DailyDose

పెట్రోల్ పసిడి ధరలు పెరిగాయి-వాణిజ్యం

TNILIVE Business News Roundup || Petrol Gold Prices Rise In India

* పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి.  వరుస ధరల పరుగుకు ఒక రోజు విరామం అనంతరం  నేడు (సోమవారం)  పెట్రో, డీజిల్‌ ధరలను పెంచుతూ  ప్రభుత్వరంగ చమురు సంస్థలు  నిర్ణయం తీసుకున్నాయి.  రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర .80.43 రూపాయలు, లీటర్‌ డీజిల్‌ ధర 80.53రూపాయలకు చేరింది. ఢిల్లీలో శనివారం, పెట్రోల్ లీటరుకు 80.38 రూపాయలు, డీజిలు ధర 80.40 రూపాయలుగా ఉంది. దీంతో ఇప్పటివరకు డీజిల్‌పై మొత్తం 10 రూపాయల 39 పైసలు,   పెట్రోల్‌పై 9 రూపాయల 23 పైసలు పెరిగాయి.  

* వందేభారత్ మిషన్’లో భాగంగా సింగపూర్ నుంచి కోల్‌కతా మీదుగా చెన్నై వచ్చిన విమానం నుంచి దిగిన ఒకే ఒక్క ప్రయాణికుడిని చూసి అధికారులు విస్తుపోయారు. సింగపూర్ నుంచి భారతీయులతో బయలుదేరిన ప్రత్యేక విమానం శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కోల్‌కతా మీదుగా చెన్నై చేరుకుంది. ప్రయాణికులకు స్వాగతం పలికేందుకు అప్పటికే అక్కడ విమానాశ్రయ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే, విమానం నుంచి ఒకే ఒక్క ప్రయాణికుడు దిగడంతో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

* భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.కేజీ వెండి ధర రూ.410 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,110కు ఎగసింది.పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.35 శాతం పెరిగింది.దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1786 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది.వెండి ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదలతో 18.07 డాలర్లకు ఎగసింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర ర్యాలీ చేసింది.

* అత్యాధునిక బైక్‌పై కూర్చున్న ఈ వ్యక్తిని గమనించారా.. ఎవరా..? అని ఆలోచిస్తున్నారా? ఆయన అత్యంత క్లిష్టమైన కేసుల్లో చారిత్రాత్మిక తీర్పులు వెలువరించిన భారత ప్రధాన న్యాయమూర్తి శరద్‌ అరవింద్‌ బోబ్డే. ఆయన హర్లే డేవిడ్సన్‌ సంస్థకు చెందిన సీవీఓ 2020 లిమిటెడ్‌ ఎడిషన్‌ వాహనంపై జస్టిస్‌ బోబ్డే కూర్చుని ఉన్న చిత్రాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కాగా, ఈ వాహనం విలువ రూ.51లక్షలకు పైమాటే. 2000సీసీ వీ ట్విన్‌ ఇంజన్‌తో కూడిన ఈ భారీ వాహనం బరువు 400 కిలోలకు పైగా ఉంటుంది. అయితే ఈ వాహనం న్యాయమూర్తిది కాదని తెలియవచ్చింది.

* సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వటాన్ని బహిష్కరిస్తున్న సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తమ లాభాల కోసం విద్వేష పూరిత సమాచారాన్ని ఉపేక్షిస్తున్న సామాజిక మాధ్యమాల వైఖరికి నిరసనగా.. #స్తొఫతెFఒర్ఫ్రొఫిత్ (స్టాప్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్‌)పేరుతో ఈ నెల మొదట్లో సోషల్‌ మీడియా ఉద్యమం ప్రారంభమైంది. దీనిలో భాగంగా అమెరికాకు చెందిన 160కి పైగా దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వటాన్ని బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో తమ ఉద్యమాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఉద్యమ నిర్వాహకులు తెలిపారు. దీనిలో భాగంగా తమతో చేతులు కలపాల్సిందిగా యూరోపులోని అన్ని భారీ సంస్థలకు వారు పిలుపునిచ్చారు. కాగా, దీని ప్రభావం ఫేస్‌బుక్‌పై తీవ్రంగా ఉండనుందనే భావనలు వినవస్తున్నాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 209 పాయింట్లు నష్టపోయి 34,961 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 10,312 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, లోహరంగ షేర్లు భారీగా పతనం కావడంతో సూచీలు నేల చూపులు చూశాయి. ఎస్‌ అండ్‌ పీ సంస్థ భారత్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో చిక్కుకుంటుందని పేర్కొనడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దాదాపు -5శాతం వృద్ధిరేటు ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది.

* తూర్పు తీరాన ఉన్న కేజీ-డీ6 బ్లాక్‌లో రెండో దఫాలో కనుగొన్న క్షేత్రాల నుంచి ఉత్పత్తి ప్రారంభాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మళ్లీ వాయిదా వేసింది. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ వల్ల తలెత్తిన ఇబ్బందులతో సెప్టెంబరు లేదా అక్టోబరుకు ఉత్పత్తిని వాయిదా వేసినట్లు కంపెనీ తెలిపింది. కృష్ణా గోదావరి బ్లాక్‌లో ఆర్‌-సిరీస్‌ క్షేత్రాల్లో ఉత్పత్తిని మేలో ప్రారంభించాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భాగస్వామి సంస్థ బీపీ పీఎల్‌సీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ వల్ల ప్రజల కదలికలు, వస్తు రవాణాపై ఆంక్షల నేపథ్యంలో దాన్ని జూన్‌ చివరకు వాయిదా వేయగా.. తాజాగా అది అక్టోబరుకు వెళ్లింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మధ్య నాటికి ఉత్పత్తిని వాయిదా వేసినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. కేజీ-డీ6లో కనుగొన్న క్షేత్రాల్లో దాదాపు 3 లక్షల క్యూబిక్‌ అడుగుల నిక్షేపాలను వెలికితీయడంపై 2019-20లో దృష్టిపెట్టామని కంపెనీ వెల్లడించింది. కేజీ-డీ6 బ్లాక్‌లో ఆర్‌-క్లస్టర్‌, శాటిలైట్స్‌, ఎంజే పేరుతో మూడు క్షేత్రాలను రిలయన్స్‌, బీపీ 2022 నాటికి అభివృద్ధి చేయనున్నాయి.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో 25 ఉత్పత్తులు విడుదల చేయనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సీఈఓ ఎరేజ్‌ ఇజ్రాయెలీ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రాజెక్టుల కోసం రూ.1000 కోట్ల మూలధనాన్ని వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ‘2019-20 మొత్తం మీద 27 ఉత్పత్తులు విడుదల చేశాం. ఇంతకుముందు నిలిపివేసిన నాలుగు ఉత్పత్తులను మళ్లీ తీసుకొచ్చాం. ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగిస్తాం. కొవిడ్‌-19 అనిశ్చితి ఉన్నప్పటికీ దాదాపు 25 ఉత్పత్తుల విడుదల కానున్నాయి’ అని అనలిస్ట్‌ కాల్‌లో వెల్లడించారు. ఈ ఏడాది మార్చికి మొత్తంగా 99 ఔషధ దరఖాస్తులు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద ఉన్నాయని, ఇందులో రెండు కొత్త ఔషధ అనుమతులు ఉన్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా 59 ఔషధాల మాస్టర్‌ ఫైల్స్‌కు దరఖాస్తు చేశామని, ఇందులో ఏడు అమెరికాలో చేసినట్లు వివరించారు. కొవిడ్‌-19కు సంబంధించి కొన్ని మాలిక్యూల్స్‌పై పనిచేస్తున్నట్లు ఇజ్రాయెలీ చెప్పుకొచ్చారు. వివిధ బయోసిమిలర్‌ ఉత్పత్తులపై కూడా కృషి చేస్తున్నట్లు, ఇందులో రితుక్సిమాబ్‌ ఫేజ్‌-3 ట్రయల్‌ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నట్లు తెలిపారు. పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు కంపెనీ సీఎఫ్‌ఓ సౌమెన్‌ చక్రవర్తీ అన్నారు. సూదిమందుల వ్యాపారం, బయోసిమిలర్‌ ఉత్పత్తులపై కూడా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు.