Fashion

అంతర్జాల అమ్మల అసోసియేషన్

అంతర్జాల అమ్మల అసోసియేషన్

ఇరవై సంవత్సరాలకి, ఇప్పటికి పోలికే లేదు. మధ్యాహ్నం పన్నెండుకల్లా పనులు ముగించుకొని అమ్మలక్కలు ఆరుబయట అరుగుల మీద చేరి పనులు పంచుకొనేవారు, ఆలోచనలూ పంచుకొనేవారు. అవి కాలక్షేపం కబుర్లు మాత్రమే కాదు.. కష్టసుఖాల కలబోత, అనుభవాల ఆరబోత, పెద్ద ఇల్లాలి నుంచి కొత్త కోడలికి దొరికే మార్గదర్శనం. ఇప్పుడు అరుగుల్లేవు, అమ్మలక్కల కబుర్లూ లేవు. ఇక, మార్గదర్శనానికి అవకాశం ఎక్కడుంది? ఆ లోటును పూడ్చడానికి పుట్టిందే ఆన్‌లైన్‌ అమ్మల సంఘం.
***కాలం మారిపోయింది. ప్రపంచ వేగం పెరిగింది. జీవితంలో పరుగు అనివార్యమైంది. ఇంటికి దీపమైన ఇల్లాలు ప్రపంచానికి వెలుగు పంచడానికి గడపదాటింది. మరింత బాధ్యత మోసేందుకు సిద్ధ్దపడింది. కుటుంబాలు చిన్నవయ్యాయి. పిల్లలు వేరు పడ్డారు. మరి, కొత్త కాపురానికి ఎవరు దారి చూపుతారు? అనుమానాలు తీర్చే వారేరీ? అలాంటి అండే అందిస్తున్నది తెలుగు మామ్స్‌ నెట్‌వర్క్‌ గ్రూప్‌.
***తెలుగు మామ్స్‌ నెట్‌వర్క్‌ అనేది ఒక ఫేస్‌బుక్‌ గ్రూప్‌. ఈ బృందంలో రకరకాల ప్రాంతాల్లో నివసించే అమ్మలంతా సభ్యులు. వయో పరిమితి లేదు. అమ్మల నుంచి అమ్మలకు అమ్మల వరకూ ఎవరైనా చేరవచ్చు. భిన్న రంగాల్లో నిష్ణాతులు, వృత్తి ఉద్యోగాల్లో పండిపోయిన వారు.. ఈ గ్రూప్‌లో ఉన్నారు. అమ్మలంతా ఒకరికొకరు బాసటగా నిలుస్తున్నారీ.. ఇ- అరుగు మీద! ప్రస్తుతం గ్రూప్‌లో నాలుగు వేల ఎనిమిది వందల మంది సభ్యులు ఉన్నారు.
***తెలుగులో తొలిసారి
ఫేస్‌బుక్‌లో చాలా గ్రూపులే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి అమ్మల గ్రూప్‌లూ అనేకం ఉన్నాయి. కానీ ఆ బృందాలు ఇంగ్లిష్‌ మాధ్యమంగా నడుస్తున్నాయి. అందువల్ల అచ్చ తెలుగు అమ్మలకు, అమ్మాయిలకు తమను తాము వ్యక్తం చేసుకునే అవకాశాలు ఉండవు. ‘నాకు కూడా, ఒకప్పుడు అలాంటి గ్రూప్‌లలో సభ్యత్వం ఉండేది’ అంటారు ఈ గ్రూప్‌ను రూపొందించిన ప్రదీప్తి. ‘అవన్నీ పరభాషా మహిళల ఆధ్వర్యంలో నడిచేవే. సహజంగానే తెలుగులో తమ భావాల్ని పంచుకోవాలని అనుకునే వారికి పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. అదంతా గమనించిన తర్వాత, మనం తెలుగులో ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదూ అన్న ఆలోచన వచ్చింది’ అని చెప్పుకొచ్చారు ఆమె. 19 సెప్టెంబర్‌ 2019న ఫేస్‌బుక్‌ వేదికగా ఈ గ్రూప్‌ను రూపొందించారు. దీనివల్ల మాతృభాషలో వ్యక్తీకరణకు ఆస్కారం ఉంటుందనేది ఆమె ఆలోచన. అందువల్ల సమస్యలకు పరిష్కారం కూడా సులువుగానే లభిస్తుంది. కాబట్టే, ‘తెలుగు మామ్స్‌’ అని పేరు పెట్టారు అమె.
***గోప్యత కూడా
జీవితం అంటేనే సమస్యల సమాహారం. నిత్యం ఏదో ఓ సవాలు ఎదురవుతూనే ఉంటుంది. ఒత్తిడి వల్ల కావచ్చు, అనుభవరాహిత్యం వల్లా కావచ్చు. చాలాసార్లు జవాబులు తోచవు. కొన్నిసార్లు దగ్గరి వారితో పంచుకొనే అవకాశం కూడా ఉండదు. ఏవో మొహమాటాలు. అలాంటి సందర్భాలలో పేరు చెప్పడం ఇష్టం లేని వారు అనామికగా తమ సమస్యలను వేదిక మీద చర్చించే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌లోని నిపుణులు స్పందించి సమాధానాలు ఇస్తుంటారు. సమష్టిగా పంచుకునే అవకాశం ఉండటం వల్ల సమస్య ఒకటే అయినా రకరకాల పరిష్కారాలు, సూచనలు లభిస్తాయి. సమస్యను 360 డిగ్రీల కోణంలో విశ్లేషిస్తారు. అవతలి వారికి అది కొండంత అండ. గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.
***తొలి భేటీ
‘అనతి కాలంలోనే వెయ్యిమంది వరకు సభ్యులుగా చేరడం చాలా సంతోషంగా అనిపించింది. గ్రూప్‌ మొదలైన మూడు నెలల్లోనే.. నవంబర్‌ చివరి వారంలో అందరం కలుద్దామని అనుకున్నాం. మొదటి సారి దాదాపుగా 50 మంది అమ్మలం సంజీవయ్య పార్క్‌ వేదికగా కలుసుకున్నాం. ఎన్నో ఆలోచనలు కలబోసుకున్నాం. అప్పుడే తరచూ సమావేశం కావాలని నిర్ణయించుకున్నాం. రెండోసారి పిల్లలతో కలిసి మై ప్లే డేట్‌ వేదికగా భేటీ అయ్యాం. యాభై మంది పిల్లలతో అరవై మంది అమ్మలం ఒకచోట చేరాం. అంతా ఆనందంగా గడిపాం’ అని పాత ముచ్చట్లు తలచుకున్నారు ప్రదీప్తి.
***స్వయం ఉపాధికి అండగా…
ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. దాన్ని ప్రదర్శించుకొనే అవకాశం టీఎమ్‌ఎన్‌లో లభిస్తుంది. ప్రతినెలా మొదటి వారంలో ఆ నెలలో పుట్టిన వారి వివరాలు సేకరించి, పొద్దున్నే పుట్టినరోజు శుభాకాంక్షలు అందించడంతో రోజు మొదలవుతుంది. బుధవారం ‘మామ్‌ ప్రెన్యూర్స్‌’ కోసం కేటాయించారు. ఆరోజున ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించుకోవచ్చు. అలాగే శనివారం వంటలు పంచుకోవచ్చు. మొదట్లో ఇంట్లో చేసిన వంటలు రికార్డ్‌ చేసి షర్‌ చేసుకొనేవారు. ఇప్పుడు చాలామంది యూట్యూబ్‌లో వంటల చానెళ్లు నడుపుతున్నారు. అలా, అమ్మల్లో దాగిన నైపుణ్యాలు వెలుగులోకి రావడానికి గ్రూప్‌ ఒక మాధ్యమంగా ఉపయోగపడుతున్నది. అన్ని రకాల అభిరుచులకు ఇక్కడ ప్రోత్సాహం లభిస్తుంది. చదివిన పుస్తకాలను పరిచయం చేస్తారు. మెచ్చిన సినిమాల సమీక్షలు రాసుకుంటారు. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లొస్తే ప్రయాణ అనుభవాలు పంచుకొంటారు. గ్రూప్‌ సభ్యులు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విరాళాలు ఇవ్వగలిగిన వారి నుంచి కొంత డబ్బు సమీకరించి..అన్నదానం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చెయ్యాలన్న ఆలోచన ఉందని ప్రదీప్తి వెల్లడించారు.
**గుర్తింపునిచ్చింది-భవాని
‘అమ్మకేమీ తెలీదు’ అనేది సర్వసాధారణంగా వినిపించే మాట. కానీ అది నిజం కాదు అమ్మకు చాలా తెలుసు. తనకు తెలిసిన విషయాల్ని ప్రపంచానికి అందించే వేదిక ఆమెకు కావాలి. అలాగే ఆమె అనుమానాలు తీర్చే ఒక ఆలంబన అవసరం. ఆ పని మామ్స్‌ నెట్‌వర్క్‌ చేస్తుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సన్‌డే బజార్‌ ప్రారంభించే ఆలోచన ఉంది. ప్రతి ఆదివారం లైవ్‌ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకొంటున్నాం. ఇక్కడ స్లాట్‌ బుక్‌ చేసుకోవడం ద్వారా వాళ్ల ఉత్పత్తులను లైవ్‌లో ఒక గంట పాటు ప్రదర్శించి ప్రమోట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. గ్రూప్‌ మొదలైన రోజునుంచి కూడా చాలామంది ఇంటినుంచి చేసుకునే పనుల గురించి, స్వయం ఉపాధి గురించి అడుగుతున్నారు. ఆ తరహా మద్దతు అందించేందుకు ఏం చేస్తే బావుంటుందనే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం ఐదు వేల మైలురాయికి చేరువలో ఉన్నాం. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నా. ముగ్గురు స్త్రీలు కలిసుండలేరన్న నానుడిని అబద్ధం చేస్తూ మనం 30 వేల మందిమైనా, 3 లక్షల మందిమైనా కలిసికట్టుగా పనులు చేస్తామని నిరూపించాలి.