1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యూసుఫ్ మెమన్ మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాసిక్ జైలులో ఈ రోజు ఉదయం మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ రోజు ఉదయం అతడు గుండెపోటుతో మరణించినట్టు సమాచారం. అయితే, యూసుఫ్ ఎలా మరణించాడనే విషయాన్ని మాత్రం అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ముంబయిలో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అయిన టైగర్ మెమన్‌కు యూసుఫ్ సోదరుడు.
ముంబయి పేలుళ్ల కేసులో 2007లో దోషిగా తేలడంతో యూసుఫ్‌కు జీవిత ఖైదు పడింది. దీంతో అతడిని తొలుత ముంబయిలోని ఆర్ధర్ రోడ్డులో ఉన్న జైలులో ఉంచగా.. అనంతరం 2018లో అక్కడి నుంచి నాసిక్ జైలుకు మార్చారు. అక్కడే శిక్ష అనుభవిస్తున్న యూసుఫ్‌కు ఈ రోజు ఉదయం 10.30 గంటల సమయంలో గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధూలేకు తరలించారు.
యూసుఫ్ సోదరుడు ఇసాక్ మెమన్ కూడా ప్రస్తుతం నాసిక్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. ముంబయి వరుస బాంబు పేలుళ్ల ఘటన తర్వాత గ్యాంగ్‌స్టర్ టైగర్ మెమన్ భారత్ నుంచి పరారయ్యాడు. 1993 మార్చి 12న ముంబయిలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 257 మంది మృతిచెందగా.. 1400 మంది తీవ్రంగా గాయపడిన ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది.