* కరోనా భయం నేతలను వెంటాడుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి క్యాంపు కార్యాయాలు మూసివేయాలని స్పీకర్, ఓ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం క్యాంపు కార్యాలయాలు నేటి నుంచి మూసివేశారు. గురువారం నుంచి తమని కలిసేందుకు 15 రోజులు వరకు ఎవరూ రావద్దని ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
* కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం గట్టెక్కడంలో భారత్ కీలక పాత్ర పోషించబోతోందని ప్రధాని మోదీ అన్నారు. ఇటువంటి ఎన్నో సవాళ్లను భారత్ ఇంతకుముందు అధిగమించిందని చెప్పారు. బ్రిటన్ వేదికగా నిర్వహించిన ‘ఇండియా గ్లోబల్ వీక్-2020’ సదస్సులో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచానికి భారత్ ఫార్మా రంగం సత్తా తెలిసిందని ప్రధాని మోదీ అన్నారు.
* భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సైనికులు, అధికారులు వెంటనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు తొలగించాలని ఆదేశించింది. జులై 15లోపు 89 యాప్‌లను మొబైల్ ఫోన్ల నుంచి తొలగించాలని పేర్కొంది. సమాచార భద్రతా ఉల్లంఘన, హనీట్రాప్(వలపు ఉచ్చు) వంటి ఘటనల నేపథ్యంలో సైన్యం కఠినంగా వ్యవహరిస్తోంది.
* తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. పరీక్షలను రద్దు చేయాలంటూ ఎస్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించి తీరుతామని హైకోర్టుకు తెలిపారు. పరీక్షల రద్దు కుదరని పేర్కొన్నారు. పరీక్షల తేదీలను రెండు, మూడు వారాల తర్వాత ఖారారు చేస్తామని చెప్పారు.
* ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత్, అమెరికాలోని ఆయుర్వేద నిపుణులు, పరిశోధకులు ఏకమయ్యారు. ఆయుర్వేద మందులతో సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారని వాషింగ్టన్‌లోని భారత రాయబారి తరణ్‌జీత్‌సింగ్ సంధూ అన్నారు.
* త్రైత సిద్ధాంతకర్తగా పేరు తెచ్చుకున్న ప్రబోధానంద కన్నుమూశారు. అనారోగ్యంతో ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు, భక్తులు తాడిపత్రి ఆశ్రమానికి తరలిస్తున్నారు. తాడిపత్రి మండలంలోని చిన్నపొడమల కేంద్రంగా త్రైత సిద్ధాంతం పేరుతో ప్రబోధానంద ఆశ్రమాన్ని నెలకొల్పారు. దీంతోపాటు తాడిపత్రిలో శ్రీకృష్ణ మందిరం, ఇందూ జ్ఞానవేదికలను కూడా స్థాపించారు.
* జపాన్‌లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు దక్షిణ జపాన్లో విజృంభించిన వర్షాలు తాజాగా ఈశాన్య ప్రాంతాల్ని వణికిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతూ ఇళ్లు, రోడ్లను నాశనం చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రధాన ద్వీపపు ప్రాంతాలు కూడా నీటి మునిగిపోతున్నాయి. ఈ వరదల ప్రభావంతో ఇప్పటికే 58 మంది మృత్యువాతపడ్డట్లు ప్రభుత్వం వెల్లడించింది.
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,814కి చేరింది. ఈ రోజు రాష్ట్రంలో కరోనాతో 13 మంది చనిపోయారు. వీరితో కలిపి ఇప్పటివరకు 277 మంది కరోనాతో మృతి చెందారు. ఈ రోజు నమోదైన కేసులలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 53 మంది కాగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు ఇద్దరు. రాష్ట్రానికి చెందివారు 1500 మంది.
* ఎక్కడి నుంచైనా పరిపాలన చేసే సౌలభ్యం మనకు ఉందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్, కరోనా, సచివాలయం కూల్చివేత అంశాలపై మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా నిలిచిపోయాయా? రాష్ట్ర గౌరవానికి తగినట్లు సచివాలయం ఉంటే తప్పా? భవిష్యత్‌లో ఇంకా చాలా మందికి కరోనా సోకుతుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’’అని తలసాని వ్యాఖ్యానించారు.
* తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సప్తగిరి మాసపత్రిక వివాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు పత్రిక చందాదారుడు రత్నవిష్ణు నివాసానికి తిరుపతి పోలీసులు వచ్చారు. సప్తగిరి మాసపత్రికతోపాటు సజీవ సువార్త అనే పుస్తకం రావడంపై వివరాలు సేకరిస్తున్నారు. తితిదే ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
* కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల టికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. దీని కోసం ప్రథమ్ అనే యాప్‌ను రూపొందించింది. ఈ నెల 20 నుంచి ప్రథమ్ యాప్ ద్వారా ఆర్టీసీ బస్సుల టికెట్లను జారీ చేయనున్నారు. ప్రయోగాత్మకంగా తొలుత 19 డిపోల పరిధిలో యాప్ ద్వారా టికెట్లు జారీ చేస్తామని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు.