భారత వ్యాపార రంగంలో హిందుజా సోదరులకు ప్రత్యేక స్థానం ఉంది. వారి గ్రూప్ నిర్వహించే వ్యాపారాలను నలుగురు సోదరులు సమష్టిగా నిర్వహిస్తారనే పేరుంది. ఇప్పుడు హిందుజా సోదరుల మధ్య ఆస్తివివాదం తలెత్తినట్లు ఆంగ్లపత్రికల్లో కథనాలు వస్తున్నాయి. సోదరుల్లో పెద్దవాడైన శ్రీచంద్ పరమానంద్ హిందుజా కుమార్తె విన్నో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. శ్రీచంద్, గోపిచంద్, ప్రకాశ్, అశోక్‌లో 2014 జులైలో ఒక ఒప్పందం రాసుకొన్నారు. వారి ఆస్తులు ఏ ఒక్కరి పేరుతోనో కాకుండా.. నలుగురి పేరుతో ఉండేలా అంగీకారానికి వచ్చారు. ఇప్పుడు శ్రీచంద్ సంతానం ఆస్తులను వేరు చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ఒప్పందానికి సంబంధించి ఇప్పుడు లండన్, స్విట్జర్లాండ్, జెర్సీలో కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ శ్రీచంద్ కుమార్తె విన్నో హిందుజా లండన్‌లోని బిజినెస్ అండ్ ప్రాపర్టీ కోర్టును ఆశ్రయించారు. శ్రీచంద్‌కు డైమన్షియా ఉందని ఆయనకు తనను లిటిగేషన్ ఫ్రెండ్‌గా భావించాలని ఆమె కోర్టును కోరారు. శ్రీచంద్ భార్య, సంతానం కూడా విన్నోకు మద్దతు తెలిపారు. కానీ, మిగిలిన హిందుజా సోదరులు దీనిని వ్యతిరేకించారు. శ్రీచంద్ ఆరోగ్య పరిస్థితిపై విన్నో తగిన ఆధారాలను సమర్పించలేదని మిగిలిన సోదరులు పేర్కొన్నారు. కానీ, లండన్‌లోని న్యాయస్థానం వీరి వాదనతో ఏకీభవించలేదు. విన్నోను శ్రీచంద్‌కు లిటిగేషన్ ఫ్రెండ్‌గా అంగీకరిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 2018 జులై నుంచి విన్నోనే శ్రీచంద్, ఆయన సతీమణి బాగోగులు చూస్తున్నారని పేర్కొంది.
*** శిఖర్పూర్ నుంచి లండన్ వరకు..
హిందుజా సోదరుల తండ్రి పరమానంద్ హిందుజా ప్రస్తుతం పాకిస్థాన్ పరిధిలోకి వెళ్లిన సింధ్ ప్రావిన్స్‌లోని శిఖర్పూర్ అనే పట్టణంలో 1914లో వ్యాపారాన్ని ప్రారంభించారు. అనంతరం ముంబయిలోని వ్యాపార అవకాశాల్ని గమనించి అక్కడికి మకాం మార్చారు. కార్పెట్లు, డ్రైఫ్రూట్స్‌ను దిగుమతి చేసుకొని వస్త్రాలు, మసాలాలు, తేయాకు ఎగుమతి చేసే వ్యాపారం ప్రారంభించారు. మంచి లాభాలు గడించడంతో ఇరాన్లో ఉన్న వ్యాపార అవకాశాల్ని చేజిక్కించుకునేందుకు తొలి విదేశీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలా హిందూజా గ్రూప్‌నకు అంకురం పడింది. నాటి నుంచి పక్కా వ్యాపార సూత్రాల్ని పాటిస్తూ.. ఎదురు లేని సంస్థగా ఎదిగింది. 1975 తర్వాత ఇరాన్లో రాజకీయ సంక్షోభం కారణంగా తమ వ్యాపార కేంద్రాన్ని లండన్‌కి మార్చారు. నేటికీ అది లండన్‌లోనే కొనసాగుతోంది.
*** ఒక్కొక్కరిగా వ్యాపారంలోకి..
చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల పనితీరును గమనిస్తూ పెరిగిన హిందుజా సోదరులకు సహజంగానే వ్యాపార విలువలు, అందులోకి మెళకువలు తెలిశాయి. అందరికంటే పెద్దవాడైన శ్రీచంద్ చిన్న వయసులోనే వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా నిలిచారు. 1952లో పూర్తిస్థాయిలో బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నాలుగేళ్లకు అన్నకు సాయంగా గోపిచంద్ హిందుజా రంగంలోకి దిగారు. అలా కొన్ని రోజుల తర్వాత మరో ఇద్దరు సోదరులు ప్రకాశ్, అశోక్ సైతం బాధ్యతలు పంచుకొన్నారు. తన తండ్రి పరమానంద్.. వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారో స్వయంగా గమనించిన వీరికి అందులోని కిటుకులు, సూత్రాలు, నియమాలు సహజంగానే అలవడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన హిందుజా గ్రూప్ వ్యాపారాలను ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో సమర్థంగా నిర్వహిస్తున్నారు. పెద్దవారైన శ్రీచంద్, గోపీచంద్ ఇద్దరూ లండన్‌లోనే ఉంటుండగా.. ప్రకాశ్ జెనీవాలో, చిన్నవాడైన అశోక్ భారత్‌లో వ్యాపారాలను చూస్తున్నారు.