Agriculture

అద్దెకు ఎడ్లు

అద్దెకు ఎడ్లు

మనం షేరింగ్‌ ఎకానమీలో బతుకుతున్నాం. కార్లు, బైకులు, సైకిళ్లు, మంచాలు, సోఫాలు, బట్టలు.. సమస్తం అద్దెకు దొరుకుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే… వ్యవసాయానికి సంబంధించి జనరేటర్లు, టార్పాలిన్లు, స్ప్రేయర్లు, నాగళ్లు బాడుగకు దొరికేవి. ప్రస్తుతం ఎద్దులు కూడా అద్దెకు ఇస్తున్నారు. దీంతో రైతన్నలకు ఎంతో మేలు కలుగుతున్నది.
*ఒకప్పుడు పల్లెల్లో ఇంటికో జత ఎద్దులుండేవి. దీంతో వ్యవసాయం సులువయ్యేది. ఎక్కడికైనా వెళ్లాలన్నా ఎడ్లబండే ప్రయాణ సాధనం. పశువుల పేడ ఎరువుగా కూడా పనికొచ్చేది. ప్రస్తుతం పల్లెల్లో రవాణా వ్యవస్థ మెరుగుపడింది. వ్యవసాయంలోకి యంత్రాలు వచ్చినయ్‌. ఇదే సమయంలో మేతకు కొరత ఏర్పడింది. భూతాపం కారణంగా నీటికి కటకట మొదలైంది. నిత్యావసరాలకే నీరు దొరకని పరిస్థితి. దీంతో రైతులకు మూగజీవాల పోషణ భారంగా మారింది. ఫలితంగా పశువుల్ని దూరం చేసుకున్నారు. అంతలోనే రైతులో పశ్చాత్తాపం. ట్రాక్టర్ల ద్వారా దుక్కులు దున్నుతున్నా… అధిక దిగుబడి రావడం లేదన్న చింత. దీంతో మళ్లీ బసవన్నలనే మట్టిలోకి దించుతున్నారు. మరి ఎద్దులు లేని వారి పరిస్థితి? పరిష్కారంగా ‘ఎద్దులు అద్దెకు ఇవ్వబడును’ అని బోర్డు పెడుతున్నారు నిజామాబాద్‌ జిల్లాలోని బేరగాళ్లు.
*రైతుకు ఉపయోగమెట్లంటే..
ఆర్మూర్‌ ప్రాంతంలో ఎక్కువగా పసుపు పండిస్తారు. ఈ పంటను సాగు చేయడానికి ఎక్కువ లోతు దున్నాల్సి ఉంటుంది. ట్రాక్టర్లతో భూమిలో సాళ్లు ఎక్కువ లోతులో ఉండవు. ఎడ్లను ఉపయోగించి నాగళ్లతో దున్నితేనే అది సాధ్యం. అప్పుడే అధిక దిగుబడి వస్తుంది. ఎక్కువ లోతులో దున్ని పసుపు సాగు చేస్తే… భూమిలోని ఖనిజ లవణాలు పంటకు అందుతాయనీ, దిగుబడి మంచిగా వస్తుందనీ వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అందుకనే పసుపు రైతులు దుక్కులు దున్నడానికి ఎడ్లనే వాడుతారు.
***నెలకు ఎంత?
సాధారణంగా మూగజీవాల మార్కెట్‌లో ఎడ్ల ధర జత రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. అంత డబ్బు వెచ్చించి కొనలేని పరిస్థితి సాధారణ రైతులది. ఒక వేళ కొనుగోలు చేసినా వాటిని సాకలేని దుస్థితి. పశుగ్రాసం కొరత, నీటి కొరత… పల్లెల్ని వేధిస్తున్నాయి. ప్రతి సమస్యలోనూ ఓ వ్యాపార అవకాశం ఉంటుంది. ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌లోని వేల్పూర్‌, కమ్మర్‌పల్లి, భీంగల్‌, మండలాల్లోని అక్లూర్‌, పడిగెల, ఉప్పులూరు గ్రామాల్లోని రైతులు ఎక్కువగా అద్దెకు తీసుకుంటుంటారు. దుక్కి దున్నే సమయంలో ఎడ్ల జతకు రోజుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది.(ఎడ్ల జాతి, ఎత్తు, బరువును బట్టి) నెలకైతే జత ఎడ్లకు రూ. 25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తారు. ఇలా అద్దెకు ఇచ్చే సమయంలోనే ‘అద్దె సమయంలోఎడ్లకు ఏ హాని జరిగినా, అవి అనారోగ్యం బారినపడినా మేమే బాధ్యులం’ అంటూ రైతుల నుంచి హామీపత్రం తీసుకుంటారు. అంతేకాదు, జత ఎడ్లకు 30 వేల నుంచి 50 వేలు అడ్వాన్సు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
***ఎడ్లను కొనే పనిలో..
నిజామాబాద్‌ జిల్లాలో వందలాది మంది ప్రధాన వ్యాపారం ఇదే. ముఖ్యంగా వేసవిలో మహారాష్ట్రలోని రాజూరా, చంద్రాపూర్‌లలో పెద్ద ఎత్తున నిర్వహించే సంతల్లో ఎడ్లను కొంటారు. వాటిని రెండు నెలలు పోషించి, ఖరీఫ్‌ ప్రారంభంలో అద్దెలకు సిద్ధం చేస్తారు. అద్దెకు తీసుకున్న రైతులు వాటికి అవసరమయ్యే పశుగ్రాసం సమకూర్చాలి. అవసరమైతే వైద్య ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ‘ఎడ్లను పోషించే స్థోమత లేదు నాకు. కొన్నేండ్లుగా అద్దెకే తీసుకుంటున్నా. మొదట్లో రూ.500కు జత ఎడ్లను ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.2 వేలకు పైగా చెల్లించాల్సి వస్తున్నది. డబ్బులు పోయినా, సాగు అవసరాలైతే తీరుతున్నయి’ అంటాడు మోర్తాడ్‌కు చెందిన పసుపు రైతు పుప్పాల రాజేందర్‌. రైతు కపటం ఎరుగని మనిషి. దీంతో ఆ మూగజీవాలతో ఇట్లే ప్రేమలో పడిపోతాడు. తిరిగి యజమానికి అప్పగించాల్సి వచ్చినప్పుడు అతని గుండె బరువెక్కుంది. కానీ తప్పదు. కొన్నిసార్లు ఆ మూగజీవాలు కూడా ‘అద్దె’ యజమానితో అనుబంధం పెంచుకుంటాయి. సేద్యం వ్యాపారంగా మారిన నేపథ్యంలో ఎద్దుల్ని యంత్రాల్లా భావించాల్సిన పరిస్థితి!
*ట్రాక్టర్ల ద్వారా దుక్కులు దున్నుతున్నా… అధిక దిగుబడి రావడం లేదన్న చింత. దీంతో మళ్లీ బసవన్నలనే మట్టిలోకి దించుతున్నారు.దుక్కి దున్నే సమయంలో ఎడ్ల జతకు రోజుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది.(ఎడ్ల జాతి, ఎత్తు, బరువును బట్టి) నెలకైతే జత ఎడ్లకు రూ. 25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తారు.