* భారత్- అమెరికా మధ్య 36 విమాన సర్వీసులను నడపాలని ఎయిరిండియా నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి 19 వరకు ఈ సర్వీసులు నడపనున్నారు. వందేభారత్ మిషన్‌లో భాగంగా అమెరికాకు విమానాలు నడపనున్నట్లు ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం వందేభారత్ మిషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
* ఆంధ్రప్రదేశ్‌లోని పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం కొత్త తేదీని ఖరారు చేసింది. ఆగస్టు 15న లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇంటి స్థలం పట్టాను మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామని బొత్స వెల్లడించారు. మొత్తం 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బొత్స తెలిపారు. వాస్తవానికి జులై 8న జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
* ప‌్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి తాజాగా ఆస్ట్రేలియాలోనూ విజృంభిస్తోంది. దీంతో అధిక జనాభా కలిగిన రాష్ట్రాల సరిహద్దులను మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. న్యూసౌత్ వేల్స్‌తో ఇతర ప్రాంతాలకు రాకపోకలను నిషేధిస్తున్నట్లు విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ ప్రకటించారు. రాష్ట్రంలో ఒకేరోజు 127 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో పాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆండ్రూస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆస్ట్రేలియాలో రాష్ట్రాల సరిహద్దులు మూయడం మాత్రం వందేళ్లలో ఇదే తొలిసారి. గతంలో స్పానీష్ ఫ్లూ వచ్చినప్పుడు మాత్రమే ఇలా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు నిలిపివేసినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.
* ‘‘లాక్‌డౌన్ ఎత్తేయగానే ప్రజలకు ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పుడు ఉపాధి లేక ప్రజలు చస్తూ బతుకుతున్నారు’’ అని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, ప్రజల ఇబ్బందుల గురించి ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు. ఉపాధి లేక కారం మెతుకులు తిని బతుకుతున్నామని బస్తీ వాసులు చెబుతున్నారని కోదండరాం తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ చికిత్స అందరికీ అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి రూ.7,500 నగదు ఇవ్వాలి. మనిషిని కాపాడటమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం. ప్రతి బస్తీలో పర్యటించి ప్రజలు సమస్యలు తెలుసుకుంటాం’’ అని కోదండరాం చెప్పారు.
* కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై భారతీయ జనతాపార్టీ తీవ్ర విమర్శలు చేసింది. పదేపదే సైనికుల పరాక్రమాన్ని ప్రశ్నిస్తూ వారి స్థైర్యాన్ని దెబ్బతీస్తున్న ఆయన ఒక్కసారీ రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరుకాలేదని నొక్కిచెప్పింది. ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేమీ ఆయనకు లేవని భాజపా అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఎద్దేవా చేశారు.
* ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు చేసే పోరాటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంఘీభావం తెలిపారు. రాజధాని పోరాటం 200 రోజులు దాటిన సందర్భంగా ఆయన రైతుల గురించి మాట్లాడారు. ‘‘రాజధాని కోసం రైతులు 34 వేల ఎకరాలను త్యాగం చేశారు. రాజధాని మార్పుపై ఏకపక్ష నిర్ణయం రైతులను అవమానించడమే. రాజధాని రైతులు, మహిళలు 200 రోజులుగా పోరాటం చేస్తున్నారు. వారికి జనసేన మద్దతు ఉంటుంది. వారి త్యాగాలను వృథా కానీయం’’అని పవన్ కల్యాణ్ అన్నారు.
* లాక్‌డౌన్ వేళ బీపీఎల్ కుటుంబాలు, ఎంఎస్‌ఎంఈలకు విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లక్షలాది మంది విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లుల్లో లోపాలపై ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ గానీ, ఇంధన శాఖ గానీ ఎలాంటి దిద్దుబాటు చర్యలూ తీసుకోలేదన్నారు. పెరిగిన, తప్పుడు బిల్లులను సకాలంలో చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు బెదిరిస్తున్నారన్నారు. విద్యుత్‌బిల్లులన్నింటినీ టెలిస్కోపిక్ విధానంలో సవరిస్తే బిల్లులు భారీగా తగ్గుతాయని తెలిపారు.
* ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై నియమించిన హైపవర్ కమిటీ తన నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సమర్పించింది. ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ఘటన తీరు, కారణాలపై కమిటీ విచారణ జరిపింది. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులతో కూడిన నివేదికను హైపవర్ కమిటీ సీఎం జగన్‌కు అందజేసింది.
* గల్వాన్ ఘర్షణ అనంతరం వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం జరిగిన పరిణామాలతో సరిహద్దు ప్రాంతం నుంచి తొలిసారిగా చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. ఇరుదేశాల కోర్ కమాండర్ స్థాయి అధికారులు జరిపిన చర్చలు పురోగతి సాధించడంతో సరిహద్దు నుంచి చైనా బలగాలు కిలోమీటరు మేర వెనక్కి వెళ్లినట్లు సైనికవర్గాలు వెల్లడించాయి.
* భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో కొవిడ్ పరీక్షలను పెంచడం అనివార్యమయ్యింది. దీనిలో భాగంగా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) దేశంలో నిత్యం దాదాపు రెండున్నర లక్షల శాంపిళ్లను సేకరించి కొవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం 11గంటల వరకు దేశంలో 1,00,04,101 శాంపిళ్లకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.
* చైనాలో బుబోనిక్ ప్లేగు మహమ్మారి మరోసారి విజృంభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని కేసులను అక్కడి ఆసుపత్రులు నిర్ధరించాయి. ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్‌లోని బైయన్నూరు ప్రాంతంలో ఇద్దరికి ఈ వ్యాధి సోకింది. వీరిని వేర్వురు ఆసుపత్రుల్లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. వీరితో సంబంధాలు ఉన్న 146 మందిని ఐసోలేట్ చేశారు.