DailyDose

BSNL ఆస్తుల అమ్మకం-వాణిజ్యం

BSNL ఆస్తుల అమ్మకం-వాణిజ్యం

* దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐదు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 345 పాయింట్లు నష్టపోయి 36,329 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 10,705 వద్ద ముగిశాయి. ఎంఎంటీసీ, హింద్‌ కాపర్‌, సెంచురీ ప్లైబోర్డ్స్‌, స్టీల్‌ అథారిటీ, బిర్లా సాఫ్ట్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ప్రజిమ్‌ జాన్సన్‌, త్రివేణీ టర్బైన్‌, ప్రస్టీజ్‌ ఎస్టేట్‌, డిష్మన్‌ కార్బోజన్‌, శంకర బిల్డింగ్స్‌ షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు లాభాల్లో ఉండగా.. దాదాపు మిగిలిన రంగాలన్నీ నష్టాల్లో ఉన్నాయి.

* కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌)కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొంది. దీనికోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (డీఐపీఏఎం) ఇప్పటికే ఒక కన్సల్టెంట్లను నియమించింది. సీబీఆర్‌ఈ, జేఎల్‌ఎల్‌, నైట్‌ఫ్రాంక్‌ సంస్థలు ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఆస్తుల విక్రయాలకు కన్సల్టెంట్లుగా వ్యవహరించనున్నాయి. కరోనా మహమ్మారి వ్యాపించిన సమయంలో ఆస్తుల విక్రయం లాభదాయకమా? కాదా? అనే అంశాన్ని పరిశీలించనున్నాయి. ఈ నెలాఖరు నాటికి ఈ సంస్థలు తమ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. ఈ సంస్థల ఆస్తుల విక్రయాల ద్వారా ప్రభుత్వం రూ.37,500 కోట్ల ఆదాయం రావచ్చని ప్రధానితో జరిగిన సమావేశంలో అంచనా వేశారు. ఈ నేపథ్యంలో వీటి విక్రయాలను టెలికం శాఖ వేగవంతం చేసింది.

* అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్‌కు రూ.2310 కోట్ల తాజా పెట్టుబడిని అమెరికా దిగ్గజ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ అందచేసింది. అమెజాన్‌ కార్పొరేట్‌ హోల్డింగ్స్‌, అమెజాన్‌.కామ్‌.ఇన్‌క్‌ సంస్థలు ఈ నిధులను అందించాయి. ఇందుకోసం కావాల్సిన తీర్మానాన్ని అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్‌ జూన్‌ 25న నిర్వహించిన సమావేశంలో ఆమోదించింది. ఈ నిధులు అమెజాన్‌ సింగపూర్‌ నుంచి వచ్చినట్లు వ్యాపార పరిశోధనా ప్లాట్‌ఫామ్‌ టోఫ్లర్‌ తెలిపింది. దేశీయంగా మౌలిక వసతులను మరింత విస్తృతం చేసేందుకు అమెజాన్‌ చేస్తున్న యత్నాలకు సాయం చేసేందుకు, వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఈ నిధులు వెచ్చించనుంది. దేశీయంగా చిన్న, మధ్యస్థాయి వ్యాపారులను కూడా ఆన్‌లైన్‌లోకి తేవడంతో పాటు, భారత్‌లో వివిధ కార్యకలాపాలకు రూ.7500 కోట్లు (100 కోట్ల డాలర్లు) పెట్టుబడి పెడతామని ఈ ఏడాది జనవరిలో అమెజాన్‌ అధిపతి జెఫ్‌బెజోస్‌ ప్రకటించిన సంగతి విదితమే. అంతకుముందు 550 కోట్ల డాలర్ల పెట్టుబడులను సంస్థ భారత్‌కు కేటాయించింది కూడా.

* గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పవన విద్యుత్‌ సంస్థ సుజ్లాన్‌ ఎనర్జీ ఏకీకృత ప్రాతిపదికన రూ.834.22 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.294.64 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. తక్కువ ఆదాయం, అధిక ఫైనాన్స్‌ ఖర్చులు ప్రభావం చూపాయని కంపెనీ తెలిపింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1450.47 కోట్ల నుంచి రూ.658.89 కోట్లకు తగ్గింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం (2019-20)లో కంపెనీ రూ.2691.84 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2018-19లో ఇది రూ.1,537.19 కోట్లుగా ఉంది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.5074.64 కోట్ల నుంచి రూ.3000.42 కోట్లకు పరిమితమైంది. ప్రతికూల మార్కెట్‌ పరిస్థితులు ప్రభావం చూపాయని సుజ్లాన్‌ గ్రూప్‌ సీఈఓ జేపీ చలసాని అన్నారు.