DailyDose

ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వైకాపా ఎమ్మెల్యే నిరసన-తాజావార్తలు

ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వైకాపా ఎమ్మెల్యే నిరసన-తాజావార్తలు

* కలెక్టరేట్ ఎదుట సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆందోళన.తన అనుచరులతో కలిసి నిరసన చేపట్టిన ఎమ్మెల్యే.సంతనూతలపాడు నియోజకవర్గంలో అర్హులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయడం లేదంటూ నిరసన.ఇళ్ళ స్థలాలు పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ భాస్కర్‌కి ఫిర్యాదు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్.

* కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు భేటీ అయ్యారు. వైకాపా తనకిచ్చిన షోకాజ్‌ నోటీసు చెల్లుబాటు అంశంపై ఆయన ఎన్నికల సంఘం అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ అసలు పేరు, షోకాజ్‌ నోటీసుపై ఉన్న పేరు మధ్య వ్యత్యాసం గురించి ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీగా నమోదైన వైకాపాకు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని ఎంపీ అధికారుల ఎదుట ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ అని నమోదు చేసి.. ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అని ఎందుకు పిలుస్తున్నారు అని ఎంపీ ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు భోగట్టా.

* వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులను నిమ్మాడలో నారా లోకేశ్‌ పరామర్శించారు. అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ ‘‘ఈఎస్‌ఐ విషయంలో అచ్చెన్నాయుడుకు సంబంధం లేదు. ఆయన్ని కుంభకోణంలో ఇరికించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తెదేపా నేతలను జైలుకు పంపుతున్నారు. ఫైబర్‌ గ్రిడ్‌కి.. ఐటీ మంత్రికి సంబంధం లేదు’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 22,305 మంది నమూనాలు పరీక్షించగా 605 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన నాలుగు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 35 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 570 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 11,489 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో నలుగురు, కర్నూలులో నలుగురు, గుంటూరు, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 146కి చేరింది.

* గల్వాన్‌ లోయలోని భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడి హింసాత్మక ఘటనలకు పాల్పడిన చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని చికాగోలో ఉన్న చైనా రాయబార కార్యాలయం ఎదుట పలువురు భారతీయ అమెరికన్లు డ్రాగన్‌ దేశానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘‘ భారత భూభాగంలోని లద్దాఖ్, లేహ్‌ ప్రాంతాల్లో చైనా చొరబాటుకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నాం. ఆ దేశం చర్యలపట్ల భారతీయ అమెరికన్లు మౌనంగా ఉండరని ఈ సందర్భంగా చైనాకు స్పష్టం చేయదల్చుకున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం భారత్‌కు మద్దతుగా ఉంది’’ అని చికాగోకు చెందిన భారతీయ అమెరికన్ డాక్టర్‌ భరత్ బరాయ్‌ తెలిపారు.

* భారత ఆర్థిక వ్యవస్థ 2020, 2021లో ఒక శాతం వృద్ధిరేటుతో ముందుకు వెళ్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సంస్థ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ అన్నారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి ఆమె కొన్ని సూచనలు ఇచ్చారు. భారత ఆర్థిక వ్యసవ్థ 2020లో 4.5శాతం తగ్గుతుందని ఐఎంఎఫ్‌ ఇంతకు ముందే అంచనా వేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వస్తూత్పత్తి సైతం 4.9శాతం కుంచించుకుపోతుందని పేర్కొంది. అయితే 2021లో భారత వృద్ధిరేటు 6 శాతంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది. తాజాగా మీడియాతో మాట్లాడిన గీతా గోపీనాథ్‌ కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు.

* కరోనా వైరస్‌కు సూదిమందు వచ్చేంత వరకు రెండు గజాల దూరం, మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడమే శరణ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి నొక్కిచెప్పారు. ‘ఆత్మనిర్భర్‌ ఉత్తర్‌ప్రదేశ్ రోజ్‌గార్‌ అభియాన్‌’ను ప్రారంభించిన ఆయన ఆ రాష్ట్ర ప్రజలతో మాట్లాడారు. ‘సూది మందు వచ్చేంత వరకు రోగనిరోధక శక్తి పెంచుకోవడం, సబ్బునీటితో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్తే మాస్క్‌లు ధరించడం, రెండు గజాల ఎడం పాటిస్తూనే ఉండాలి’ అంటూ నోటికి తువ్వాలను ఎలా అడ్డుపెట్టుకోవాలో మోదీ ప్రదర్శించారు.

* దేశీయ మార్కెట్లు వారాంతాన్ని లాభాలతో ముగించాయి. వరుసగా రెండు రోజుల పాటు నష్టాలను చవిచూసిన సూచీలు శుక్రవారం లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 329 పాయింట్లు లాభపడి 35,171 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 10,383 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.66 వద్ద కొనసాగుతోంది. జులై ఎఫ్అండ్వో సిరీస్‌ ప్రారంభమైన నేపథ్యంలో సెన్సెక్స్‌ 266 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను కొనసాగించింది. ఒకానొక దశలో 35,254 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీలు ఆ తర్వాత పడుతూ లేస్తూ సాగాయి. చివరకు సెన్సెక్స్‌ 329 పాయింట్ల లాభంతో 35,171 వద్ద స్థిరపడింది.

* కాంగ్రెస్‌ పార్టీపై భారతీయ జనతా పార్టీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు ప్రధానమంత్రి సహాయ నిధులను మళ్లించారని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. మన్మోహన్‌ హయాంలో పీఎం నిధి నుంచి ఇచ్చిన విరాళాలకు సంబంధించిన వివరాలను ఆయన ట్వీట్‌ చేశారు. ఇదే ఫౌండేషన్‌కు చైనా మూడు లక్షల డాలర్ల విరాళం ఇచ్చిందని గురువారం ఆయన విమర్శించిన సంగతి తెలిసిందే. ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) కష్టాల్లో ఉన్న ప్రజలను ఉద్దేశించింది. కానీ యూపీఏ పాలనలో ఈ నిధులు రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు.

* రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ నానాటికీ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య విషయంలో మంగళవారం నాటికి తమిళనాడును దాటిన దిల్లీ, తాజాగా ముంబయిని కూడా అధిగమించటం గమనార్హం. రెండు కోట్లకు పైగా జనాభా ఉన్న ముంబయిలో కేసుల సంఖ్య 70,878 కాగా మరణాలు 4062. ఇక సుమారు కోటి 80లక్షల జనాభా గల రాజధానిలో 73,780 కేసులు 2429 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ గణాంకాలు దిల్లీలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితిని సూచిస్తున్నాయి.

* ఇంటెలిజెన్స్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయని సమాచారం. పాకిస్థాన్‌ వీసాలు పొందిన 200మందికి పైగా జమ్ము కశ్మీర్‌కు చెందిన యువత జాడ తెలియకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వారిని ఉగ్రవాద శిబిరాల్లోకి రిక్రూట్‌ చేసుకొని కశ్మీర్లో సమస్యలు సృష్టించేలా పాకిస్థాన్ శిక్షణ ఇచ్చే అవకాశం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

* అభివృద్ధి పనుల వల్లే రెండోసారి మరింత మెజారిటీతో అధికారంలోకి వచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. భాజపా మూడో వర్చువల్‌ ర్యాలీలో ఆమె మాట్లాడారు. అంత్యోదయ అనే మాటకు మోదీ ప్రభుత్వం అసలైన అర్థం చెబుతోందన్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతుకు ఏడాదికి రూ. ఆరు వేలు ఇస్తున్నామని చెప్పారు. పది కోట్ల మంది రైతులకు రూ.72 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి పనులు వేగవంతమైనట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఏం కావాలో, ఏం చేయాలో భాజపాకు తెలుసనని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు.

* విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ప్రధాన ఆదేశాలను సవాలు చేస్తూ ఎల్జీ పాలిమర్స్ తాజాగా పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌కు సంబంధించిన అదనపు పత్రాలు సమర్పించేందుకు ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. మరోవైపు ఎల్జీ పాలిమర్స్ డిపాజిట్ చేసిన రూ.50 కోట్లపై మధ్యంతర స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ జరిగే వరకు రూ.50 కోట్లు పంపిణీ చేయవద్దని తెలిపింది. గతంలో దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.