DailyDose

దుకాణాలపై బోర్డులు మారుస్తున్న షియోమీ-తాజావార్తలు

Xiaomi Changing Name Boards On Shops In Telangana

* చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియామీ తన ప్రత్యేక విక్రయశాలల బోర్డులను మారుస్తోంది. గతంలో నారింజరంగు బోర్డుపై ఎంఐ అనే ఆంగ్ల అక్షరాలు ప్రముఖంగా ఉండేవి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత సైనికులు 20 మంది మరణించాక, చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ఉద్యమాలు జరుగుతున్నాయి. చైనా బ్రాండ్‌ షాప్‌లపై దాడులు, సూచికబోర్డుల ధ్వంసం జరుగుతున్నాయి. ఈ కోపాగ్ని నుంచి తప్పించుకునేందుకే షియామీ, తన ప్రత్యేక విక్రయశాలల సూచికబోర్డును తెల్లరంగులోకి మార్చడంతో పాటు ‘ఎంఐ’ స్థానంలో ‘భారత్‌లో తయారీ (మేడ్‌ ఇన్‌ ఇండియా)’ అని ప్రధానంగా ఉంచుతోంది. ఎంఐ అనే అక్షరాలను కిందకు చిన్న అక్షరాల్లో మార్చింది. ప్రత్యేక విక్రయశాలల బోర్డులు మార్చేందుకు రిటైలర్లను అనుమతించాలని, ఆయా బ్రాండ్లకు సూచించినట్లు ఆలిండియా రిటైలర్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. షియామీ ఇప్పటికే ముందుకు రాగా, మిగిలిన బ్రాండ్ల సంగతి ఇంకా తెలియలేదు.

* ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రక్షణ చర్యలపై మంత్రులు, ఉన్నతాధికారులతో కేటీఆర్‌ చర్చించారు. ప్రభుత్వ స్థలాలకు జియో ఫెన్సింగ్, జీఐఎస్‌ మ్యాపింగ్‌ చేయాలని ఆదేశించారు. అర్హులైన పేదలకు భూములు క్రమబద్ధీకరించి హక్కులు కల్పించాలని చెప్పారు. దశాబ్దాల క్రితం లీజులను సమీక్షించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ కలసి పని చేయాలని సూచించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 24,458 మంది నమూనాలు పరీక్షించగా 796 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. వీటిలో విదేశాలకు చెందిన అయిదు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 51 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 740 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 12,285 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 157 చేరింది.

* దేశ రాజధాని నగరంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దిల్లీలో రోజురోజుకీ విజృంభిస్తున్న ఈ మహమ్మారి కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. ఐదు అంశాలను ఆయుధాలుగా చేసుకొని కరోనాపై పోరాటం సాగిస్తున్నట్టు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాపై యుద్ధానికి ఆస్పత్రుల్లో రోగులకు పడకలు పెంచడం, టెస్టింగ్ – ఐసోలేషన్‌, ఆక్సీమీటర్ల పంపిణీ, ప్లాస్మా థెరఫీ, ఇంటింటి సర్వే- స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహణ.. ఈ ఐదు అంశాలను ఆయుధాలుగా చేసుకొని ‘కరోనా హారేగా ఔర్ ఢిల్లీ జీతేగా’ అనే నినాదంతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు.

* కొవిడ్‌-19 బాధితుల చికిత్స, నిర్వహణ నిబంధనావళిని కేంద్ర వైద్యారోగ్య శాఖ సవరించింది. వ్యాధి, తీవ్ర లక్షణాలతో బాధపడేవారికి ప్రాణవాయువు అవసరం, అధిక ఇన్‌ఫ్లమేటరీ (మంట) స్పందన ఉన్నవారికి డెక్సామెథసోన్‌ (డెక్షమెథసొనె) స్టెరాయిడ్‌ను ఉపయోగించొచ్చని తెలిపింది. మిథైల్‌ప్రెడ్నినిసోలొన్‌ (ంఎథ్య్ల్ప్రెద్నిసొలొనె)కు ప్రత్యామ్నాయంగా వాడొచ్చని వివరించింది. ‘కొవిడ్‌-19 బాధితుల సవరించిన చికిత్స, నిర్వహణ నిబంధనావళిని జారీచేశాం. మిథైల్‌ప్రెడ్నిసోలొన్‌కు ప్రత్యామ్నాయంగా డెక్సామెథసోన్‌కూ అనుమతి ఇస్తున్నాం’ అని ఆరోగ్య శాఖ ట్వీట్‌ చేసింది.

* పంటలను నాశనం చేసే మిడతల దండు దిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌కు చేరుకుంది. శనివారం ఉదయం గురుగ్రామ్ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సంచరిస్తున్న మిడుతలను పలువురు చిత్రీకరించారు. దిల్లీ-గురుగ్రామ్‌ సరిహద్దు ప్రాంతంలో రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మిడతలు ఇంకా దిల్లీలోకి ప్రవేశించలేదు. మిడతలు ప్రస్తుతం రాజధాని వైపు వెళ్లే అవకాశం లేదని అధికారులు తెలిపారు. గురుగ్రామ్‌లో మిడతల దాడి పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు.

* కరోనాపై పోరాడుతున్న దేశాల్లో భారత్‌ అత్యంత మెరుగ్గా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రికవరీ రేటు సైతం పెరిగిందని పేర్కొన్నారు. రెవరెండ్‌ డాక్టర్‌ జోసెఫ్‌ మార్‌ థోమా మెట్రోపాలిటన్‌ 90వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ‘భారతదేశంపై కరోనా వైరస్‌ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని ఈ ఏడాది మొదట్లో కొందరు అంచనావేశారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేయడం, కట్టడికి చర్యలు తీసుకోవడం, ప్రజలు సహకరించడంతో వైరస్‌పై పోరాడుతున్న దేశాల్లో భారత్‌ అత్యంత మెరుగైన స్థానంలో ఉంది. మన రికవరీ రేటు పెరుగుతోంది’ అని చెప్పారు.

* భారత బ్యాట్స్‌మెన్‌లో ఒకప్పుడు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తన ఫేవరెట్‌గా ఉండేవాడని, ఇప్పుడు ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీ అని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ ఉమర్‌గుల్‌ అన్నాడు. ‘ఒకప్పుడు భారత జట్టులో నాకు సచిన్‌ అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడైతే విరాట్‌ కోహ్లీ. నాలుగైదేళ్లుగా అతను ఆడుతున్న విధానమే నన్ను ఆకట్టుకుంది. తనని తను మార్చుకున్న విధానం, అలాగే ఒకప్పుడు మాతో ఆడినప్పటికీ, ఇప్పటికీ మైదానంలో అతడు ప్రవర్తించే తీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడతని పూర్తి ధ్యాస క్రికెట్‌పైనే నెలకొంది. అతను బ్యాటింగ్‌ చేస్తుంటే చూడటం ఆనందం కలిగిస్తుంది. అది నేనెంతో ఆస్వాదిస్తాను’ అని గుల్‌ వివరించాడు.

* ప్రముఖ ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ ‘గూగుల్‌ పే’ను భారతీయ రిజర్వు బ్యాంకు నిషేధించలేదని… రిటైల్‌ చెల్లింపుల సాధికార సంస్థ- ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది. దీనితో గూగుల్‌ పే నిషేధానికి గురైందంటూ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల జరుగుతున్న ప్రచారానికి ఇంతటితో తెరపడింది. వివరాల్లోకి వెళితే…ఆర్థికవేత్త అభిజీత్‌ మిశ్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి జవాబుగా.. గూగుల్‌ పే ఏ విధమైన చెల్లింపుల వ్యవస్థ (పేమెంట్ సిస్టమ్‌)ను నిర్వహించడం లేదని.. అందుకే సంస్థ పేరు అధీకృత ఆపరేటర్ల జాబితాలో లేదని ఆర్‌బీఐ తెలిపింది.

* యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య ఘటన యావత్‌ సినీ పరిశ్రమను కలచివేసిన సంగతి తెలిసిందే. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు బాలీవుడ్‌లో ఉన్న బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఫౌండేషన్‌(ఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌)ను స్థాపిస్తున్నట్లు ఆయన తండ్రి తెలిపారు. ఈ సంస్థ ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహిస్తామని అన్నారు. పట్నాలోని సుశాంత్‌ ఇంటిని మెమోరియల్‌గా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

* దేశంలో కరోనా కేసులు 5లక్షలు దాటేసిన వేళ కేంద్ర ప్రభుత్వం పని తీరుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదన్నారు. ఈ వైరస్‌పై పోరాటానికి నిరాకరించడం ద్వారా ప్రధాని మోదీ లొంగిపోయారంటూ ట్విటర్‌లో ఆరోపించారు. ప్రభుత్వం మార్చిలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి కరోనాపై కేంద్రం చేపడుతున్న చర్యలపై రాహుల్‌ విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా కేసుల తీవ్రత మరింత పెరగడంతో శనివారం ఆయన ట్విటర్‌లో విమర్శలు చేశారు.