూ కలిసి నీటిలో దూకి మొసళ్ల నుంచి తప్పించుకుంటాం అని సమాధానం చెప్పారు. కానీ, కావ్య ‘నేనైతే… ఊహించుకోవడం ఆపేస్తాను..’ అని జవాబు చెప్పింది. ఇలా ఒక్కోసారి చిలిపిగానూ ఆలోచిస్తుంటాం కదండీ..! కవిత, బబిత ఇద్దరూ కవల పిల్లలు. వాళ్ల పుట్టినరోజుకు తన స్నేహితులందరి కోసం ప్రత్యేక విందు భోజనం కోసం మధ్యాహ్నం ఫిబ్రవరి 31న ఇంటికి రమ్మని ఆహ్వానించింది. అందరూ సరే అంటూ… తలాడించారు ఒక్కరు మినహాయిస్తే..! ఇదొక లాజిక్తో కొట్టేదైతే, పదాలతో ఆడుకునేది మరొకటి. ఎటు చూసినా ఒకే పదం వచ్చే రెండు పదాల్ని చెప్పమనగా… ‘టమాట’, ‘వికటకవి’ సమాధానంగా చెప్పారు. మరో టీమ్ నుంచి ఇంగ్లీషులో ఎ,ఇ,ఐ,ఓ,యు అన్నీ ఉండే పదాన్ని చెప్పమంటే, ఎవరూ చెప్పలేకపోయారు. దాంతో ఆటకు బ్రేక్ పడింది. దీనికి సమాధానం మీరూ ఆలోచించండి ఓసారి.
*జీవిత పరీక్షల్లోనూ…
బ్రెయిన్టీజర్లని అంత తేలిగ్గా తీసిపారేయనక్కర లేదు. అనేక విషయాల్లో లాజికల్ థింకింగ్ జీవిత పరీక్షల్లోనూ నిలబడేలా చేస్తాయి. కొంతమంది ఒక సంస్థలో మేనేజర్ పోస్టుకు ఇంటర్వ్యూకు హాజరవుతారు. ఆ ఉద్యోగానికి అర్హత ప్రకారం 30 మంది హాజరుకాగా.. ముగ్గురు మిగులుతారు. ఆ సంస్థ యజమాని ముగ్గురునీ ఒకే ప్రశ్న వేస్తాడు. ‘మీకు మేనేజర్ ఉద్యోగం ఇస్తే… ఇప్పటికిప్పుడు అర నిమషంలో మీరేం చేస్తారు?’ అనగానే… మొదటివాడు వెంటనే లేచి గత నెలలోనే ఇంకా ఉన్న క్యాలెండర్ని తిప్పి ప్రస్తుత నెలలో పెడతాడు. రెండోవాడు యజమాని టేబుల్ పై తాగేసిన కాఫీ కప్ను తీసేసి కింద పెడతాడు. మూడోవాడు.. కాలింగ్ బెల్కొట్టి బారుని పిలిపించి రూమ్ మెయిన్టెనెన్స్ సరిగా లేదు, వెంటనే చేయాలని చెబుతాడు. తామే స్వయంగా పనుల్ని చేసినా వారిద్దరికీ ఉద్యోగం రాదు. మేనేజర్ అనేవాడు ఆఫీస్ నిర్వహణ చేయించగలగాలనే ఆలోచనతో మూడోవాడికి ఉద్యోగం ఇస్తాడు యజమాని. ఇలా ఒక్కోసారి ఉద్యోగ అర్హతలే కాకుండా.. ఈ విధంగా అప్పటి పరిస్థితుల్ని బట్టి ప్రాక్టికల్గా ఆలోచించి సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
*బుజ్జి బుర్రతో…!
ఒక్కోసారి బుజ్జి బుర్రలకు పెద్ద ఆలోచనలు తడతాయి కదండీ..! మూడో క్లాస్ చదువుతున్న దివ్యకు నిద్ర రాకపోయేసరికి అమ్మ ఒక చిక్కు ప్రశ్నకి పరిష్కారం చెప్పమంది. ‘ఒక నది ఉంది. ఒక పడవ, ఒక మనిషి, మేక పిల్ల, గడ్డి మోపు, పులి ఉన్నాయి. ఇవన్నీ నదిని దాటాలి అయితే, ఆ పడవలో ఇద్దరు మించి వెళితే మునిగిపోతారు. మనిషి ఉంటే మేక గడ్డినీ పులి మేకనూ తినకుండా చూసుకోగలడు. ఎలా దాటిస్తావ్..? అని అడుగుతుంది. వెంటనే… లైట్ వేసి ఒక పేపర్ తీసుకుని దివ్య బొమ్మను గీసి ఇలా సమాధానం చెప్పింది. ‘ముందుగా మనిషి పడవలో మేకను తీసుకెళ్లి అవతల వడ్డున దించి వస్తాడు. మళ్లీ వచ్చి.. గడ్డినీ తీసుకెళ్లి అక్కడ దింపి తనతో మేకను వెంట తీసుకెళ్తాడు. తర్వాత మేకను దించి పులిని తీసుకెళ్లి దించి వస్తాడు. మళ్లీ వచ్చి మేకను తీసుకెళతాడు’ అని చెప్పింది. దివ్య ఆలోచనను మెచ్చుకుంటుంది అమ్మ.
*అంకెల గారడీ..
ఎంతటి వారికైనా చిన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమట..! అదీ అంకెల విషయంలో మరీ తికమక పడటం సహజం అని ఎన్నో సర్వేల్లో నిర్ధారణ అయిన విషయం. వృత్తాలు, చతురస్రాలు, త్రిభుజాల వంటి ఆకారాల్లో బొమ్మల్ని గీసి అందులో ఎన్ని దాగున్నాయని అడిగినప్పుడు.. వందలో కేవలం ముగ్గురు మాత్రమే దగ్గర వరకూ వచ్చి ఆగిపోవటం సహజమట..! అంకెల్లో వేసే ప్రశ్నలకు వందలో ఇరవై మంది చెప్పగలుగుతున్నారట.! అందులో పదిహేనుమంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే ఉంటున్నారు. నేడు ఇంటర్వ్యూల్లో వారి ఆలోచనా విధానాన్ని, చురుకుదనాన్ని పరిశీలించడం కోసం 78 శాతం బ్రెయిన్ టీజర్స్ ప్రశ్నలనే వేసి ఉద్యోగం ఇవ్వాలా వద్దా నిర్ణయం తీసుకుంటున్నారట! బ్రెయిన్టీజర్లని సునాయాసంగా చేయాలనుకుంటే సాధ్యమైనంత వరకూ సొంత బుర్రకే పదును పెట్టాలని గతేడాది యుకేలో ‘ట్రై లైఫ్’ సర్వేవారు నిర్వహించిన సర్వేలో తేలింది. అంకెల్లో లెక్కేసి వారి వయసు అడిగినా 98 మంది సరైన జవాబు చెప్పలేదట. ఏజ్ క్యాలిక్యులేటర్ సహాయం తీసుకుంటున్నారట. చిన్న చిన్న లెక్కల్ని కూడా క్యాలిక్యులేటర్లని ఉపయోగించడం వల్ల షార్ట్కట్ అలవాటై మెదడు చురుకుదనం తగ్గిపోతోందని ఆ సర్వేలోని సారాంశం.
చూశారుగా… మీతో మీరే పోటీ పడాలంటే.. సమయం ఉన్నప్పుడల్లా ఏదో ఒక బ్రెయిన్ టీజర్ని చేస్తూ ఉండాలి సుమా..! మీకు తెలుసా! ఒక్క ప్రశ్నకు సమాధానంగా ఎన్ని కోణాల్లో అలోచనలు వస్తాయనే సంగతి ఇప్పటికీ నిర్థారణ కాని అంశంగానే ఉంది. అక్షరాలతో, ఆకారాలతో, అంకెలతో, రకరకాల చిక్కు ప్రశ్నలకు పరిష్కరించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. బిగినర్ నుంచీ ఎక్స్పర్ట్ లెవల్ వరకూ సమస్యల్ని పరిష్కరించే క్రమంలో చురుకైనవారుగా తయారవుతారు.చెస్ చాంపియన్స్, ఆర్మీ ఆఫీసర్లు, ఇంజినీర్లు ఎక్కువగా బ్రెయిన్ టీజర్లను పరిష్కరించేందుకు ఇష్టపడారట. ప్రస్తుతం ఏఐ ద్వారా రకరకాల బ్రెయిన్ టీజర్లని ఇంటర్నెట్లో పెడుతున్నారు.ఇవి ఏకాగ్రతను పెంచేవిగా ఉపయోగపడతాయి. అలసటని తగ్గించి లాజికల్ థింకింగ్ అలవాటై జీవితంలో ఎదురయ్యే విషయాల్ని తర్కంతో ఆలోచించే అలవాటు పెరుగుతుంది.