రాష్ట్రంలో మూడు రోజులుగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతుల కోసం పలు సూచనలు చేస్తున్నారు.
రాబోయే వారంరోజుల్లో వర్షాలు పడే సూచనలున్నందున రైతులు వర్షాధారంగా సాగు చేసే సోయా, జొన్న, కంది, పెసర, పత్తిలాంటివి విత్తుకోవాలి.
నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇదే అనువైన సమయం.
రైతులు తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్ 15048) విత్తనాలతో జూలై 10 నుంచి 25వ తేదీ వరకు నారు పోసుకోవాలి.
పెసర, సోయాచిక్కుడు పంటల్లో కిలో విత్తనానికి 2.5 గ్రా. కార్బండజిమ్, 30 గ్రా. కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.
కంది, పత్తి (1:4 లేదా 1:6), కంది, జొన్న (1:4), కంది, సోయా (1:7) పంటల్ని అంతరపంటలుగా వేసుకోవాలి.
కూరగాయలు..
కూరగాయ పంటలో రసం పీల్చే పురుగులు కనిపిస్తే, నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా.ఎసిఫేట్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.టమాట, వంగ, మిరప నారుమళ్లు పోసుకోవాలి.
నీటి వసతి గల ప్రాంతాల్లో బెండ, చిక్కుడు, తీగజాతి కూరగాయలను విత్తుకోవాలి.
అధిక వర్షాలు, ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల కూరగాయ పంటల నారుమళ్లలో నారుకుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉన్నది. దీని నివారణకు కింది యాజమాన్య పద్ధతులు పాటించాలి…
3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును ఒక లీటరు నీటికి కలిపి నారుమడిని పూర్తిగా తడపాలి.
నారుమళ్లలో మురుగునీటి వసతిని ఏర్పాటు చేసుకోవాలి.
విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, 3 గ్రాముల కాప్టాన్ చొప్పున విత్తనశుద్ధి చేస్తే, నారుమడిలో రసం పీల్చే పురుగులు, ఆకుమచ్చ తెగుళ్లను నివారించవచ్చును.
విత్తనాలను ఎత్తైన నారుమళ్లలో 10 సెం. మీ. ఎడంతో వరుసలలో విత్తుకోవాలి.