DailyDose

స్విస్‌బ్యాంకులో పడిపోయిన భారత నిల్వలు-వాణిజ్యం

స్విస్‌బ్యాంకులో పడిపోయిన భారత నిల్వలు-వాణిజ్యం

* స్విస్​బ్యాంక్​లో భారత్​ నిల్వలు గణనీయంగా పడిపోయాయి. 2018లో 74వ స్థానంలో ఉన్న భారత్​ 2019 నాటికి మూడు స్థానాలు కోల్పోయింది. స్విస్​ నేషనల్​ బ్యాంక్​ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. బ్రిటన్​ తొలిస్థానంలో కొనసాగుతుండగా, అమెరికా ఆ తర్వాతి స్థానంలో ఉంది.

* వ్యాపార దిగ్గజ సంస్థ అమెజాన్‌కు చెందిన ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ అమెజాన్‌ పే భారత్‌లో ‘స్మార్ట్‌ స్టోర్స్‌’ సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఆఫ్‌లైన్‌ దుకాణాల్లో కూడా కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులు చేయవచ్చని సంస్థ వివరించింది. ‘‘దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది స్థానిక దుకాణాలు ఇప్పటికే అమెజాన్‌ పే పరిధిలోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ దుకాణాల్లో వినియోగదారులకు మరింత ఉత్తమమైన అనుభూతినిచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. మా ‘స్మార్ట్‌ స్టోర్స్‌’ ద్వారా ఈ దుకాణాలు మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుతాయి.’’ అని అమెజాన్‌ పే సీఈఓ మహేంద్ర నెరూర్కర్‌ తెలిపారు.

* కొత్తగా పొదుపు, వేతన ఖాతాలను ప్రారంభించడంతో పాటు, వ్యక్తిగత రుణాలు తీసుకోవాలనుకునే ఖాతాదారులకోసం వీడియో ఆధారిత కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) సేవలను ప్రారంభించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో నేరుగా ఖాతాదారులను కలిసి కేవైసీ పత్రాలను తీసుకోవడంలాంటివి నిరోధించేందుకు ఇది తోడ్పడుతుందని బ్యాంకు పేర్కొంది. పొదుపు, వేతన ఖాతా, వ్యక్తిగత రుణ దరఖాస్తుదారులతో సహా, అమెజాన్‌ పే ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారూ వీడియో ద్వారా కేవైసీని పూర్తి చేసేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. త్వరలోనే ఇతర క్రెడిట్‌ కార్డులు, గృహరుణాలు తదితరాలకూ దీన్ని విస్తరించనున్నట్లు తెలిపింది. వీడియో కేవైసీ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఆయా ఖాతాలు అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త వెసులుబాటుతో బ్యాంకింగ్‌ సేవలను డిజిటల్‌గా మార్చడంలో మరో అడుగు వేశామని, మారుమూల ప్రాంతాల నుంచీ తమ సేవలను వినియోగించుకునే వీలు లభించిందని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనూప్‌ భాగ్చీ తెలిపారు. వేతన ఖాతాలతోపాటు, వ్యక్తిగత రుణ దరఖాస్తుదారులకు వీడియో కేవైసీని అందుబాటులోకి తెచ్చిన మొదటి బ్యాంకు తమదేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఖాతాదారులు కొత్త తరహా బ్యాంకింగ్‌ సేవలకు అలవాటుపడుతున్నారని, వీడియో కేవైసీ ద్వారా ప్రత్యేక గుర్తింపు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. సాధారణ కేవైసీ పత్రాలే వీడియో కేవైసీకి అవసరమౌతాయని పేర్కొన్నారు. కేవైసీ పత్రాల పరిశీలన, సంతకాలను వీడియో కాల్‌ ద్వారా నమోదు చేస్తామని వెల్లడించారు.

* దేశీయ మార్కెట్లు వారాంతాన్ని లాభాలతో ముగించాయి. వరుసగా రెండు రోజుల పాటు నష్టాలను చవిచూసిన సూచీలు శుక్రవారం లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 329 పాయింట్లు లాభపడి 35,171 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 10,383 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.66 వద్ద కొనసాగుతోంది.

* అమెరికా, ఐరోపా మార్కెట్ల కోసం అరబిందో ఫార్మా పలు రకాలైన కొత్త ఔషధాలు అభివృద్ధి చేస్తోంది. ఇందులో 14 బయోసిమిలర్‌ ఔషధాలు కూడా ఉన్నాయి. అరబిందో ఫార్మా ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ స్టాక్‌మార్కెట్‌ నిపుణులు, మదుపరులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరు రకాలైన నాసల్‌ స్ప్రేలు, ఎనిమిది ఇన్‌హేలర్లు అభివృద్ధి చేస్తున్నాం, ఇందులో రెండింటి అభివృద్ధి ప్రక్రియ పూర్తికావటంతో పాటు అనుమతి కోసం ఔషధ నియంత్రణ సంస్థల వద్ద దరఖాస్తులు దాఖలు చేస్తున్నాం- అని ఆయన వివరించారు. మొత్తం 37 ఔషధాలపై పనిచేస్తున్నట్లు, అవి వేరువేరు దశల్లో ఉన్నట్లు వెల్లడించారు. యూఎస్‌ మార్కెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50- 60 కొత్త ఔషధాలు విడుదల చేయాలనే ఆలోచన ఉన్నట్లు, ఇందులో 25 ఔషధాలకు ఇప్పటికే అనుమతులు వచ్చాయిని చెప్పారు.