Fashion

ఈ చర్మ సౌందర్య చిట్కాలు పాటించారా?

ఈ చర్మ సౌందర్య చిట్కాలు పాటించారా?

క్షణాల్లో మీ చర్మ సమస్యలను తీర్చడంతోపాటు మిమ్మల్ని అందంగా ఉంచే ఐదు సులభమైన చిట్కాలు.

అందంగా ఉండటమే కాదు. అందాన్ని కాపాడుకోవడం కూడా కష్టమే. కానీ, బిజీ లైఫ్‌లో అందంపై శ్రద్ధ చూపడం చాలా కష్టం. కొందరైతే బద్దకం వల్ల అందంపై అస్సలు దృష్టి పెట్టరు. అంతా అయిపోయాక అయ్యో.. అని బాధపడిపోతారు. ఈ విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకేలా ఉంటారు. అయితే, అమ్మాయిలు కొంచెం ఎక్కువ శ్రద్ధే పెడతారు. కానీ అబ్బాయిలు మాత్రం.. ఏదో ఓ క్రీమ్ రాసుకుని సరిపెట్టేసుకుంటారు. పెద్దగా సమయం కేటాయించకుండా ఈ ఈజీ టిప్స్‌తో మీ అందాన్ని కాపాడుకోచవచ్చు. అవేంటో చూసేయండి మరి.

1. జిడ్డు వదలాలంటే..: ముఖం జిడ్డుగా కనిపిస్తే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారు తమతోపాటు ఒక చిన్న పౌడర్ డబ్బా వెంట పెట్టుకోవడం మంచిది. అందరి ముందు పౌడర్ రాసుకోవడం బాగోదు కాబట్టి.. ఫేస్ శానిటైజర్‌ను వెంట తీసుకెళ్లండి. ఇది మీ ముఖాన్ని ఫ్రెష్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. చేతిలో జస్ట్ రెండు చుక్కలు శానిటైజర్ వేసుకుని దూదితో ముఖాన్ని తుడుచుకుంటే చాలు.. ముఖం క్లీన్‌ అవుతుంది. దూది అందుబాటులో లేకపోతే రుమాలునైనా ఉపయోగించవచ్చు.

2. ముఖం కమిలిపోయిందా?: వేసవిలో ముఖం కమిలిపోవడం సర్వ సాధారణమే. ఈ సమస్య తీరాలంటే ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటే సరిపోతుంది. ఒక వేళ లోషన్ లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో బేకింగ్ సోడా కలిపి కమిలిన చోట రాయండి. వెంటనే చర్మం సాధారణ రంగులోకి మారిపోతుంది.

3. కళ్ల వాపు సమస్య?: కొందరికి కళ్లు వాచి ముఖం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఆ సమస్య తీరాలంటే.. ఒక స్పూన్‌ను ఫ్రీజర్లో పెట్టండి. కొన్ని నిమిషాల తర్వాత స్పూన్ బయటకు తీసి కంటిపై 20 సెకన్లు ఉంచండి. ఇలా కొన్ని నిమిషాలపాటు చేస్తే కళ్ల వాపు తగ్గి.. మీ ముఖం మళ్లీ అందంగా మారుతుంది.

4. మొటిమలతో సమస్యా?: మొటిమలు తగ్గేందుకు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏవేవో క్రీములు కొంటారు. అవి పనిచేయకపోతే బాధపడతారు. అయితే, ఈ సమస్యను మీ ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. ఇందుకు కలబంద మొక్క ఉంటే చాలు. కలబంద మధ్యలో ఉండే జిగురు తీసుకుని ముఖంపై మర్దనా చేయాలి. తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది.

5. కాలిన గాయాలకు: వంట చేస్తున్నప్పుడు ముఖం మీద ఆయిల్ పడి కాలిందా? అందుబాటులో ఐస్ ఉన్నట్లయితే అక్కడ రాయండి? లేకపోతే, ఒక టీస్పూన్ తేనెను కాలిన చోట రాస్తే మంట తగ్గుతుంది. అది గాయాన్ని నయం చేసి చర్మాన్ని మాయిచ్చరైజ్ చేస్తుంది.