DailyDose

రేపు తితిదే టికెట్ల విడుదల-తాజావార్తలు

TNILIVE Breaking News Roundup || TTD To Release New Tickets

* జులై నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. సోమవారం నుంచి ఈ టికెట్లు ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు. రోజుకు తొమ్మిది వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే జారీ చేయనుంది. ఇక జులై నెల సర్వ దర్శనం టికెట్లను ఈ నెల 30 నుంచి తిరుపతిలో ఇవ్వనున్నారు. భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్లు నివాసంలో సర్వదర్శనం టికెట్లను తితిదే జారీ చేస్తుంది. రోజుకు మూడు వేలు చొప్పున సర్వదర్శనం టికెట్లు ఇవ్వనున్నారు.

* చైనాకు చెందిన సోషల్‌మీడియా యాప్‌ టిక్‌టాక్‌ యూజర్ల సమాచారాన్ని కాపీ చేస్తున్న విషయాన్ని ఐఫోన్‌ ఐవోఎస్‌14 సాఫ్ట్‌వేర్‌ బయటపెట్టింది. ఐఫోన్‌లో మనం కీబోర్డుపై టైప్‌ చేసే ప్రతిదాన్ని టిక్‌టాక్‌ కాపీ చేస్తున్నట్లు తేలింది. వీటిల్లో పాస్‌వర్డ్‌లు, ఈమెయిల్స్‌ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు టిక్‌టాక్‌ ఒక్కటే చాలా హైప్రొఫైల్‌ యాప్‌లు వినియోగదారుల డేటాను కాపీచేస్తూ దొరికిపోయాయి. ఇటువంటి వాటిని ఆపివేస్తామని టిక్‌టాక్‌ ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదని ఐఫోన్‌ 14 ఐవోఎస్‌ డెమో వెర్షన్‌లో తేలింది.

* అసలే ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా ఉంటే, మేలిమి బంగారం ధర రూ.50,000కు చేరువవుతోంది. మరి ఈ స్థాయిలో కొనుగోలు చేయొచ్చా.. ధర తగ్గే అవకాశాలున్నాయా.. ఈ సందేహం ఈ ఏడాది వివాహాది శుభకార్యాలు నిర్ణయించుకున్న కుటుంబాలన్నింటిలో ఉంది. కొనుగోళ్ల విషయానికి వస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారులు ఊహించినదాని కంటే మిన్నగానే అమ్మకాలు సాగుతున్నాయని బులియన్‌ గణాంకాలు చెబుతున్నాయి.

* జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి వ్యూహం ఖరారు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కరోనాపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి మూడు, నాలుగు రోజుల్లో వ్యూహం ఖరారు చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించాలని ప్రతిపాదనలు వస్తున్నాయని కేసీఆర్‌ చెప్పారు. కొద్ది రోజుల్లో లాక్‌డౌన్‌ విధింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఎక్కువ కరోనా కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళన అక్కర్లేదని సీఎం అన్నారు.

* సొంత వ్యాపార సంస్థ కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జల చౌర్యానికి పాల్పడ్డారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. నిబంధనల ప్రకారం అనుమతించిన దానికంటే రెట్టింపు నీటిని సరస్వతి ఇండస్ట్రీస్‌కు మళ్లిస్తూ జారీ చేసిన జీవో అక్రమం అని పట్టాభి అన్నారు. అక్రమ జలకేటాయింపుల జీవోను తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో సీఎం జగన్‌మోహన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. సరస్వతి ఇండస్ట్రీస్‌ కోసం సీఎం జగన్‌ అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.

* తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో కరోనా కలకలం రేగింది. సుమారు 180 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇందులో వంద మంది శిక్షణ ఎస్‌ఐలు, 80 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు అకాడమీ సంచాలకులు వీకే సింగ్‌ తెలిపారు. అయితే బాధితుల్లో ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదని తెలుస్తోంది. వారిని అకాడమీలోనే ఐసోలేషన్‌లో ఉంచారు. అకాడమీలో ప్రస్తుతం కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అకాడమీలో 1,100 మందికి పైగా ఎస్సైలు, 600 మందికిపైగా కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 25,778 మంది నమూనాలు పరీక్షించగా 813 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన 8, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 50 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 755 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 13,098 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 169కి చేరింది.

* కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విమర్శల వర్షం కురిపించారు. ఆ పార్టీ భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతోందని ఘాటుగా విమర్శించారు. సంక్షోభ సమయంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చిల్లర రాజకీయాలు చేయడం శోచనీయమని పేర్కొన్నారు. ‘కరోనా వైరస్‌ మహమ్మారి, లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా దుందుడుకుతనం వల్ల భారత్‌ సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం ఈ రెండు యుద్ధాలపై గెలిచి తీరుతుంది’ అని అమిత్‌ షా స్పష్టం చేశారు. జులై చివరికల్లా దిల్లీలో 5.5 లక్షల కరోనా కేసులు నమోదవుతాయన్న దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజధానిలో సామాజిక వ్యాప్తి లేదన్నారు.

* తమిళనాడులో పోలీసులు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారనే నెపంతో జయరాజ్‌, బెనిక్స్‌ అనే తండ్రి, కొడుకులను విచక్షణా రహితంగా కొట్టగా వారు దుర్మరణం పాలైన ఘటన తెలిసిందే. దీంతో తమిళనాడు అట్టుడుకుతోంది. తాజాగా మరో ఘటనలో పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం వల్ల కుమరేశన్‌ అనే ఆటోడ్రైవర్‌ మరణించాడు. వివరాల్లోకి వెళితే తిరునల్వేలి ప్రాంతానికి చెందిన కుమరేశన్‌ను ఒక భూ తగాదా కేసులో పోలీసులు రిమాండ్‌లో ఉంచి విచారించారు. ఈ క్రమంలోనే అతడిని విచక్షణరహితంగా కొట్టి విడిచిపెట్టారు. కుమరేశన్‌ ఇంటికి వెళ్లగా మాట్లాడలేని స్థితిలో ఉండటంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపు 15 రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మరణించాడు.

* బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య చేసుకుని రెండు వారాలు గడిచాయి. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. జూన్‌ 14 తర్వాత 27మందిని విచారించినట్లు తెలిపారు. డిప్యూటీ కమిషనర్‌ అభిషేక్‌ త్రిముఖి మాట్లాడుతూ.‘‘అన్ని కోణాల్లోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాం. బంద్రా పోలీసులు 27మంది వాంగ్మూలాన్ని తీసుకున్నారు. వైద్యుల నుంచి కూడా పోస్ట్‌మార్టం నివేదిక తీసుకున్నాం. ఉరివేసుకోవడం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు అందులో స్పష్టంగా ఉంది. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఇంకా ఏమైనా కారణాలున్నాయా? అన్న కోణంలోనూ విచారణ సాగిస్తున్నాం’’ అని అన్నారు.

* అమెరికాలోని ప్రతి ఐదు భారతీయ అమెరికన్లలో ఇద్దరు తమ దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వం గురించి ఆందోళన చెందుతున్నారు. అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ప్రభావమే ఇందుకు కారణం. ఈ వైరస్‌ దెబ్బకు దాదాపు ప్రతి ఎన్‌ఆర్‌ఐ జీవనశైలి మారిపోయిందని తెలిసింది. భారతీయ అమెరికన్‌ సమాజంపై కొవిడ్‌-19 ప్రభావాన్ని తెలుసుకొనేందకు ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా, ఇండియన్‌ డయాస్పొరా స్టడీస్‌ (ఎఫ్‌ఐఐడీఎస్‌) నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. దాదాపు 30% భారతీయ అమెరికన్ల ఉద్యోగం, ఇంటర్న్‌షిప్స్‌పై ఆర్థిక ప్రభావం పడిందని నివేదిక వెల్లడించింది.

* చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న పిలుపుకు భారత్‌లో తయారీ రంగాన్ని మరింత విస్తరించడమే సమాధానమని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ అన్నారు. అయితే పొరుగు దేశాల నుంచి ఉత్పత్తులను విస్మరిస్తే అదే వస్తువుల కోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుందనే విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని స్పష్టంచేశారు. ఎక్కువ కాలంపాటు అవసరమైన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం వ్యాపారులకు ప్రయోజకరం కాదని, స్వదేశంలో వాటి లభ్యత కొరత, నాణ్యత, ధరలు వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని తెలిపారు.