* గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన పసిడి గత రెండు రోజులుగా తగ్గుతూనే వస్తోంది.బంగారం ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ ఉంది.బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు.అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గుదల కారణంగా దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.470 దిగొచ్చింది.దీంతో ధర రూ.46,270కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది.హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.70 తగ్గుదలతో రూ.50,880కు క్షీణించింది.పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర గత రెండు రోజుల్లో ఏకంగా రూ.1500 దిగొచ్చింది.దీంతో ధర రూ.48,550కు పడిపోయింది.పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది.పసిడి ధర ఔన్స్‌కు 0.13 శాతం తగ్గింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1787 డాలర్లకు పడిపోయింది.బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.వెండి ధర ఔన్స్‌కు 0.04 శాతం తగ్గుదలతో 18.31 డాలర్లకు క్షీణించింది.
* ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మల నాశనం చేశారని ఆరోపించారు. ఇలాంటి పనికిరాని ఆర్థికమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఆమె ఓ కాలనాగు అని, పాము కాటుకు మనునుషులు చనిపోయినట్లుగా, నిర్మల ఆర్థిక వ్యవహారాల కారణంగా సామాన్య జనం చనిపోతున్నారని మండిపడ్డారు. పెంట్రోల్ ధరల పెంపుకు నిరసనగా ఆదివారం బంకురా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికమంత్రి పదవికి నిర్మల వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైల్వేలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆయన వ్యతిరేకించారు.కాగా, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. తన పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్టు కోల్పోయారని రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు. టీఎంసీ ప్రభుత్వంలో అవినీతి ఘోరంగా పెరిగిపోయిందని, కిందిస్థాయి నేతల నుంచి పెద్దస్థాయి నేతల వరకు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఎంసీలో అంతర్గత వైరుధ్యం మొదలైందని, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.ఇలాంటి వ్యాఖ్యలకు తాము పెద్దగా ప్రాధాన్యత ఇవ్వమని, నిరాశతో ఇలాంటి అర్ధంలేని మాటలు చెబుతున్నారని దిలీప్ వ్యాఖ్యానించారు
* భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో చేపట్టే 5జీ నెట్‌వర్క్ ప్రక్రియలో హువాయి, జడ్‌టీఈ కార్పొరేషన్‌లు పాల్గొనకుండా నిషేధించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అఖిలభారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ఈ మేరకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశాయి. భద్రతా కారణాల దృష్ట్యా హువాయి, జడ్‌టీఈలను 5జీ నెట్‌వర్క్‌లో పాల్గొనేందుకు అనుమతించరాదని మంత్రికి రాసిన లేఖలో సీఏఐటీ విజ్ఞప్తి చేసింది. ఈ చైనా కంపెనీలపై అంతర్జాతీయంగా గూఢచర్యం, కుట్ర, మనీల్యాండరింగ్ వంటి పలు నేరారోపణలు నమోదయ్యాయని పేర్కొంది.
* 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులను దాఖలు చేసే గడువును నవంబర్ 30 దాకా పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆదాయపన్ను శాఖ శనివారం ప్రకటిం చింది. రెండురోజుల క్రితమే ఐటీ రిటర్న్‌ల గడువును ఈనెల 31కి పెంచిన కేంద్రం… తాజాగా మరో 4 నెలలు అవకాశం ఇచ్చింది. టీడీఎస్, టీసీఎస్ సర్టిఫికెట్లను జారీ చేసేం దుకు ఆఖరు తేదీని కూడా ఐటీశాఖ ఆగస్ట్ 15 దాకా పెంచింది. ‘ప్రస్తుత పరిస్థితు ల దృష్ట్యా నవంబర్ 30 దాకా రిటర్న్‌ల దాఖలుకు అవకాశం కల్పిస్తున్నాం’ అని ఐటీశాఖ వెల్లడిం చింది. ఐటీ కడుతున్నపుడు హౌసింగ్ లోన్లు, జీవిత బీమా, పీపీఎఫ్ ఇతరత్రా మినహాయిం పులను క్లెయిమ్ చేసుకొనే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. వీటి కింద ఈ నెల 31వ తేదీ దాకా చేసిన అన్ని రకాల మదుపులను 2019–20 రిటర్నులలో క్లెయిమ్ చేసుకోవచ్చు.
* కొవిడ్-19 ప్రభావం ప్రజా రవాణాపై అధికంగా పడింది. బస్సులు, రైళ్లు, విమానాలతో పాటు క్యాబ్‌లలో ప్రయాణానికీ పలు ఆంక్షలుండగా, అందుబాటులో ఉన్న వాటిలో వెళ్లేందుకు ప్రజలూ వెనుకాడుతున్నారు. వినోద రంగమైతే పూర్తిగా మూతబడింది. సినిమా థియేటర్ల గేట్లు మూతబడి 100 రోజులు దాటగా, సినీ-మ్యూజికల్ తారలు పాల్గొనే వినోద కార్యక్రమాల వంటివీ నిర్వహించే పరిస్థితి లేదు. ఈ రంగాలకు టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన సంస్థల ఆదాయం భారీగా క్షీణించింది. ఫలితంగా ఉద్యోగుల తొలగింపు, మిగిలిన వారికి వేతనాల్లో భారీ కోత విధిస్తున్నారు.