Fashion

ఆధునికత సంతరించుకుంటున్న గద్వాల చీరలు

Gadwal Sarees In Modern Designs || TNILIVE Telugu Fashion

ఘన చరిత్ర కలిగిన సంస్థానం. కళలకు కాణాచి. విద్వత్‌ గద్వాలగా వినుతి. అంతకుమించి.. చేనేతకు చిరునామా. అటు కాటన్‌.. ఇటు సిల్క్‌ మేళవింపుతో.. సరికొత్త చీరంచును సృష్టించారు అక్కడి నేతన్నలు. పంచభూతాలకు అధిపతి అయిన తిరుమల వేంకటేశ్వరుడు కూడా ప్రత్యేక సందర్భాల్లో గద్వాల పంచెతోనే ముస్తాబు అవుతాడు. వార్డ్‌రోబ్‌లో ఎన్ని బట్టలున్నా గద్వాల చీర లేకపోతే ఆడపడుచులకు అసంతృప్తే. అయినా, ఈ ఘనత ఒకనాటిది కాదు.
**పరుసవేది విద్యతో…
ఇనుమును బంగారం చేయవచ్చు! గద్వాల చీరతో..ఓ మామూలు అమ్మాయిని అప్సరసలా మార్చవచ్చు.పడుచుపిల్లకు పెండ్లికళ ఖాయం.పెండ్లికూతురు అయితే..బంగారు బొమ్మే!
**గద్వాల చీరలు అచ్చమైన తెలంగాణ ఫ్యాషన్‌ బ్రాండ్‌. ఆ జరీ అనితరసాధ్యం. బ్రొకేడ్‌, కాంట్రాస్ట్‌ పల్లూ, బార్డర్‌, ప్యాటర్న్స్‌కు.. ఈ చీరలు పెట్టింది పేరు. హంసల బార్డర్‌ మరో ప్రత్యేకత. చీర మొత్తం కాటన్‌లోనే ఉంటుంది. బార్డర్‌, పల్లూ మాత్రం జరీ. వీటిని సికో చీరలనీ పిలుస్తారు. అయిదున్నర మీటర్ల చీరను చిన్న అగ్గిపెట్టెలో పట్టించేంత నైపుణ్యం గద్వాల నేతకారుల సొంతం. 1930 నుంచీ ఈ చీరలు ప్రాధాన్యాన్ని సంతరించు కుంటున్నాయి. చేనేత వ్యాపార దిగ్గజం రతన్‌బాబురావు 1946లో హైదరాబాదులో ప్రత్యేక కేంద్రాన్ని తెరిచి గద్వాల ఇమేజ్‌ను దేశవ్యాప్తం చేశారు.
**ఎంతోకాలం నుంచీ..
బ్రిటిష్‌ కాలంలో చేనేత కళాకారులకు ఎలాంటి ప్రోత్సాహమూ ఉండేది కాదు. గద్వాల సంస్థానాధీశులు మాత్రం నేతన్నల వెన్నంటి నిలిచారు. మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ ఇద్దరు చేనేత నిపుణులను వారణాసికి పంపి బనారస్‌ జరీ చీరలను నేయడంలో శిక్షణ ఇప్పించారు. సంస్థానాధీశుల కాలం నుంచీ తిరుమల వేంకటేశ్వరస్వామికి పంచెలను సమర్పించే సంప్రదాయం ఉంది. సీతారాం భూపాల్‌ ఈ ఆచారాన్ని ఆరంభించారు. వారసులూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. భారత ప్రభుత్వం గద్వాల్‌ చీరలకు భౌగోళకమైన గుర్తింపును ఇచ్చింది.
**నేత ఇలా..
గద్వాల చీరలో ప్రతి దారపు పోగునూ చేతితో నేస్తారు. ప్రతి చీర తయారీ కోసం, ఇద్దరు నేతపనివాళ్లు నాలుగు నుంచి ఎనిమిది రోజులు కృషి చేస్తారు. పట్టు లేదా పత్తి నూలుతో అద్దకం ప్రక్రియతో చీర తయారీ మొదలవుతుంది. తరువాత నూలుకు డయింగ్‌ చేస్తారు. ఈ నూలుని అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించిన రంగు నీటిలో ముంచుతారు. దీనివల్ల రంగు దీర్ఘకాలం మన్నుతుంది. ఆ తర్వాత నూలును నీడలో ఆరబెడతారు. సూర్యకిరణాలు ప్రసరిస్తే నూలు పాడయిపోతుంది. కాబట్టే, ఆ నూలును జాగ్రత్తగా మగ్గంలోకి లోడ్‌ చేస్తారు. చీరలోని కాటన్‌ భాగాన్ని.. సిల్క్‌ బార్డర్‌.. పల్లూని విడివిడిగా నేసి ఆ తర్వాత పట్టు బార్డర్‌, పల్లూతో కలుపుతూ పోతారు. దీన్ని ఇంటర్‌లాక్‌ వెఫ్ట్‌ లేదా బ్యాక్‌ బ్రేకింగ్‌ టెక్నిక్‌గా చెబుతారు. గద్వాల్‌ చీరలను ఇంటర్‌ లాక్‌-వెఫ్ట్‌ టెక్నిక్‌ (కుప్పాదం లేదా టిప్పాడం) లేదా కోటకొమ్మ (దీనిని కుంభం అని కూడా పిలుస్తారు) పద్ధతి ప్రకారం సంప్రదాయంగా నేస్తారు.
**ప్రకృతి స్ఫూర్తితో..
గద్వాల చీరల డిజైన్లు ఆలయాలు, వాటి శిల్పకళల నుంచి స్ఫూర్తి పొందాయి. ప్రకృతి ప్రభావమూ ఎక్కువే. అప్పట్లో గద్వాల చీరలు మట్టిరంగుల్లోనే లభించేవి. మారుతున్న కాలాన్ని బట్టి రకరకాల ప్రకాశవంతమైన వర్ణాల్లోనూ తయారుచేస్తున్నారు. ఆధునిక డిజైన్లు కూడా కనిపిస్తున్నాయి. ధర రూ.6 వేల నుంచి రూ.16 వేల వరకు ఉంటుంది. కొన్ని చీరలు ఇరవైవేలు కూడా పలుకుతున్నాయి. గద్వాల్‌ చీరలను డ్రైవాష్‌ చేయించడం మంచిది. డిటర్జెంట్స్‌ వాడకూడదు. అలాగే, చీరలను మిగతా బట్టలతో కలపకుండా.. విడిగా బ్యాగులలో ఉంచడం సురక్షితం.
**స్పెషల్‌ స్టయిలింగ్
వివాహం, రిసెప్షన్‌, పుట్టినరోజు, పండుగలు… ఇలా గద్వాల చీరల్ని ఏ సందర్భంలో అయినా కట్టుకోవచ్చు. ఏ వయసువారికైనా ముచ్చటగానే కనిపిస్తాయి. వీటి మీదికి సంప్రదాయ నగలు సూటవుతాయి. మగ్గం వర్క్‌ చేసిన బ్లౌజ్‌లు మరీ బావుంటాయి. ఈ చీరలను లాంగ్‌ గౌన్స్‌గాను, షార్ట్‌ గౌన్స్‌గానూ డిజైన్‌ చేసుకోవచ్చు. లాంగ్‌ గౌన్స్‌ అయితే, కట్‌ వర్క్‌ దుపట్టా కానీ బనారస్‌ పట్టు దుపట్టా కానీ వేసుకుంటే.. సూపర్‌! ఈ మధ్య టీనేజర్స్‌ పట్టుకి ఫిదా అయిపోతున్నారు. కాబట్టి, లెహంగాలు కూడా డిజైన్‌ చేసుకోవచ్చు.