హైదరాబాద్‌లోని జవహర్‌ల్ నెహ్రూ జువాలజికల్ పార్కులో తెల్లరంగు రాయల్ బెంగాల్ టైగర్ కిరణ్ మృతిచెందింది.
ఎనిమిదేండ్ల కిరణ్ కుడి దవడ భాగంలో ఏర్పడిన నియోప్లాస్టిక్ కణితి కారణంగా అనారోగ్యం పాలైందని, గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ ఇప్పుడు మరణించిందని జూ అధికారులు తెలిపారు.
కిరణ్ నెహ్రూ జూలోనే పుట్టి పెరిగిందని వారు వెల్లడించారు.
గత నెల 29న పరీక్షలు చేయగా కిరణ్ కుడి దవడలో కణితి ఉన్న విషయం బయటపడిందని చెప్పారు.
అప్పటి నుంచి శాస్త్రవేత్తలు, వైద్యులు పులికి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
మృతి చెందిన పులికి వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
కిరణ్ తండ్రి బద్రి కూడా నియో ప్లాస్టిక్ కణితితోనే బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కిరణ్ తాత రుద్ర 12 ఏండ్ల వయసులో ఇదే వ్యాధితో మృతి చెందింది.
ఇప్పుడు కిరణ్ కూడా అదే వ్యాధితో మృతి చెందడంతో వైద్యులు శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కాగా, జూపార్కుకే వన్నెతెచ్చే రాయల్ బెంగాల్ టైగర్లు ఒకేరకమైన ట్యూమర్ వ్యాధితో మృతిచెందుతుండటం ఆందోళనకు గురి చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.