గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో గెయిల్ ఇండియా రాణించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే నికర లాభం 170 శాతం పెరిగి రూ.1,122.23 కోట్ల నుంచి రూ.3,018.20 కోట్లకు చేరింది. పెట్రోరసాయనాలు, సహజవాయువు ధరలు బాగా తగ్గినప్పటికీ, కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు వల్ల లాభం బాగా పెరిగిందని గెయిల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ జైన్ వెల్లడించారు. మినహాయింపులను వదులుకోవడానికి సిద్ధమైన సంస్థలకు ప్రభుత్వం అందించే తక్కువ కార్పొరేట్ పన్ను రేట్లను కంపెనీ ఎంచుకుందని ఆయన తెలిపారు. ‘కరోనా వైరస్ లాక్‌డౌన్‌తో పరిశ్రమలు మూతపడటంతో ఇంధన గిరాకీ బాగా తగ్గింది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. సహజ వాయువుకు కూడా ఏప్రిల్‌లో 30 శాతం గిరాకీ తగ్గింది. సీఎన్‌జీ వాహనాలు రోడ్లపైకి రాకపోవడమే ఇందుకు కారణం. పరిమితులు సడలించిన తర్వాత మళ్లీ గిరాకీ సాధారణ స్థాయికి చేరుకుంది. రెండు నెలల్లో మళ్లీ కొవిడ్-19కు ముందున్న విక్రయాల స్థాయికి చేరుకుంటామ’ని మనోజ్ జైన్ వివరించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 74 కార్గోల ద్రవరూప సహజ వాయువును (ఎల్‌ఎన్‌జీ) దిగుమతి చేసుకుంది. అమెరికా నుంచి 44, ఖతార్ నుంచి 3, రష్యా నుంచి 15, స్పాట్ మార్కెట్ నుంచి 12 కార్గోల్ని దిగుమతి చేసుకుంది. 2020 మార్చి ఆఖరుకు ఇందులో 56 కార్గోల ఎల్‌ఎన్‌జీని విదేశీ విపణిలోనే విక్రయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో యూఎస్ నుంచి 49 కార్గోల్ని దిగుమతి చేసుకొని, అందులో 28 కార్గోల ఎల్‌ఎన్‌జీని విదేశీ విపణిలో విక్రయించాలనే ప్రణాళికతో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ విస్తరణ ప్రణాళికలపై రూ.6,114 కోట్ల మూలధన వ్యయం చేసింది. ఇందులో ప్రధానంగా పైపులైన్లు వేయడంపైనే వెచ్చించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.4,000-5,000 కోట్ల మూలధన వ్యయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ వివాద్ సే విశ్వాస్ పథకం కింద రూ.2,157.34 కోట్ల విలువైన 44 ఆదాయపు పన్ను కేసుల్ని (1996-97 నుంచి 2016-17 మదింపు సంవత్సరం వరకు) పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపుతోంది.
రికార్డులు బద్ధలుకొట్టిన GAIL లాభం
Related tags :