DailyDose

ఏడాది పొడవునా పీవీ జయంతి వేడుకలు-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today || PV Jayanthi 2020 In Telangana

* కరోనా పరిస్థితుల్లోనూ వైకాపా కుంభకోణాలు, కక్ష సాధింపు చర్యలు గర్హనీయమని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెదేపా సీనియర్‌ నేతలతో చంద్రబాబు ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ఇంటింటికీ మూడు మాస్కులు అందిస్తామని చెప్పి వైకాపా ప్రజలను మోసం చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘‘మాస్క్‌ల తయారీలోనూ వైకాపా స్కామ్‌లు చేస్తోంది. కరోనా కిట్లు, బ్లీచింగ్‌ కొనుగోళ్లలో వైకాపా కుంభకోణాలు చేస్తోంది. 108 అంబులెన్స్‌లలో రూ.307 కోట్ల స్కామ్‌ జరిగింది. అంబులెన్సులు కాంట్రాక్ట్‌ ఇచ్చిన కంపెనీ విజయసాయిరెడ్డి అల్లుడిది కాదా? సరస్వతి పవర్‌ మీ సొంత కంపెనీ అవునా.. కాదా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

* 2020కి భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు 3.1 శాతం ఉంటుందని మూడీస్‌ అంచనా వేసింది. ఏప్రిల్‌లో సంవత్సర ఆర్థిక వృద్ధి 0.2 శాతం నమోదు చేసిందని మూడీస్‌ తెలిపింది. అయితే కరోనా అంతరాలను అధిగమించిన తర్వాత వృద్ధి రేటు భారీగా పెరిగిందని మూడీస్‌ తెలిపింది. 2021 నాటికి భారత్‌ వృద్ధి రేటు 6.9 శాతం ఉంటుందని అంచనా వేసింది. జీ-20 దేశాల్లో వృద్ధి రేటు నమోదు చేసిన దేశం చైనా ఒక్కటేనని మూడీస్‌ వెల్లడించింది. ఈ ఏడాది చైనా వృద్ధి రేటు ఏడు శాతం ఉంటుందని మూడీస్‌ అంచనా వేసింది.

* ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రతినిధికి కరోనా వైరస్‌ సోకింది. ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. ఈ నెల 10న ఎమ్మెల్యే అమెరికా నుంచి వచ్చారు. కరోనా లక్షణాలను గుర్తించిన అధికారులు పరీక్షలు నిర్వహించారు. ట్రూనాట్‌, ఆర్డీ-ఆర్పీ, ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో ఆయన కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 19న జరిగిన రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

* రైళ్లలో ప్రత్యేకంగా అదనపు బోగీలు ఏర్పాటు చేయడం సాంకేతికంగా వీలు కాదని హైకోర్టుకు డీఆర్ఎం వివరించారు. స్వస్థలాలకు వలస కార్మికుల తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆనంద్ భాటియా విచారణకు హాజరయ్యారు. బిహార్‌కు చెందిన 45 మంది వలస కూలీలను బుధవారం స్వస్థలాలకు చేరుస్తామని డీఆర్ఎం న్యాయస్థానానికి తెలిపారు. వారికి అత్యవసర కోటాలో రేపటి రైళ్లలో టికెట్లు ఖరారు చేస్తామని తెలిపారు.

* ప్రపంచదేశాలతో పాటు భారత్‌నూ కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్‌ యాత్ర ఈ ఏడాది భారత్‌ నుంచి ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ప్రకటించారు. కరోనా ప్రభావం కారణంగానే సౌదీ అరేబియా ప్రభుత్వ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తు రుసుము మొత్తం వాపస్‌ ఇస్తున్నట్లు తెలిపారు. డైరెక్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా డబ్బులు వెనక్కి ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

* కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా రైలు ప్రయాణం రద్దయిన ప్రయాణికులకు ఊరట కలిగించేలా భారతీయ రైల్వే ఓ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 14 లేదా ఆ తర్వాత రైళ్లలో ప్రయాణించేందుకు టికెట్లను కొనుగోలు చేసిన ప్రయాణికులకు… సంబంధిత టికెట్‌ మొత్తాన్ని పూర్తిగా తిరిగివ్వాలని నిర్ణయించినట్టు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా భారతీయ రైల్వే ఏప్రిల్‌ 15 నుంచి అన్ని సాధారణ రైళ్లలో బుకింగ్‌లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రారంభమైన సందర్భంగా అన్ని రైలు సర్వీసులను నిలిపివేసింది.

* భారత ప్రభుత్వం ఛార్టర్ విమానాల రాకపోకల విషయంలో వివక్షతో వ్యవహరిస్తోందని అమెరికా రవాణా శాఖ ఆరోపించింది. భారత విమానయాన సంస్థలు ఛార్టర్‌ విమానాలు నడిపే ముందు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. దీంతో భారత్‌ సంస్థ నడిపే ప్రతి విమానాన్ని పరిశీలించే అవకాశం అమెరికా అధికారులకు లభిస్తుంది. భారత్‌-అమెరికా విమాన రవాణా ఒప్పందం ప్రకారం సమాన అవకాశాలు కల్పించామని అమెరికా రవాణా శాఖ పేర్కొంది. భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది.

* దేశీయ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల బాటలో పయనించాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల సందడి నెలకొన్న వేళ సూచీలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 519 పాయింట్లు లాభపడి, 35,430 వద్ద ముగిసింది. నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 10,471 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.64 వద్ద కొనసాగుతోంది. ఉదయం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో 122 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ ఆ తర్వాత ఒక్కసారిగా పతనమైంది. హెచ్‌1బీ‌ వీసాలను ఏడాది చివరి వరకూ స్తంభింపజేస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటన ఐటీ షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించడంతో మార్కెట్లు నష్టపోయాయి.

* గల్వాన్‌ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ అనంతర సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దే దిశగా భారత్‌-చైనాలు అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ‘‘మోల్డోలో సోమవారం సుమారు 10 గంటల పాటు చర్చలు జరిగాయి. మంచి, సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో ఇరు దేశాల అధికారులు చర్చించారు. ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లేందుకు ఇరువురు పరస్పర అంగీకారానికి వచ్చినట్లే. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని ఘర్షణ ప్రాంతాల నుంచి ఇరువురు వెనక్కి వెళ్లే కార్యాచరణపై చర్చిస్తున్నాం’’ అని ఆర్మీ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.

* జులై 8న ఉచిత ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలను పంపిణీకి సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘స్పందన’పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 29 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని జగన్‌ తెలిపారు. ‘‘ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ పూర్తి కావాలి. కొవిడ్‌ తగ్గుముఖం పట్టాక రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పర్యటిస్తా. రీచ్‌లు ముగినిపోకముందే 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను నిల్వ చేయాలి. ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేలా అనుమతికి త్వరలోనే ఉత్తర్వులు ఇస్తాం. ట్రాక్టర్లకు సంబంధించిన అంశంపైనా త్వరలోనే ఉత్తర్వులు వస్తాయి’’ అని సీఎం జగన్‌ చెప్పారు.

* బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పివి జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్ లోని పివి జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జయంతి వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్ లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ కె. కేశవరావు, మంత్రి శ్రీ ఈటల రాజెందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సలహాదారు శ్రీ రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ, శ్రీ పివి నరసింహారావు కుమారుడు శ్రీ పివి ప్రభాకర్ రావు, కుమార్తె శ్రీమతి వాణి దేవి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీ ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంలో సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం ఉత్సవాల నిర్వహణ సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలను నిర్దేశించారు.

• పివి జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్ లోని పివి జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పరిమిత సంఖ్యతో జరుగుతుంది. ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
• జూన్ 28న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జన్మదిన వేడుకలు జరపాలి. మంత్రి శ్రీ కెటి రామారావు ఈ కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షిస్తారు.
• పివికి తెలంగాణ రాష్ట్రంతోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర రాష్ట్రాలతో కూడా అనుబంధం ఉంది. దేశ వ్యాప్తంగా అనేక మందితో అనుబంధం ఉంది. అనేక మంది అనుచరులు, సహచరులు, అభిమానులు ఉన్నారు. ప్రధానిగా, విదేశాంగ శాఖ మంత్రిగా సేవలందించడం వల్ల విదేశాల్లో కూడా ఆయనతో అనుబంధం కలిగిన వారున్నారు. కాబట్టి పివి జయంతిని రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించాలి. ఎక్కడ ఏ కార్యక్రమం ఎలా నిర్వహించాలనే విషయంలో కార్యాచరణ రూపొందించాలి.
• పివి శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలను బట్టి, నిధులు విడుదల చేసుకుంటూ పోతాం.
• ‘పివి తెలంగాణ ఠీవి’ అని ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉంది. ఆయన గొప్పతనం, చేసిన సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసే విధంగా అనేక విభిన్న కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించాలి.
• రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం మెమోరియల్ పెట్టిన విధంగానే హైదరాబాద్ లో పివి మెమోరియల్ ఏర్పాటు కావాలి. కెకె నేతృత్వంలోని కమిటి సభ్యులు రామేశ్వరం వెళ్లి వచ్చి, పివి మెమోరియల్ ఎలా ఉండాలో ప్రభుత్వానికి సూచించాలి.
• వివిధ సందర్భాలకు సంబంధించిన పివి ఫోటోలను సేకరించాలి. వాటిని భద్రపరచాలి. ఫోటో ఎగ్జిబిషన్ లు నిర్వహించాలి.
• ఐదు కాంస్య విగ్రహాలను నెలకొల్పాలి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పివి విగ్రహాలు నెలకొల్పాలి. విగ్రహాల కోసం వెంటనే ఆర్డర్ ఇవ్వాలి.
• రాష్ట్ర అసెంబ్లీలో పివి చిత్ర పటాన్ని పెట్టాలి.
• పివి బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వతంత్ర్య సమరయోధుడుగా, రాజకీయ నాయకుడుగా, జర్నలిస్టుగా, బహుభాషా కోవిదుడుగా, రచయితగా సేవలందించారు. ఆయా రంగాల్లో ఆయన చేసిన కృషిని తెలిపే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక సావనీర్ తీయాలి. సావనీర్ మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో చేసిన కృషి, వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో ప్రత్యేక సంచికలు రావాలి.
• పివి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చేశాయి. పివికి ముందు దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? పివి తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి ఎలా తయారైంది? అనే విషయాలను పొందు పరుస్తూ ప్రత్యేక సంచిక రావాలి. ఆర్థిక నిపుణులతో వ్యాసాలు రాయించాలి.
• విద్యారంగంలో కూడా పివి ఎంతో కృషి చేశారు. సర్వేల్ లో మొదటి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు. అది దేశంలో గురుకులాల స్థాపనకు నాంది పలికింది. దేశ వ్యాప్తంగా నవోదయ పాఠశాలలను నెలకొల్పారు. ఇలా విద్యారంగాభివృద్ధికి చేసిన కృషిని వివరించే విధంగా రచనలు చేయించాలి. ప్రత్యేక సంచిక తీసుకురావాలి.
• పివి నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశ గతిని మార్చిన గొప్పవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు నేనే (సీఎం) స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా.
• యావత్ దేశ ప్రజలకు ఆయన గొప్పతనం చెప్పే విధంగా జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడిలను శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించాలి. వారు పాల్గొనే కార్యక్రమాలు ఎలా ఉండాలో డిజైన్ చేయాలి.
• భారత పార్లమెంటులో పివి చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరతాం.
• మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ లతో పివికి ప్రత్యేక అనుబంధం ఉంది. వారిద్దరినీ కూడా భాగస్వాములను చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలి.
• పివి గొప్ప సాహితీవేత్త. అనేక భాషలపై పట్టున్న పండితుడు. అనేక రచనలు చేశారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా పివి రాసిన పుస్తకాలను పునర్ముద్రించాలి. అముద్రితంగా ఉన్న వాటిని ముద్రించాలి. వాటిని లైబ్రరీలకు, విద్యా సంస్థలకు, ప్రముఖులకు ఉచితంగా పంపిణీ చేయాలి. ఈ బాధ్యతను సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖ తీసుకుంటుంది.
• తెలంగాణలోనే కాక దేశ వ్యాప్తంగా పివి అభిమానులు, అనుచరులున్నారు. వారందరినీ సంప్రదించాలి. వారి సూచనలు తీసుకోవాలి. వారి అభిప్రాయాలను సావనీర్, ప్రత్యేక సంచికల్లో పొందు పరచాలి. వారిని జయంతి ఉత్సవాల్లో భాగస్వాములను చేయాలి.
• హైదరాబాద్, ఢిల్లీ, వరంగల్, కరీంనగర్, మంథని, బరంపురం, నాగపూర్ తదితర నగరాల్లో పివి కాలం గడిపారు. ఆయా సందర్భాల్లో ఆయనతో గడిపిన వారు, ఆయనతో అనుబంధం ఉన్నవారు ఉంటారు. వారినీ భాగస్వాములను చేయాలి.
• బిల్ క్లింటన్, జాన్ మేజర్ లాంటి వివిధ దేశాల మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులు, మంత్రులతో కూడా పివికి అనుబంధం ఉంది. వారి అభిప్రాయాలు కూడా సేకరించాలి. వీలయితే వారిని ఉత్సవాలలో భాగస్వాములను చేయాలి.
• పివి గొప్పతనం దేశానికంతా తెలిసేలా దేశ వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాల సందర్భంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి. ఢిల్లీ, కలకత్తా, చెన్నయ్, బెంగులూరు తదితర నగరాల్లో హోర్డింగులు పెట్టాలి. హైదరాబాద్ లో కనీసం 100 చోట్ల హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి.
• విద్య, సాహిత్య, రాజకీయ తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ప్రత్యేకంగా గుర్తించడం కోసం పివి స్మారక అవార్డు నెలకొల్పాలి. క్రమం తప్పకుండా అవార్డులు ఇవ్వాలి.
• విద్యాసంస్థలు పునఃప్రారంభం అయిన తర్వాత విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.
• రాష్ట్రంలోని ప్రతీ ఊరికీ పివి గొప్పతనం తెలిసేలా, ప్రజలంతా పివి ఘన చరిత్రను తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. అన్ని స్థాయిల అధికారులు, ప్రజాప్రతినిధులు అందులో భాగస్వాములు కావాలి.
• పివి తెలుగువాడు. తెలంగాణ వాడు. జర్నలిస్టు. సాహితీవేత్త. కాబట్టి పివికి ఘనమైన అక్షర నివాళి అర్పించే విధంగా రచయితలు ప్రత్యేక రచనలు చేయాలి. కవులు పాటలు రాయాలి. పత్రికలు ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాలని కోరుతున్నాను.