మనలో చాలా మందికి తెలుసు శకుని ఎవరో..! దుర్యోధనుని దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు. కురుక్షేత్ర యుద్ధానికి పరోక్షంగా కారకుడయ్యాడు. అయితే, ఇదంతా చేయడానికి అతని అసలు వ్యూహం వేరే ఉంది. అసలు అతను ఎప్పుడూ కౌరవుల మేలు కోరుకోలేదు. కౌరవుల మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. అందుకే కురు వంశానికి చెందిన పాండవులు, కౌరవుల మధ్య యుద్ధాన్ని కోరుకున్నాడు…అసలు శకుని కురువంశం యొక్క నాశానాన్ని ఎందుకు కోరుకున్నాడు..? ఆ శకుని కథేంటో చూద్దాం..చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన ఇలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకునేలా చేసింది. శకుని అసలు పేరు “సుబలోత్తముడు” అంటే రాజు సుబలుడుకు చెందిన కొడుకులలో ఉత్తముడని అర్ధం. శకుని చిన్నప్పటినుండే చాలా తెలివిగల వాడు. వాస్తవానికి అతనికి అంగ వైకల్యం లేదు. చిన్నప్పుడు అతని తండ్రే అతడి తొడ ఎముక విరిచేశాడు. శకుని గాంధారికి తమ్ముడు. గాంధారి జ్యోతిష్యం ప్రకారం ఆమెని ఎవరైతే మొదట వివాహం చేసుకుంటారో అతను వెంటనే మరణిస్తాడు. దీన్ని నివారించేందుకు గాంధారిని మేకపోతుకిచ్చి పెళ్లి చేసారు. తరువాత ఆ మేక పోతుని చంపేశారు. ఈ రహస్యం గాంధారి కుటుంబానికి మాత్రమే తెలుసు. గాంధారి తండ్రయిన సుబలుడు గాంధార రాజ్యానికి రాజు. అతనికి వంద మంది కొడుకులుండేవారు. గాంధారి ఒక్కటే కూతురు. అతను గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశాడు. ధృతరాష్ట్రుడికి చిన్నప్పటి నుంచే చూపు లేదు. తన భర్త చూడలేని ప్రపంచాన్ని తనూ చూడకూడదని గాంధారి నిర్ణయించుకుంది.
చివరకు ఒకరోజు గాంధారి మొదట వివాహ రహస్యం గురించి ధృతరాష్ట్రుడికి తెలిసింది. దీంతో చాలా ఆగ్రహానికి గురయిన ద్రితరాష్ట్రుడు మొత్తం సుబలుడి కుటుంబాన్ని చెరసాలలో బంధిస్తాడు. వాళ్లకి రోజూ గుప్పెడు అన్నం మాత్రమే పెట్టేవాడు. ఇదంతా తన కుటుంబాన్ని పస్తులుంచి చంపే ప్రణాళిక అని తెలుసుకున్న సుబలుడు, ఆ గుప్పెడు అన్నం అందరిలో చిన్న కొడుకైన శకునికి పెట్టేవాడు. అలా చేస్తే కనీసం అతనన్నా తన కుటుంబం యొక్క ప్రతీకారం తీర్చుకుంటాడని తన చిన్న కొడుకుకే అన్నం పెట్టేవాడు. తన వంశం కొనసాగడానికి తన చిన్న కొడుకైన శకునిని విడిచిపెట్టాల్సిందిగా సుబలుడు ధృతరాష్ట్రుడిని వేడుకున్నాడు. గాంధారి కూడా తన తమ్ముడ్ని విడ్చిపెట్టాల్సిందిగా తన భర్తని వేడుకుంది. ధృతరాష్ట్రుడు వారిద్దరి విన్నపాన్ని అంగీకరించాడు. చివరికి శకునిని చెరసాల నుండి విదిచిపెట్టాడు. అయితే అతను విడుదలయ్యే సమయానికి తన తోబుట్టువులందరూ చనిపోయారు. తన తండ్రి సుబలుడు కొన ఊపిరితో ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గమైన చర్యకు పూనుకున్న ధృతరాష్ట్రుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని, అతని వంశాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలని తన చిన్న కొడుకు చేత ప్రమాణం చేయించుకున్నాడు. అలాగే తన శరీరంలోని ఏదైనా ఎముకను తీసుకుని పాచికలు తయారు చెయ్యాలని సూచించాడు. ఆ పాచికలు తను ఎలా కోరుకుంటే అలానే చూపిస్తాయాని శకునితో సబలుడు చెప్తాడు. తండ్రి తనకు చెప్పిన మాటలే శకుని తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. చివరికి అతని తండ్రికిచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. తన పాచికల మహిమతో పాండవులు కౌరవుల మధ్య గొడవలకు కారణమయ్యాడు. కురుక్షేత్ర యుద్ధానికి పరోక్ష కారకుడయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత అతను కోరుకున్న విధంగానే కురు వంశం దాదాపుగా నాశనం అయిపొయింది. శ్రీకృష్ణుడు,పాండవులతో కలిపి మొత్తం 12 మంది మాత్రమే బ్రతికారు.