DailyDose

ఏపీలో రేషన్ ధరల పెంపు-వాణిజ్యం

ఏపీలో రేషన్ ధరల పెంపు-వాణిజ్యం

* పెర‌గ‌నున్న‌ రేషన్‌ సరకుల ధ‌ర‌లు.._ కందిపప్పుపై 67.5%, పంచదారపై 70% చొప్పున పెరుగుదల. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాయితీపై రేషన్‌ అందుకుంటున్న కార్డుదారులు చెల్లించాల్సిన మొత్తం జులై నుంచి పెర‌గ‌బోతోంద‌ని ఈనాడు ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. కందిపప్పుపై 67.5%, పంచదారపై 70% చొప్పున ధరలు పెరగనున్నాయి.ఇంతకుముందు మార్కెట్లో ధర ఎంత ఉన్నా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ కిలో కందిపప్పును రూ.40, పంచదారను రూ.20 చొప్పున ఇచ్చేది.ఇకపై మార్కెట్‌లో ధర ఎంతున్నా 25% రాయితీకే పరిమితం కావాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ధరలు పెరగనున్నాయి.జులై నుంచే పెంచిన ధరల్ని అమలుచేయాలని.. కిలో కందిపప్పు రూ.67, పంచదార రూ.34 చొప్పున అమ్మాలని పౌర సరఫరాల శాఖ సూచించింది.ఏడాదంతా ఇవే అమలైతే పేదలపై ఏడాదికి రూ.550.80 కోట్ల భారం పడనుంది.కందిపప్పు, పంచదార ధరల్ని ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలోనే సమీక్షించింది.మార్కెట్‌ ధరలకు అనుగుణంగా సవరించాలని, అప్పుడు ఉన్న ధరపై 25% రాయితీ ఇవ్వాలని ఫిబ్రవరిలోనే నిర్ణయించారు.

* ఈ-కామర్స్‌ దిగ్గజం ఆమెజాన్‌ భారత్‌లో సుమారు 20వేల తాత్కలిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్టు ఆదివారం పేర్కొంది. వీరి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అవసరమైన సేవలు అందించనుంది. ఈ తాత్కాలిక ఉద్యోగులతో రానున్న ఆరునెలలపాటు వినియోగదారుల అవసరాలు తీర్చడంలో ఇబ్బంది ఉండదని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌(వినియోగ దారుల సేవా విభాగం) అక్షయ్‌ప్రభు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు మరో పది నగరాల్లో ఉన్న తమ సంస్థ అనుబంధ కార్యాలయాల్లో ఈ ఉద్యోగాలను కల్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆంగ్లంతోపాటు ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 2025 కల్లా ఇండియాలో సుమారు పదిలక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఈ ఏడాది ఆరంభంలో అమెజాన్‌ ఇండియా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపధ్యంలో ఆన్‌లైన్‌ అమ్మకాల జోరు పెరిగింది.

* కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేయాల్సి వచ్చింది. అనివార్యంగా చాలా పరిశ్రమలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాల్సిందిగా ఆదేశించాయి. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో ఎప్పటినుంచో ఈ పోకడ ఉంది. ఆర్థిక, ప్రభుత్వ రంగ సంస్థలకు ఆ అవకాశమే లేదు. అయితే లాక్‌డౌన్‌ వల్ల తక్కువ మందితోనే బ్యాంకులు నడిచాయి. మిగతావాళ్లు ఇంటి నుంచే పనిచేశారు.

* చైనాకు చెందిన సోషల్‌మీడియా యాప్‌ టిక్‌టాక్‌ యూజర్ల సమాచారాన్ని కాపీ చేస్తున్న విషయాన్ని ఐఫోన్‌ ఐవోఎస్‌14 సాఫ్ట్‌వేర్‌ బయటపెట్టింది. ఐఫోన్‌లో మనం కీబోర్డుపై టైప్‌ చేసే ప్రతిదాన్ని టిక్‌టాక్‌ కాపీ చేస్తున్నట్లు తేలింది. వీటిల్లో పాస్‌వర్డ్‌లు, ఈమెయిల్స్‌ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు టిక్‌టాక్‌ ఒక్కటే చాలా హైప్రొఫైల్‌ యాప్‌లు వినియోగదారుల డేటాను కాపీచేస్తూ దొరికిపోయాయి. ఇటువంటి వాటిని ఆపివేస్తామని టిక్‌టాక్‌ ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదని ఐఫోన్‌ 14 ఐవోఎస్‌ డెమో వెర్షన్‌లో తేలింది.

* జీఎస్టీ రిటర్న్‌ల దాఖలును కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) మరింత సరళతరం చేసింది. పన్ను చెల్లింపుదారులకు ఎస్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని ప్రారంభించింది. వ్యాపార లావాదేవీలు లేకపోతే జులై 1 నుంచి ఎస్‌ఎంఎస్‌ పంపాలని సూచించింది. గతంలో వ్యాపారం చేసినా, చేయకున్నా రిటర్న్‌లు దాఖలు చేయాల్సి వచ్చేదని… ఇప్పుడు వ్యాపార లావాదేవీలు లేకపోతే కేవలం ఎస్‌ఎంఎస్‌ పంపితే చాలు అని స్పష్టం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 12 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు లబ్ధి చేకూరనుంది. వ్యాపారం లేకపోతే జీఎస్టీ పోర్టల్‌లోకి లాగిన్‌ అవ్వక్కర్లేదని సీబీఐసీ తెలిపింది. ఎస్‌ఎంసీ ద్వారా జీఎస్టీఆర్‌ రూపంలో నిల్‌ స్టేట్‌మెంట్‌ పెట్టాలని వెల్లడించింది.

* తాము అభివృద్ధి చేసిన కరోనావ్యాక్సిన్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చైనా నేషనల్‌ బయోటెక్‌ గ్రూప్‌ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తొలుత మనుషులపై ప్రయోగించిన వ్యాక్సిన్‌ ద్వారా అది సురక్షితమైందని నిర్ధారణ అయిందని.. బీజింగ్‌లో తయారు చేసిన రెండో వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ ప్రోత్సాహకర ఫలితాలను ఇచ్చిందని పేర్కొంది. ఈ టీకాను తొలిదశ 1/2 క్లినికల్‌ ట్రైల్స్‌లో 1,120 మందికి ఇచ్చారు. వీరందరిలో యాంటీబాడీస్‌ను ఆ టీకా తయారు చేసిందని పేర్కొంది.