పారిపోయిన ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద నీరవ్ మోదీకి సంబంధించిన రూ.329.66 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ బుధవారం వెల్లడించింది. ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో 200 కోట్ల అమెరికన్ డాలర్ల మోసానికి సంబంధించి నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చోక్సీతోపాటు మరికొందరిని ఈడీ విచారిస్తున్నది.
ఈడీ జప్తు చేసిన నీరవ్ మోదీ ఆస్తుల్లో ముంబైలోని వర్లిలోగల ఓ భవనంలోని నాలుఉ ఫ్లాట్లు, సముద్ర తీరంలోని ఒక ఫాంహౌజ్, అలీబాగ్‌లోని ఖాలీ స్థలం, జైసల్మేర్‌లోని విండ్ మిల్లు, లండన్‌లోని ఒక ఫ్లాట్, యూఏఈలోని రెసిడెన్షియల్ ఫ్లాట్లు, షేర్లు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. ఈ విషయాలను ఈడీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ముంబైలోని స్పెషల్ కోర్టులో డిసెంబర్ 5న నీరవ్ మోదీని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. గత నెల 8న అదే కోర్టు ఈడీకి నీరవ్ మోదీ ఆస్తులను జప్తు చేసే అధికారం ఇచ్చింది.
49 ఏండ్ల నీరవ్ మోదీ ప్రస్తుతం యునైటెడ్ కింగ్ డమ్‌లోని జైల్లో ఉన్నాడు. 2019 మార్చిలో లండన్‌లో అరెస్టయినప్పటి నుంచి మోదీ జైల్లో గడుపుతున్నాడు.