భార్యభర్తల మధ్య విరహ వేదన పెరగాలనే ఆషాఢ మాసంలో ఆ రూల్ పెట్టారా?
ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్త అల్లుళ్లు ఆ ఆశను చంపుకోవాల్సిందే. నవ దంపతులకు ఆషాఢ మాసం అగ్ని పరీక్ష వంటిదే. భార్యభర్తలు ఇద్దరూ విరహ వేదనను అనుభవించాలి. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆషాఢ మాసం సంప్రదాయాన్ని చాలా మంది జంటలు పాటించడం లేదు. అయితే దీనికి ప్రధాన కారణం వీరికి మన సంప్రదాయాల పట్ల అవగాహన లేకపోవడం ఒక కారణమైతే, ప్రస్తుతం చాలా మంది భార్యభర్తలు ఉద్యోగాలు చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. అందుకనే పాత కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచారాలను అంతగా పట్టించుకోవడం లేదు. అయితే మన దేశంలో ప్రతి ఒక్క సంప్రదాయానికీ, ఆచారానికీ, కట్టుబాట్ల వెనుక ఏదో ఒక లాజిక్ కచ్చితంగా దాగి ఉంటుంది. అది ఆషాడ మాసంలో కూడా కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. అందుకే అప్పట్లో పెద్దలు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలలో భార్య, భర్త, అత్తలను దూరంగా ఉంచేవారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఆషాడ మాసంలో అత్తా, కోడళ్ల పోరు పడకూడదనే విడిగా ఉంటారా? మరేదైనా కారణం ఉందా?
పూర్వ కాలంలో.. పురాణాల ప్రకారం పూర్వకాలంలో శుభకార్యాలు, యజ్ణాలు, ఇతర శుభకార్యాలు అన్నింటినీ విశాలమైన ప్రాంతాల్లో అంటే పెద్ద పెద్ద మైదానాల్లో చేసేవారు. అయితే గాలులు ఎక్కువగా వీస్తే వీటికి ఆటంకం ఏర్పడేది. వీటిని చేయడంలో ఇబ్బంది ఎదురయ్యేది. ‘ఉత్తర ఆషాఢ’ హిందూ క్యాలెండర్ ప్రకారం గ్రీష్మ రుతువు అయిన ఆషాఢ మాసంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. పౌర్ణమి రోజు ‘ఉత్తర ఆషాఢ’ నక్షత్రం రావడం వల్ల ఈ మాసానికి ఉత్తరాషాఢ అని కూడా పేరు వచ్చింది. అదే విధంగా ఈ నెలలో గాలి కూడా ఎక్కువగా వీస్తుంది.
15 రోజులకోసారి పండుగ..
అందుకే ఈ మాసంలో ఎక్కువగా శుభకార్యాలు ఎక్కువగా నిర్వహించకుండా ఉండేవారు. అయితే ఈ నెలలో పండుగలు, ప్రత్యేకమైన పర్వదినాలు మాత్రం చాలా ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి శ్రీ మహా విష్ణువు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి. దీన్నే తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఇక్కడి నుండి ప్రతి వారం లేదా రెండు వారాలకొకసారి కచ్చితంగా ఏదో ఒక పండుగ లేదా వ్రతం మరియు పూజలు కచ్చితంగా ఉంటాయి.
భార్యభర్తల మధ్య దూరం..
ఈ నేపథ్యంలోనే భార్యభర్తల మధ్య ఆషాఢ మాసంలో కచ్చితంగా ఎడబాటు ఉండేలా పూర్వం చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇలా చేయడం వల్ల వీరిద్దరి మధ్య విరహ వేదన పెరిగి, తరువాతి మాసంలో కలుసుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుందని వారి నమ్మకం. అయితే ఇందుకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
ఈ మాసంలో నెల తప్పితే..
ఆషాఢ మాసంలో కొత్త కోడలు నెల తప్పితే.. సరిగ్గా నవ మాసాల(9 నెలల) తర్వాత అంటే మార్చి నుండి మే మధ్య కాలంలో డెలివరీ జరుగుతుంది. ఈ సమయంలో వేడి గాలులు విపరీతంగా ఉంటాయి.
పుట్టిన శిశువుకు..
ఈ వేడి వాతావరణంలో పుట్టిన శిశువుతో పాటు తల్లికి కూడా వేడి వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది వీరిద్దరి ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా ముందుచూపుతో ఆలోచించిన పెద్దలు భార్యాభర్తలు ఈ సమయంలో కలవకుండా వేర్వేరుగా ఉంచేవారు. కొత్త కోడలిని కచ్చితంగా పుట్టింటికి పంపేవారు. అలాగే కొత్త అల్లుడిని కూడా అత్తారింటి గడప తొక్కకుండా చూసేవారు.
ఆ మోజులో పడకుండా..
ఆషాఢ మాసంలో అత్తా కోడలు ఎదురుపడకూడదని చాలా మందికి తెలుసు. అయితే అత్తా, అల్లుడు కూడా ఎదురుపడకూడదంట. దీని వెనుక కూడా పెద్ద రీజనే ఉంది. అప్పట్లో అందరికీ వ్యవసాయమే జీవనాధారం. వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి, ప్రతి ఒక్కరూ వ్యవసాయ పనుల్లో మునిగిపోవాలని, కొత్త భార్య మోజులో పడకుండా ఉండేందుకు ఈ నిబంధన పెట్టారు. ఎందుకంటే ఆ మోజులో పడి వ్యవసాయంపై ఎక్కడ శ్రద్ధ తగ్గిస్తారో ఇలా సెట్ చేశారంట.
సంసార బంధాలు మరింత బలంగా..
అందుకే ఆషాఢ మాసాన్ని నవ దంపతులను దూరం చేసే మాసంగా చెబుతారు. సంసార బంధాలను మరింత బలపరచాలన్నా.. సంసార సాగరంలో విడిపోయి కలిసుండే మనసులను మరింత దగ్గర చేయాలన్నా ఈ మాసంతోనే సాధ్యపడుతుందని పూర్వీకుల నమ్మకం. ఆషాఢ సూత్రం.. ఇలా పూర్వీకుల నమ్మకాలను పాటిస్తూ.. ప్రతి ఒక్క కొత్త జంట ఆయురారోగ్యాలతో, పిల్లలతో రేపటి తరానికి సందేశాన్ని ఇస్తూ వెళ్లాలనేది ఆషాఢం యొక్క ముఖ్య సూత్రం. మీరు కొత్త జంట అయితే ఈ నియమాలను పాటించాలా వద్దా అనేది మీ సౌకర్యాలను బట్టి మీరే నిర్ణయించుకోండి.