WorldWonders

బడ్వైజర్ బీరులో మానవ మూత్రం!

Budweiser Fake News

ప్రపంచవ్యాప్తంగా బీర్ల తయారీలో ప్రసిద్ధి పొందిన బడ్వైజర్ బ్రాండ్‌కు అమెరికాలోని కొలరాడోలో పెద్ద ప్లాంట్ ఉంది. ఆ దేశానికి కావాల్సిన బీరులో అధిక శాతం ఆ ప్లాంటు నుంచే ఉత్పత్తి అవుతోంది. అయితే గత 12 ఏళ్లుగా ఆ ప్లాంట్‌లో పని చేస్తున్న వాల్టర్‌ పావెల్‌( పేరు మార్చారు) అనే వ్యక్తి బీరు ట్యాంకులో మూత్రం పోస్తున్నట్లు పెద్ద బాంబునే పేల్చాడు. ఈ విషయంపై వాల్టర్‌ను నిలదీయగా అతనిచ్చిన సమాధానం వింటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. ఆ వ్యక్తి మాట్లాడుతూ.. ‘ జాయిన్‌ అయిన మొదటి రెండు సంవత్సరాలు ట్యాంకు కింది భాగంలో నీళ్లు కలిపే పని చేసేవాడిని. ప్లాంట్‌లో సీనియర్లతో పరిచయం పెరిగిన తర్వాత పైభాగంలో పని చేసే అవకాశం లభించింది. బీర్ ట్యాంకులో మూత్రం ఎందుకు పోశావని నిలదీస్తే మాత్రం నా దగ్గర కచ్చితమైన సమాధానం లేదు. ఆ పని ఎందుకు చేశానో నాకే తెలీదు. బేసిగ్గా నాకు బద్ధకం ఎక్కువ. వాష్ రూమ్ కోసం అంత దూరం వెళ్లాలా? అనిపించేది, ప్రకృతి ఎప్పుడు పిలిచినా ట్యాంకులోనే పని కానిచ్చేవాడిని. ఒక్కోసారి మా ఇంటివాళ్లు బీర్‌ తెమ్మన్నప్పుడు చాలా భయపడిపోయేవాడిని. అయినా కొలరాడోలోని ఫోర్ట్‌ కొలిన్స్‌ ప్లాంట్‌లో మాత్రమే ఈ పని చేశాను’ అంటూ సమాధానమిచ్చాడు. ‘ పైగా ఈ విషయం ఇప్పుడు మీకు తెలిసిపోయింది కాబట్టి ఇక మీదట నేను అలా చేయను.. ఇప్పటినుంచి బడ్వైజర్‌ ప్రియులు నాణ్యమైన బీర్‌ను పొందుతారు ‘ అంటూ వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా కంపెనీ యాజమాన్యం సదరు వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించకపోవడంపై పలు అనుమానాలకు తావిచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన బడ్వైజర్‌ కంపెనీలో 12 ఏళ్లుగా ఒక వ్యక్తి బీరు ట్యాంకులో మూత్రం పోయడం సాధ్యమేనా అనే అనుమానాలు కలిగాయి. ఆ వ్యక్తి చెప్పిందంతా నిజమేనా.. కాదా.. అనేది తెలుసుకోవడానికి ఒక సంస్థ దీనిపై అధ్యయనం చేసింది. వీరి అధ్యయనంలో ఇదంతా నిజం కాదని, ఫూలిష్‌ హ్యూమర్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ సంస్థ సరదాగా క్రియేట్‌ చేసిన ఫేక్‌ న్యూస్‌ అని తేలింది. కానీ వారు రాసిన ఈ వార్త మాత్రం బీరు ప్రియుల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ విషయంపై బడ్వైజర్‌ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.