సంగీతమనేది మానవుడికి భగవంతుడు ప్రసాదించిన వరం. ఆనందం, బాధ, కోపం, ప్రేమ, విరహం వంటి ఎలాంటి భావాలకైనా అద్దంపట్టేది సంగీతమే. వేదాలు కూడా సంగీత స్వరాలే. రాళ్లను కూడా కరిగించే గాంధర్వం సంగీతం. సంగీతం సాధించలేనిది ఏదీ లేదు. ఎందుకంటే స్వరాల ప్రభావం అమోఘం కనుక. రాగం, తాళం, స్వరం సమ్మిళితమైనప్పుడు శ్రావ్యమైన సంగీతం ఉద్భవిస్తుంది. అటువంటి సంగీతానికి శాశ్వతత్వాన్ని అందించిన స్వర్ణయుగపు సంగీత సామ్రాట్ ‘‘ఎమ్మెస్’’ అని అభిమానంగా పిలిపించుకున్న కళామతల్లి కంఠాభరణం ఎమ్మెస్ విశ్వనాథన్. జూన్ 24, 1928న కేరళలో జన్మించిన ఎమ్మెస్ పన్నెండు వందల సినిమాలకు పైగా అద్భుతమైన సంగీతాన్ని అందించిన కలైమామణి. ఇవాళ ఎమ్మెస్ జయంతి.
విశ్వనాథన్ సంగీతంలో కనిపించని ఆకర్షణ ఏదో వుంది. కాలంతోబాటు ఎమ్మెస్ తన సంగీత పంథా కూడా మార్చుకున్నారు. యువతరాన్ని ఆకర్షించగలిగారు. అలాగని క్లాసికల్ టచ్‌ని విడనాడలేదు. తెలుగు సినీ రంగ విషయానికి వస్తే 1955లో విశ్వనాథన్ ‘సంతోషం’ సినిమాకు సంగీతం సమకూర్చారు. స్వతంత్ర నిర్దేశకునిగా అనేక విజయవంతమైన తెలుగు సినిమాలకు సంగీతం అందించారు. ఆయన చేసిన సంగీతానికి సింహభాగం పాటలు రాసింది ఆచార్య ఆత్రేయ. ఎమ్మెస్ ప్రజాదరణ పొందిన పాటలు తెలుగులో కోకొల్లలు. ‘తనువు కెన్ని గాయాలైనా’, ‘బుజ్జిబుజ్జి పాపాయి’ (ఆడబ్రతుకు), ‘రేపంటి రూపం కంటీ’ (మంచి − చెడు), ‘తలచినదే జరిగినదా’ (మనసే మందిరం), ‘అందాల ఓ చిలకా’, ‘కోడి ఒకకోనలో’ (లేతమనసులు), ‘నన్ను ఎవరో తాకిరి’ (సత్తెకాలపు సత్తెయ్య), ‘ఏమంటున్నది ఈ గాలి’ (మేమూ మనుషులమే), ‘తాళికట్టు శుభవేళా’ (అందులేని కథ), ‘ఏ తీగ పూవునో’ (మరో చరిత్ర), ‘సన్నజాజులోయ్’ (సింహబలుడు), ‘అటుఇటు కాని హృదయము తోటి’ (ఇది కథకాదు), ‘నువ్వేనా సంపంగి పువ్వుల’ (గుప్పెడుమనసు), ‘కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు’ (అందమైన అనుభవం), ‘కన్నె పిల్లవని కన్నులున్నవని’ (ఆకలిరాజ్యం), ‘కదిలే మేఘమా’ (లైలా), ‘పల్లవించవా నా గొంతులో’ (కోకిలమ్మ) పాటలు ఉదాహరణకు కొన్ని మాత్రమే. ఎమ్మెస్ కొన్ని మలయాళ సినిమాల్లో నటించారు కూడా.