* తిరుపతిలో చేపట్టిన 104, 108 వాహనాల రథయాత్ర ప్రారంభ సమావేశం ఏర్పాట్లలో తప్పిదం దొర్లింది. సమావేశ వేదికకు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పక్కన కొంచెం చిన్నదిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటో పెట్టారు. ఫ్లెక్సీకి మరో వైపు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్ ఫొటోలు ఉన్నాయి.
* సరిహద్దుల్లో మీరు ఉండబట్టే దేశం మొత్తం నిశ్చితంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ జవాన్లనుద్దేశించి అన్నారు. లద్దాఖ్‌లో మోదీ ఈరోజు ఆకస్మికంగా పర్యటించారు. అనంతరం సైనికులనుద్దేశించి ప్రసంగించారు. ‘అమరులైన సైనిక వీరులకు మరోసారి నివాళలర్పిస్తున్నాను. ఇవాళ దేశ ప్రజలందరి ఆశీస్సులు మీతో ఉన్నాయి. మీ శౌర్య పరాక్రమాల గురించి దేశంలో ఇంటింటా మాట్లాడుకుంటున్నారు. ఈ భూమి 130 కోట్ల మంది భారతీయులకు ప్రతీక. 14 కార్ప్స్ సైనికుల పరాక్రమం గురించి దేశం నలుమూలలా మాట్లాడుకుంటున్నారు. మీ సాహస గాథలు దేశంలోని ప్రతి ఇంటిని చేరాయి. శత్రువులకు మీ పరాక్రమ జ్వాల ఏంటో చూపించారు’ అని ప్రధాని సైనికుల ధైర్య సాహసాల్ని కొనియాడారు.
* కరోనా వైరస్‌కి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకాను అందుబాటులోకి తెచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే.. ఆగస్ట్ 15 నాటికి మార్కెట్లోకి విడుదల చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్యల్లో భాగంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ కోసం తెలుగు రాష్ట్రాల్లో రెండు కేంద్రాలతో పాటు దేశ వ్యాప్తంగా మొత్తం 12 సెంటర్లను ఎంపిక చేసింది. ఏపీలో విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిని ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతిచ్చింది. ఇక్కడ పరీక్షలకు నోడల్ అధికారిగా డాక్టర్‌ప్రభాకర్ రెడ్డిని నియమించింది.
* వ్యవస్థలో మార్పు తెచ్చేందుకే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ప్రారంభించినట్టు ఏపీ సీఎం జగన్ అన్నారు. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగుల సమస్యలను పాదయాత్రలో చూశాననని చెప్పారు. ఆయన ఆన్‌లైన్ ద్వారా ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు గతంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీసుకొచ్చారు. ఉద్యోగులకు అన్యాయం చేసేలా చేశారు. వ్యవస్థను పూర్తిగా మార్చి పారదర్శకత తీసుకురావాలనే మేం ఈ చర్యలు చేపట్టాం’’ అన్నారు.
* నగర ప్రజలు కరోనా వైరస్ విషయంలో ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. ఈ నగరం ఎంతో సురక్షితమైందని పేర్కొన్నారు. దిల్లీ, ముంబయి, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే నగరంలో మరణాల సంఖ్య స్వల్పంగా ఉందని స్పష్టం చేశారు. జనతా కర్ఫ్యూ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలు తమ కర్తవ్యం నిర్వర్తించారని ప్రశంసించారు. ప్రజా శ్రేయస్సు విషయంలో పోలీసు శాఖ ఎంతో అప్రమత్తంగా ఉందని వెల్లడించారు.
* బీసీలపై ప్రభుత్వం దాడులు చేస్తోందని పేర్కొంటూ విశాఖ జిల్లా తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ నిరసన వ్యక్తంచేశారు. తన చేతులకు సంకెళ్లు వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం తీరుపట్ల విశాఖలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలకు స్థానం లేదు. బీసీలను హంతకుల మాదిరి చిత్రీకరించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. మంచిపేరు ఉన్న తెదేపా నేతలపై బురదజల్లేందుకు వైకాపా నడుంకట్టింది. ఇప్పటివరకు 65మంది తెదేపా నేతలపై కేసులు పెట్టారు’’ అని ధ్వజమెత్తారు.
* ప‌్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో పర్యటిస్తున్న విషయం తెలియగానే చైనా ఉలిక్కిపడింది. ప్రధాని పర్యటనపై వెంటనే చైనా విదేశాంగశాఖ స్పందించింది. ‘సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇప్పటికే ఇరుదేశాలు సైనిక, దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నాయి. ఇలాంటి సమయంలో పరిస్థితి తీవ్రతను పెంచే ఎలాంటి చర్యల్లో ఎవ్వరూ పాల్గొనకూడదు’ అని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ ప్రకటించారు. మోదీ లద్దాఖ్ పర్యటనపై తన అసంతృప్తిని వెళ్లగక్కింది.
* ఇప్పటికే ప్రపంచమంతా కొవిడ్-19తో అతలాకుతలమవుతుంటే.. శాస్త్రవేత్తలు మరో చేదు నిజాన్ని వెలుగులోకి తెచ్చారు. రోజురోజుకీ కరోనా వైరస్ జన్యుక్రమంలో వస్తున్న పరివర్తనంతో మనుషులకు సోకే సామర్థ్యం మరింత మెరుగుపడుతోందని గుర్తించారు. ఈ మేరకు ‘జర్నల్ సెల్’ అనే మ్యాగజైన్‌లో పరిశోధకులు తమ అధ్యయనాన్ని ప్రచురించారు. ఆ అధ్యయనం ప్రకారం.. కొవిడ్-19కు కారణమవుతున్న కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ అనేక రకాలుగా ఏర్పడుతోంది. వీటిలో ‘డీ614జీ’ అనేది ఓ రకం. దీనికి మనుషులకు సోకే సామర్థ్యం భారీ స్థాయిలో ఉన్నట్లు ప్రయోగశాలలో జరిపిన పరీక్షల్లో తేలింది.
* అంతర్జాతీయ క్రికెట్ ఆగిపోయి దాదాపు నాలుగు నెలలు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికీ కొన్ని దేశాల్లో సాధన చేసేందుకూ అనువైన పరిస్థితులు లేవు. అలాంటిది ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఏకంగా మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. బయో సెక్యూర్ వాతావరణంలో సౌతాంప్టన్ వేదికగా జులై 8 నుంచి తొలి మ్యాచ్ ఆరంభం కాబోతోంది. బంతిపై ఉమ్మి రాయడం నిషేధం, సంబరాలపై ఆంక్షల నేపథ్యంలో సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ వ్యవహారంలో చైనా తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. ఈసారి కరోనావైరస్‌ను ‘చైనా నుంచి వచ్చిన ప్లేగు’గా అభివర్ణించారు. ఎప్పటికీ సంభవించకూడదనుకున్న దాన్ని చైనా పునరావృతం చేసిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇలా జరగడానికి చైనానే కారణమని మరోసారి ఆరోపించారు. సరికొత్త వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి, ఆ సిరా ఆరకముందే ఈ మహమ్మారి బయటపడిందన్నారు. వైట్‌హౌజ్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ఈ విధంగా స్పందించారు. తాజాగా జులై మాసాన్ని ‘అమెరికా కార్మికుల నెలగా వాగ్దానం’ చేసిన ప్రకటనపై ట్రంప్ సంతకం చేశారు.
* భద్రాద్రి పవర్‌ప్లాంట్ రెండో యూనిట్‌కు 270 మెగావాట్లు అనుసంధానించామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. రెండో ప్లాంటు నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు. కొందరు కోర్టుల్లో కేసులు వేయడం వల్ల ఆలస్యమైందని పేర్కొన్నారు. మరో నెలన్నరలో మూడో యూనిట్‌ను ఆరంభిస్తామని స్పష్టం చేశారు. ‘విద్యుత్ బిల్లుపై కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ అంశాలపై అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్రానికీ ప్రజలకూ ఉపయోపడే విధంగా బిల్లు లేదని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రధానికి లేఖరాశారు. రాయితీలు పొందే వారికి, రైతాంగానికి బిల్లుతో తీవ్ర నష్టం వస్తుంది. చిన్న చిన్న వినియోగదారులు సబ్సిడీలను కోల్పోతారు. విద్యుత్ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది’ అని జగదీశ్ రెడ్డి అన్నారు.