వైకాపా నుంచి షోకాజ్ నోటీసు అందుకున్న ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. విజయసాయిరెడ్డి నుంచి ఇటీవల నోటీసు అందిందని.. దానిపై స్పందిస్తూ ఈ లేఖ రాశానని ఎంపీ పేర్కొన్నారు. రిజిస్టరైన పార్టీ కాకుండా మరో పార్టీ లెటర్ హెడ్‌తో నోటీసు వచ్చిందని తప్పుబట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో ఈసీ మనపార్టీకి రాసిన లేఖలు దీన్ని స్పష్టం చేస్తున్నాయని వివరించారు. ఏ సందర్భంలోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాడుకునేందుకు అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసిందని తెలిపారు. అయితే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి మాత్రం తాను ఎప్పుడూ విధేయుడినేనని చెప్పారు.
‘నేను వెంకటేశ్వరస్వామికి అపర భక్తుణ్ని. స్వామివారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలను వివరించా. ఈ వ్యవహారంలో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నట్లు చెప్పా. నేను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. మిమ్మల్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నా. పార్టీకి వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదు. ఇసుక విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించా. ఈ ప్రయత్నం నెరవేరకే మరో మార్గం లేక మీడియా ముందుకు వెళ్లా. రాజ్యాంగానికి లోబడే నేను మాట్లాడా. మీపైనా, పార్టీపైనా నేనెక్కడా మాట్లాడలేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదు. మీ చుట్టూ ఉన్న కొందరు నన్ను క్రైస్తవ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి మిమ్మల్ని కలవకుండా చేస్తున్నది వారే.’ అని రఘురామ కృష్ణ రాజు లేఖలో పేర్కొన్నారు.