Food

పుట్టగొడుగుల్లో పౌష్ఠికత

TNILIVE Food And Diet News || Mushrooms And Nutrition

ప్రపంచ సౌందర్య ఉత్పాదనలో రెండేళ్లుగా అవకాడో వాడకం అగ్రగామిగా ఉంటే ఈ యేడాది వండర్‌ స్కిన్‌కేర్‌ పదార్థంగా పుట్టగొడుగులు చేరాయి. చైనీయుల ప్రాచీన సౌందర్య ఉత్పత్తుల వాడకంలో పుట్టగొడుగులను వాడినట్టు చరిత్ర చెబుతోంది. చర్మం ముడతల నివారణిగానూ, కణాలను పునరుజ్జీవింప చేయడంలోనూ పుట్టగొడుగులు పేరొందాయి. ఇందుకు కారణం పుట్టగొడుగుల్లో చర్మ ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని పెంచే విటమిన్లు అధికంగా ఉండటమే. ముఖ్యంగా వీటిలో కొవ్వు, పిండిపదార్థాలు తక్కువ. విటమిన్‌ –డి, సెలీనియమ్, యాంటీయాక్సిడెంట్ల గుణాల శాతం ఎక్కువ. దీని వల్ల ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడే పుట్టగొడుగులు ఆల్‌రౌండర్‌గా పేరొందుతున్నాయి.
*పొడిబారిన చర్మానికి..
చర్మం మృదుత్వానికి మాయిశ్చరైజర్లను పైపూతగా వాడుతుంటాం. చర్మ గ్రంధులనుంచి విడుదలయ్యే సహజనూనెలు తగ్గితే చర్మం ముడతలు, చారలు ఏర్పడి త్వరగా వయసు పైబడినట్టు కనిపిస్తారు. పోషకాలున్న పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకుంటే చర్మం పొడిబారడం సమస్య తగ్గుతుంది.
*యవ్వనకాంతికి..
పుట్టగొడుగుల్లో ఉండే పోషకాలు, ఔషధగుణాలు యవ్వనకాంతిని పెంచుతాయి. అందుకే యాంటీ ఏజింగ్‌ క్రీములు, లోషన్లు, సీరమ్స్‌ తయారీలో పుట్టగొడుగుల నూనెలను ఉపయోగిస్తుంటారు. ఈ ఉత్పాదనల అమ్మకం పెరగడం వల్లే ఈ యేడాది పుట్టగొడుగులతో తయారు చేసిన సౌందర్య ఉత్పాదనల వాడకం పెరగనుందన్నమాట.
*ఫేస్‌ప్యాక్‌
ఈ తరం యువతీయువకులు మొటిమలు, యాక్నె సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి విరుగుడుగా పుట్టగొడుగుల పొడితో ఫేస్‌ప్యాక్‌ ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు. మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు.
టీ స్పూన్‌ పుట్టగొడుగులు పొడి, మూడు టేబుల్‌ స్పూన్లు ఉడికించిన ఓట్స్, తగినన్ని నీళ్లు, రెండు చుక్కల సుగంధ నూనె, అర టీ స్పూన్‌ నిమ్మరసం తీసుకోవాలి. ముందుగా చేతులను, ముఖాన్ని చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే యాక్నె, మొటిమల సమస్యలు త్వరగా తగ్గుముఖం పడతాయి. చర్మకాంతీ పెరుగుతుంది.